డంపింగ్‌ యార్డుపై మళ్లీ రగడ

ABN , First Publish Date - 2021-08-04T05:12:43+05:30 IST

ఆత్మకూరు మున్సిపాలిటీలో డంపింగ్‌ యార్డు ఏర్పాటుపై మళ్లీ రగడ మొదలైంది.

డంపింగ్‌ యార్డుపై మళ్లీ రగడ
నిరసన వ్యక్తం చేస్తున్న వడ్లరామాపురం వాసులు

  1.  చెత్త నిల్వలపై  వడ్లరామాపురం వాసుల ఆందోళన 
  2.  ఆత్మకూరు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన 


ఆత్మకూరు, ఆగస్టు 3: ఆత్మకూరు మున్సిపాలిటీలో డంపింగ్‌ యార్డు ఏర్పాటుపై మళ్లీ రగడ మొదలైంది. సరైన డంపింగ్‌ యార్డు లేకపోవడంతో చెత్త తరలింపు ప్రక్రియ మున్సిపల్‌ అధికారులకు తలనొప్పిగా మారింది. ఎక్కడ చెత్తనిల్వలు వేసినా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. వాస్తవానికి గతంలో శ్రీశైలం, కొత్తపల్లి, నంద్యాల రస్తాల్లో ఊర్లలో సేకరించిన చెత్తను నిల్వ ఉంచి నిప్పటించేవారు. దీనివల్ల ఆయా రహదారులపై పొగ కమ్ముకొని ప్రమాదాలు జరుగుతున్నాయని అభ్యంతరాలు రావడంతో ఆయా రోడ్ల పక్కన చెత్తను నిల్వచేయడం నిలిపివేశారు. ఆ తర్వాత కొన్నిరోజుల పాటు భవనాశి నదిలో చెత్తనిల్వలు వేయగా పర్యావరణవేత్తలు అడ్డుకున్నారు. ఆ తర్వాత పాములపాడు మండలంలోని బానకచర్ల సమీపంలో తెలుగుగంగ భూముల్లో చెత్తను డంపింగ్‌ చేయడం మొదలుపెట్టారు. దీన్ని కూడా ఆ గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సిద్దేపల్లి రస్తాలో రోడ్లపక్కనే చెత్తనిల్వలు చేపట్టారు. అయితే సిద్దేపల్లి, ముష్టేపల్లి, పెద్దఅనంతాపురం, డైరీకొట్టాల గ్రామస్థులు తమ ఊర్ల వైపు చెత్త డంపింగ్‌ చేయడంపై ఆందోళన చేయడంతో అక్కడ చెత్తవేయడాన్ని విరమించుకున్నారు. కాగా ఇటీవల వడ్లరామాపురం రస్తా వైపు మున్సిపాలిటీ అధికారులు ఓ పొలాన్ని దత్తతకు తీసుకుని చెత్త డంపింగ్‌ చేస్తున్నారు. దీనిపై  వడ్లరామాపురం గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంగళవారం ఆందోళన చేపట్టారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయానికి వడ్లరామాపురం వాసులు తరలివచ్చి తమ గ్రామం వైపు చెత్త డంపింగ్‌ చేయరాదని మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటదాసుకు విన్నవించారు. అయితే ఆయన తొలుత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఆ తర్వాత కమిషనర్‌  వారి వినతిని స్వీకరించి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఎంపీడీవో మోహనకుమార్‌కు కూడా వినతిపత్రాన్ని అందజేశారు.  వడ్లరామాపురం గ్రామస్థులు మాట్లాడుతూ.. పంట పొలాల నడుమ పొలాలను లీజుకు తీసుకుని రైతులను సంప్రదించకుండా డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేసే ప్రయత్నం సరికాదని అన్నారు. చుట్టుపక్కల సుమారు 600 ఎకరాల పంట పొలాలు ఉన్నాయని, అలాగే సమీపంలోని భవనాశి వాగు ప్రవహిస్తోందని చెప్పారు. ఇక్కడ చెత్తను డంపింగ్‌ చేయడం వల్ల వాయు, నీటికాలుష్యం సంభవించే ప్రమాదం  ఉందని అన్నారు. అధికారులు పునఃఆలోచించాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని గ్రామస్థులు హెచ్చరించారు.


Updated Date - 2021-08-04T05:12:43+05:30 IST