Advertisement
Advertisement
Abn logo
Advertisement

తలొగ్గ 'లేఖ'.. స్వచ్ఛంద విరమణకు దుర్గగుడి ఈవో ప్రయత్నం

  • స్వచ్ఛంద విరమణకు దుర్గగుడి ఈవో ప్రయత్నం
  • చర్చనీయాంశంగా మారిన ఈవో నిర్ణయం 
  • గతంలోనూ రెండుసార్లు దరఖాస్తు..
  • తిరస్కరించిన ప్రభుత్వం 

దేవదాయశాఖలో నిజాయతీగా పనిచేసే అతి తక్కువ మంది అధికారుల్లో దుర్గగుడి ఈవో దర్భముళ్ల భ్రమరాంబ ఒకరు. ఈ శాఖలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తూ సుదీర్ఘ అనుభవం గడించిన భ్రమరాంబ స్వతంత్ర నిర్ణయాలు అమలు చేసే సమర్థ అధికారిణిగా పేరు సంపాదించుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రముఖ ఆలయాలకు ఈవోగా, రాయలసీమ, రాజమహేంద్రవరంలలో రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌గా, బాధ్యతలు నిర్వర్తించిన భ్రమరాంబ తన కిందిస్థాయి అధికారులు, సిబ్బంది ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేవారు కాదని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు. అటువంటి నిజాయతీ అధికారిణి ఇప్పుడు దుర్గగుడిలో రూ.కోట్ల విలువైన కాంట్రాక్టుల కోసం తీవ్రస్థాయిలో వస్తున్న రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గడం ఇష్టం లేక స్వచ్ఛంద విరమణకు దరఖాస్తు చేసుకుని ఉంటారనే సందేహం తలెత్తుతోంది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : దుర్గగుడి కార్యనిర్వహణాధికారి భ్రమరాంబ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం దరఖాస్తు చేసుకోవడం ఇంద్రకీలాద్రిపై చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది ఏప్రిల్‌ నెలలో దేవస్థానం ఈవోగా బాధ్యతలు చేపట్టిన భ్రమరాంబ ఎనిమిది నెలలకే ఉద్యోగం వదిలేసి వెళ్లిపోవాలనే గట్టి నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులపై ఆలయంలో చర్చ నడుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆమె ఉద్యోగ విరమణకు 2023, అక్టోబరు 31వ తేదీ వరకు గడువు ఉన్నప్పటికీ.. రెండేళ్లు ముందుగానే స్వచ్ఛందంగా విరమణ చేయాలని నిర్ణయించుకున్నారు. తాను వచ్చే జనవరి 31వ తేదీ నుంచి వలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకోవాలని నిర్ణయించుకున్నానని, ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గత నెల ఒకటో తేదీనే దేవదాయశాఖ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వ్యక్తిగత బాధ్యతల కారణంగా తాను వలంటరీ రిటైర్మెంట్‌ తీసుకుంటున్నట్టు భ్రమరాంబ దేవదాయశాఖ కమిషనర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. నెల క్రితమే ఆమె దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఈ విషయం ఆలయంగా వెలుగులోకి వచ్చింది. 


ఇది మూడోసారి..

దేవదాయశాఖలో నిజాయతీ అధికారిణిగా పేరున్న భ్రమరాంబ ఇలా స్వచ్ఛంద విరమణ కోసం దరఖాస్తు చేసుకోవడం ఇది తొలిసారి కాదు. గతంలో ఆమె శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవోగా ఉన్నప్పుడు ఒకసారి, సింహాచలం దేవస్థానం ఈవోగా ఉన్నప్పుడు మరోసారి స్వచ్ఛంద విరమణకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. ప్రభుత్వం అనుమతించలేదు. తాజాగా మూడోసారి ఆమె మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. భ్రమరాంబ విజ్ఞప్తి మేరకు దేవదాయశాఖ కమిషనర్‌ కార్యాలయ అధికారులు ఫైల్‌ సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆమె విరమణకు అనుమతి ఇస్తుందా? లేదా? అనేది సందేహమేనంటున్నారు.


