Online షాపింగ్‌తో జరపైలం

ABN , First Publish Date - 2022-01-28T18:08:42+05:30 IST

రోజుకో కొత్తరకం సైబర్‌ మోసంతో అమాయకులను అడ్డంగా దోచేస్తున్న సైబర్‌ కేటుగాళ్లు.. ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేవారిని టార్గెట్‌ చేస్తున్నారు. నకిలీ వెబ్‌సైట్లను సృష్టిస్తున్నారు. ఖరీదైన...

Online షాపింగ్‌తో జరపైలం

పొంచి ఉన్న సైబర్‌ నేరగాళ్లు 

నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి..

భారీ డిస్కౌంట్స్‌ అంటూ దోపిడీ


హైదరాబాద్‌ సిటీ: రోజుకో కొత్తరకం సైబర్‌ మోసంతో అమాయకులను అడ్డంగా దోచేస్తున్న సైబర్‌ కేటుగాళ్లు.. ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేవారిని టార్గెట్‌ చేస్తున్నారు. నకిలీ వెబ్‌సైట్లను సృష్టిస్తున్నారు. ఖరీదైన బ్రాండెడ్‌ దుస్తులు, శారీస్‌, రకరకాల గృహోపకరణాలను తక్కువ ధరకే ఇస్తున్నట్లు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియాతో పాటు.. ఇంటర్నెట్‌లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవం, దసరా, దీపావళి, సంక్రాంతితో పాటు వివిధ రకాల అకేషన్స్‌లో ప్రత్యేక ఆఫర్‌లు, భారీ డిస్కౌంట్స్‌ పెట్టామని బురిడీకొట్టిస్తున్నారు. ఆకర్శించే విధంగా ఉన్న ఫొటోలతో సోషల్‌మీడియాలో, ఆన్‌లైన్‌లో పోస్టులు పెడుతున్నారు. దాంతో ఆఫర్స్‌, డిస్కౌంట్లకోసం ఆన్‌లైన్‌లో వెతికే కస్టమర్స్‌ ఆ వెబ్‌సైట్ల లింక్‌లను క్లిక్‌ చేస్తున్నారు. అక్కడ కనిపించే ఖరీదైన దుస్తులు, శారీ్‌సకు, గృహోపకరణాలు చూసి ఆకర్షితులవుతున్నారు. తక్కువ ధరకే బ్రాండెడ్‌ వస్తువులు వస్తున్నాయనే భ్రమలో ఆర్డర్‌ చేస్తున్నారు. అతితక్కువ ధరలకే అమ్ముతుంటంతో ముందుగానే డబ్బులు పే చేయాలని సైబర్‌ కేటుగాళ్లు కండీషన్‌ పెడుతున్నారు. అలా ఆర్డర్‌ బుక్‌చేసి, డబ్బులు పే చేసిన తర్వాత ఆర్డర్‌ త్వరలోనే ఇంటికి వస్తుంది అని మెసేజ్‌ వస్తుంది. రోజులు గడుస్తున్నాఎంతకీ ప్రొడక్టు ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కస్టమర్లు అందులో ఉన్న నంబర్‌కు ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ చేసి ఉంటాయి. మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోలీసులు ఆ వెబ్‌సైట్‌ గురించి లోతుగా పరిశీలించగా.. అది నకిలీదని తెలుస్తుంది.


అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో.. ప్రజలు ప్రతి దానికీ ఆన్‌లైన్‌పై ఆధారపడుతున్నారు. వస్తువుల కొనుగోళ్లకు ఆన్‌లైన్‌ షాపింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. దాంతో ఆన్‌లైన్‌లో వేలల్లో ఈ కామర్స్‌ సైట్లు పుట్టుకొస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ఇబ్బడి ముబ్బడిగా దర్శనమిస్తున్న బంపర్‌ ఆఫర్‌, భారీ డిస్కౌంట్స్‌ అన్ని లింకులను క్లిక్‌ చేస్తున్నారు. సైబర్‌ నేరగాళ్ల మాయలో పడిపోతున్నారు.


గుడ్డిగా నమ్మొద్దు

సైబర్‌ కేటుగాళ్లు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసే కస్టమర్స్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రతి అకేషన్స్‌ క్యాష్‌ చేసుకుంటున్నారు. బంపర్‌ ఆఫర్స్‌, భారీ డిసౌంట్లు అంటూ ప్రకటనలు చూసి గుడ్డిగా నమ్మొద్దు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ విషయంలో కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలి.  ప్రతి సైట్‌ను ఓపెన్‌ చేయొద్దు. నమ్మకమైన ఈ కామర్స్‌  షాపింగ్‌ వెబ్‌సైట్లనే ఎంచుకోవాలి. సాధ్యమైనంత వరకు క్యాష్‌ ఆన్‌ డెలివరీకి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆన్‌లైన్‌ షాపింగ్‌ సమయంలో అడగగానే బ్యాంకు ఖాతాలు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ వ్యాలెట్స్‌ వివరాలు నమోదు చేయొద్దు. ఆ వివరాలన్నీ సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళ్తాయని గుర్తుంచుకోవాలి. ఒక్కసారి డబ్బులు పోగొట్టుకున్న తర్వాత తిరిగి రికవరీ చేయడం కష్టం. ఈ విషయాన్ని కస్టమర్స్‌ గుర్తుంచుకోవాలి.

- సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

Updated Date - 2022-01-28T18:08:42+05:30 IST