అతిథి గృహమా.. క్వారంటైన్‌ కేంద్రమా..?

ABN , First Publish Date - 2020-07-18T17:13:24+05:30 IST

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలోని మాడపాటి అతిథిగృహం ఆలయ ఈవో కుటుంబానికి క్వారంటైన్‌ కేంద్రంగా మారిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది

అతిథి గృహమా.. క్వారంటైన్‌ కేంద్రమా..?

మాడపాటి అతిథి గృహంలో దుర్గగుడి ఈవో కుటుంబ సభ్యులు

ఏడాది కాలంగా సూట్ రూంలో ఉచితంగా మంత్రి పీఏ, గన్ మెన్


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలోని మాడపాటి అతిథిగృహం ఆలయ ఈవో కుటుంబానికి క్వారంటైన్‌ కేంద్రంగా మారిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అంతే కాదు మంత్రి ప్రైవేటు పీఏకు, గన్‌మెన్‌కు ఇక్కడ ఒక సూట్‌ రూమ్‌ శాశ్వత బసగా మారినట్టు తెలుస్తోంది. ఏడాది కాలంగా ఆ రూమ్‌లో వారిద్దరూ ఉచితంగా ఉంటున్నట్టు సమాచారం.


వన్‌టౌన్‌లో దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలోని మాడపాటి అతిథిగృహాన్ని దుర్గమ్మ భక్తుల వసతి కోసం కేటాయిస్తుంటారు. ఈ అతిథిగృహంలో 10 ఏసీ గదులు, ఐదు సూట్‌ రూమ్‌లు ఉన్నాయి. ఒక్కో ఏసీ గది అద్దె రూ.1200 దీనికి జీఎస్టీ అదనం అంటే పన్నులన్నీ కలుపుకొని సుమారు రూ.1344 అవుతుంది. అదే సూట్‌ రూం అయితే ఒక రోజు అద్దె రూ.2240 దీనికి జీఎస్టీ కలుపుకొంటే రూ.2509 వరకు అవుతుంది. సాధారణంగా మాడపాటి అతిథిగృహంలో 104 సూట్‌ రూమ్‌ ఈవో పర్యవేక్షణలో ఉంటుంది. దీన్ని  భక్తులెవరికీ కేటాయించరు. ఈవో పరిపాలనాపరమైన వ్యవహారాల కోసం దీన్ని ఉపయోగించుకుంటారు. కరోనా కారణంగా సుమారు మూడు నెలలుగా మాడపాటి అతిథి గృహంలో గదులను భక్తులకు అద్దెకు ఇవ్వడం లేదు.


అయితే వారం రోజులుగా ఇందులో బయట వ్యక్తులు ఉండటాన్ని గమనించి అద్దెకు ఇస్తున్నారని భావించిన కొందరు భక్తులు విచారించగా, అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు గదులను ఎవ్వరికీ  అద్దెకు ఇవ్వడం లేదని తెలిపారు. లోపల ఎవరు ఉంటున్నారని ఆరా తీయగా.. దుర్గగుడి ఈవో కుటుంబ సభ్యులు ఉంటున్నారని చెప్పారు. దుర్గగుడికి అతిథిగృహంలో రోజుల తరబడి ఈవో తన కుటుంబ సభ్యులను ఉంచడం చర్చనీయాంశంగా మారింది. కరోనా నేపథ్యంలో ఈవో తన కుటుంబ సభ్యుల కోసం అతిథిగృహాన్ని క్వారంటైన్‌ కేంద్రంగా మార్చివేశారన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపై  ఈవో సురేష్‌బాబును వివరణ కోరగా.. తమ ఇల్లు చిన్నదిగా ఉండటంతో తన తల్లిని మాత్రమే మాడపాటి అతిథి గృహంలో ఉంచినట్లు తెలిపారు. ఇతర కుటుంబ సభ్యులు ఎవరూ అక్కడ లేరని తెలిపారు. 


మంత్రి పిఏకూ, గన్‌మెన్‌కూ ఉచిత బస?

మాడపాటి సత్రంలో దుర్గగుడి ఈవో కుటుంబ సభ్యులు ఉండటం ఒక ఎత్తు అయితే జిల్లాకు చెందిన మంత్రి ప్రైవేటు పిఏ ఏడాది కాలంగా ఇందులోని ఓ సూట్‌ రూంలో ఉచితంగా ఉండటం మరో ఎత్తు. మంత్రి పిఏ నెల జీతం రూ.18వేలు కాగా, ఆయన ఉంటున్న సూట్‌రూమ్‌ ఒక్క రోజు అద్దె రూ.2509. అంటే నెలకు సుమారు రూ.75వేలు. మంత్రి ప్రైవేటు పిఏతోపాటు మంత్రి గన్‌మెన్‌ కూడా ఇక్కడే ఉంటున్నారని సమాచారం. ఏడాది కాలంగా మంత్రి పిఏ చెల్లించాల్సిన అద్దె లెక్కిస్తే సుమారు రూ.9 లక్షలు వరకు లెక్క తేలుతుంది. ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నామని ఆర్భాటపు ప్రకటనలు చేసే వైసీపీ ప్రభుత్వం ఈ లెక్కన ప్రజలకు ఇవ్వాల్సిన దేవస్థానం అతిథిగృహాల గదులను కబ్జా చేసి లక్షలాది రూపాయలు ప్రభుత్వ ఖజానాకు కన్నం పెడుతున్న మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. 

Updated Date - 2020-07-18T17:13:24+05:30 IST