నిజాయతీ అధికారిణిగా.. 

దేవదాయశాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా 1982, సెప్టెంబరు 6వ తేదీన భ్రమరాంబ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 38 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఆమె వివిధ హోదాల్లో తన సేవలందించారు. ప్రస్తుతం జాయింట్‌ కమిషనర్‌ హోదాలో దుర్గగుడి ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దుర్గామల్లేశ్వరుల దేవస్థానంలో తరచూ అవినీతి ఆరోపణలు, వివాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దుతారనే ఉద్దేశంతోనే ప్రభుత్వం రాజమహేంద్రవరం ఆర్‌జేసీగా ఉన్న భ్రమరాంబను  దుర్గగుడి ఈవోగా నియమించింది. ఆమె బాధ్యతలు చేపట్టిన ఈ ఎనిమిది నెలల కాలంలోనే దుర్గగుడిలో వివాదాలు తగ్గాయి. అవినీతి ఆరోపణలు కూడా పెద్దగా వినిపించడం లేదు. ఇంతకుముందు అస్తవ్యస్తంగా మారిన పాలన చాలావరకు గాడిలో పడిందని ఇంద్రకీలాద్రి వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎలాంటి వివాదాలు, ఇబ్బందులు లేకపోయినా భ్రమరాంబ ఈ బాధ్యతలను వదిలేసి వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడం వెనుక బలమైన కారణాలే ఉండి ఉంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి. 


శానిటేషన్‌ కాంట్రాక్టు కోసం..

భ్రమరాంబ ఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేవదాయశాఖ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి వస్తున్న సిఫార్సులు, ఒత్తిళ్లకు లొంగలేదు. అన్ని అంశాల్లోనూ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్న ఈవో, ఉన్నతాధికారుల నుంచి.. రాజకీయ నాయకుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుండడంతో ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. పైగా దుర్గగుడి శానిటేషన్‌ కాంట్రాక్టు కోసం రెండేళ్లుగా కొనసాగుతున్న వివాదం ఆమెకు తలనొప్పిగా మారింది. ఇలాంటి తలనొప్పులు అవసరమా? అనే భావనతోనే ఆమె స్వచ్ఛంద విరమణ నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తున్నారు. 


పదోన్నతికీ దూరం

జాయింట్‌ కమిషనర్‌ హోదాలో ఉన్న భ్రమరాంబ ఇటీవల అడిషనల్‌ కమిషనర్‌గా పదోన్నతి కోసం ప్రయత్నించారు. మాన్సాస్‌ ట్రస్టు వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవదాయశాఖ అదనపు కమిషనర్‌ రామచంద్రమోహన్‌పై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆ స్థానం కోసం భ్రమరాంబ ప్రయత్నించినప్పటికీ పదోన్నతి ఇవ్వకుండా, ఆ శాఖలోని మరో అధికారికి ఆ పదవిని కట్టబెట్టడంతో భ్రమరాంబ మనస్థాపానికి గురై ఉంటారని, అందుకే స్వచ్ఛంద విరమణకు దరఖాస్తు చేసుకుని ఉంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆమెకు రెండేళ్లే సర్వీసు ఉండటంతో ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదిలేసి.. శేషజీవితాన్ని స్వచ్ఛంద సేవలో గడపాలని నిర్ణయించుకున్నారని మరో సమాచారం. ఏదిఏమైనా దుర్గగుడి ఈవో భ్రమరాంబ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇంద్రకీలాద్రిపై హాట్‌ టాపిక్‌గా మారింది. స్వచ్ఛంద విరమణ కోసం ఆమె చేసుకున్న దరఖాస్తుపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే అంశం ఆసక్తిగా మారింది. 

Advertisement
Advertisement