చేతిరాతతో కరోనా రిపోర్టు.. బ్యాంకు మేనేజర్ అనూహ్య మరణం!

ABN , First Publish Date - 2020-08-02T00:55:16+05:30 IST

నకిలీ కరోనా రిపోర్టుకు ఓ బ్యాంకు మేనేజర్ బలయ్యాడు. డబ్బుల కోసం ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు చేసిన మోసానికి మేనేజర్ ప్రాణాలు కోల్పోయారు.

చేతిరాతతో కరోనా రిపోర్టు.. బ్యాంకు మేనేజర్ అనూహ్య మరణం!

కోల్‌కతా: నకిలీ కరోనా రిపోర్టుకు ఓ బ్యాంకు మేనేజర్ బలయ్యారు. డబ్బుల కోసం ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు చేసిన మోసానికి మేనేజర్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితులను ఇటీవల అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ దారుణం జరిగింది.


సదరు మేనేజర్ ఇటీవల జ్వరం, దగ్గుతో సతమతమవడంతో వారి ఫ్యామిలీ డాక్టర్ కరోనా టెస్టు చేయించుకోవాలని సూచించారు. ఓ ల్యాబ్ టెక్నీషియన్‌కు సంబంధించిన వివరాలను డాక్టర్ వారికి ఇచ్చారు. అయితే మేనేజర్ కదలలేని పరిస్థితిలో ఉండటంతో.. ల్యాబ్ టెక్నీషియనే ఇంటికి వచ్చి శాంపిల్ సేకరించాడు. ఆ తరువాత.. మేనేజర్‌కు కరోనా లేదంటూ ఫోన్‌లో సమాచారం అందించాడు.


వాట్సాప్ ద్వారా కూడా సందేశం పంపించడమే కాకుండా.. హార్డ్ కాపీని కూడా కుటుంబసభ్యులకు అందించాడు. అయితే ఇటీవల మేనేజర్ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఎమ్ఆర్ బంగూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు మేనేజర్ కరోనా రిపోర్టును పరిశీలించి అది నకిలీదని తేల్చారు.


రిపోర్టుపై ఉన్న పేషెంట్ ఐడీలో తొమ్మిది అంకెలే ఉన్నాయని, సాధారణంగా 11 అంకెలు ఉంటాయని చెప్పారు. అంతేకాకుండా.. చేతితో ఈ అంకెలు రాయడాన్ని కూడా వారు ఎత్తి చూపారు. అయితే గురువారం నాడు ఆరోగ్యం పరిస్థితి విషమించి మేనేజర్ మృతి చెందారు. దీంతో మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరోనా సోకిందని ముందుగా తెలిసుంటే భర్తను కాపాడుకోగలిగి ఉండేదాన్నని, నకిలీ రిపోర్టు కారణంగా కాలయాపన జరిగిని భర్త చనిపోయాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.


కాగా.. గతంలో వచ్చిన వాట్సాప్ మేసేజీల ఆధారంగా ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ ల్యాబ్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేస్తున్నామంటూ వారు నమ్మబలికేవారని పోలీసులు తెలుకున్నారు. అయితే నేరం జరిగిన తీరు దృష్యా ఈ ఘటన వెనకాల పెద్ద  ముఠా ఏమైనా ఉందా అనే కోణంలో వారు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Updated Date - 2020-08-02T00:55:16+05:30 IST