ఇంద్రకీలాద్రిపై ప్రక్షాళన జరిగేనా?

ABN , First Publish Date - 2021-04-09T06:31:15+05:30 IST

గురువారం బాధ్యతలు..

ఇంద్రకీలాద్రిపై ప్రక్షాళన జరిగేనా?
దుర్గగుడి నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన భ్రమరాంబ

కొత్త ఈవో రాకతో మార్పులపై ఆశలు 

ఆంధ్రజ్యోతి, విజయవాడ:


‘కనకదుర్గమ్మ ఆలయానికి ఈవోగా రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మవారి కృపాకటాక్షాలుండబట్టే ఆమెకు సేవలు చేసుకునేందుకు ఇక్కడకు వచ్చానని అనుకుంటున్నాను. దేవస్థానంలో నా విధి నిర్వహణను అమ్మవారికి సేవగానే చేస్తాను. అమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తాను. ఉద్యోగులందరితో కలిసి దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తాను. ఆలయంలో సమస్యలుంటే వాటి పరిష్కారానికి కృషి చేస్తాను’ 

- దుర్గగుడి నూతన ఈవో డి.భ్రమరాంబ


దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవోగా గురువారం బాధ్యతలు స్వీకరించిన డి.భ్రమరాంబ మీడియాతో మాట్లాడుతూ విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అమ్మవారి ఆలయంలో ఇటీవల ఏసీబీ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోదాలు నిర్వహించి, అక్రమాలకు బాధ్యులుగా గుర్తించినవారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నారని, ఇంకా ఏసీబీ, విజిలెన్స్‌ అధికారుల విచారణ కొనసాగుతుంటే దేవస్థానం తరపున వారికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. విలేకరుల సమావేశం అనంతరం ఆమె రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును, కమిషనర్‌ పి.అర్జునరావును మర్యాదపూర్వకంగా కలిసి వచ్చారు. మధ్యాహ్నం భోజనం తర్వాత ఆలయ పరిపాలనా వ్యవహారాలపై దృష్టి సారించారు. 


పాలన గాడిన పడేనా? 

గత ఏడాదిన్నర కాలం దుర్గగుడి ఈవోగా పని చేసిన ఎం.వి.సురేశ్‌బాబు ఆది నుంచే అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ, అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. పవిత్రమైన అమ్మవారి ఆలయంలో ముడుపుల సంస్కృతిని ప్రవేశపెట్టి ఇంద్రకీలాద్రిపై అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ అమ్మవారి ఆదాయానికి రూ.కోట్లలో గండి కొట్టారనే విమర్శలున్నాయి. ఎన్ని ఆరోపణలు వచ్చినా, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆశీస్సులతో ఇంతకాలం ఈవోగా కొనసాగారు. ఇటీవల ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులు వరుస దాడుల్లో అవకతవకలను గుర్తించి ప్రభుత్వానికి నివేదించడంతో సురేశ్‌బాబుపై బదిలీ వేటు పడింది. ఇప్పుడు కొత్త ఈవోగా భ్రమరాంబ రాకతో ఇప్పటి వరకూ అవినీతికి అలవాటుపడిన ఆలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది వెన్నులో వణుకు మొదలైనట్లు తెలుస్తోంది. ఇంతకాలం ఇంద్రకీలాద్రిపై చక్రం తిప్పిన సురేశ్‌బాబు కోటరీకి ఇకపై అడ్డుకట్ట పడుతుందని ఇంద్రకీలాద్రి వర్గాలు భావిస్తున్నాయి.


 మేడమ్‌.. వీటిపై దృష్టి పెడతారా? 

- ఆలయంలో రూ. 4 కోట్ల విలువైన శానిటేషన్‌ కాంట్రాక్టును సికింద్రాబాద్‌కు చెందిన కేఎల్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారు. ఆ సంస్థను కొనసాగించడానికి వీల్లేదని కోర్టు తీర్పు చెప్పిన తర్వాత టెండరు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లినా.. అది పెండింగ్‌లోనే ఉంది. ఈ వ్యవహారంపై నూతన ఈవో భ్రమరాంబ దృష్టి సారిస్తారని భావిస్తున్నారు. 


- పాల సరఫరా కాంట్రాక్టులోనూ అధికారులు అడ్డగోలుగానే వ్యవహరించారు. ఆలయంలోని పలు విభాగాలకు అవసరమైన పాలను లీటరు రూ. 40 చొప్పున సరఫరా చేసేలా సంగం డెయురీ 2019, ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 2020, మార్చి 31వ తేదీ వరకు కాంట్రాక్టును దక్కించుకుంది. ఆరునెలల తర్వాత రూ.44 చొప్పున చెల్లించాలంటూ ఆ డెయిరీ లేఖ పెట్టడంతో అంత మొత్తం చెల్లిస్తున్నట్టు ఏసీబీ గుర్తించింది. ఈనెల ఒకటో తేదీ నుంచి మళ్లీ టెండర్లను ఆహ్వానించినా లీటరు పాలు రూ. 39కే సరఫరా చేస్తామంటూ ముందుకు వచ్చిన విశాఖ డెయిరీకి టెండరు ఇవ్వకుండా.. రూ.44కు కోట్‌ చేసిన సంగం డెయిరీకే బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


- ఇంద్రకీలాద్రిపైన, దిగువన చెప్పుల స్టాండ్లు, క్లోక్‌రూముల నిర్వహణ, కూల్‌డ్రింక్స్‌, వాటర్‌ బాటిల్స్‌ విక్రయించుకునేందుకు పిలిచిన టెండర్లలోనూ అవకతవకలు వెలుగు చూశాయి. 


- కొండ దిగువన రెండు మొబైల్‌ క్యాంటీన్ల నిర్వహణకు టెండర్లు పిలిచారు. ఏడాదికి రూ.76 లక్షలు అద్దె చెల్లించేలా ఓ కాంట్రాక్టరు దీనిని దక్కించుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నా, అధికారులు ఆ కాంట్రాక్టరుతో డిపాజిట్‌ కట్టించుకోకుండా, కాంట్రాక్టును రద్దు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో టెండర్లను ఖరారు చేయకుండా, నెలవారీ ముడుపులు, కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చే అక్రమ వ్యవహారాలపై కొత్త ఈవో దృష్టి సారించి.. ప్రక్షాళన చేపడతారో లేదో వేచి చూడాల్సిందే. 

Updated Date - 2021-04-09T06:31:15+05:30 IST