పశ్చిమ బెంగాల్‌లో దుర్గా పూజలు... మోదీ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం...

ABN , First Publish Date - 2020-10-21T21:59:48+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దుర్గా పూజల సందర్భంగా పశ్చిమ బెంగాల్

పశ్చిమ బెంగాల్‌లో దుర్గా పూజలు... మోదీ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం...

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దుర్గా పూజల సందర్భంగా పశ్చిమ బెంగాల్‌ ప్రజలను ఉద్దేశించి గురువారం ప్రసంగిస్తారు. రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ బూత్‌లోనూ ఆయన ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో గురువారం నుంచి దుర్గా పూజలు ప్రారంభమవుతాయి. 


రాష్ట్రంలో 294 శాసన సభ నియోజకవర్గాలు, 78 వేల పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. ఈ బూత్‌లలో మోదీ ప్రసంగాన్ని గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించే ప్రజలు కోవిడ్-19 నిబంధనలను తప్పనిసరిగా పాటించేవిధంగా చర్యలు తీసుకున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మాస్క్ ధరించడం, చేతులు శుభ్రపరచుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి మార్గదర్శకాలను పాటిస్తూ, ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 


పశ్చిమ బెంగాల్‌లో వచ్చే ఏడాది శాసన సభ ఎన్నికలు జరుగుతాయి. మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి బీజేపీ ప్రధాన ప్రత్యర్థి. మమత పదేళ్ళ పాలనకు చరమగీతం పాడాలన్న లక్ష్యంతో బీజేపీ నేతలు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ మొట్టమొదటిసారి కోల్‌కతాలో దుర్గా పూజలను నిర్వహిస్తోంది. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర బీజేపీ నేతలు హాజరవుతారు. 


Updated Date - 2020-10-21T21:59:48+05:30 IST