Abn logo
Oct 17 2021 @ 01:14AM

కన్నులపండువగా దుర్గాదేవి అనుపు మహోత్సవం

ఊరేగింపులో దుర్గాదేవి విగ్రహాలు

ఆకట్టుకున్న నేలవేషాలు, విద్యుత్‌ సెట్టింగ్‌లు

ఊరేగింపులో దారి పొడవునా అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు


అనకాపల్లి టౌన్‌, అక్టోబరు 16: దసరా మహోత్సవాల్లో భాగంగా గవరపాలెం సతకంపట్టు కనకదుర్గమ్మవార్ల ఊరేగింపు శుక్రవారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. ఆలయ చైర్మన్‌ దాడి జయవీర్‌ అమ్మవారికి పూజలు చేసి ఊరేగింపును ప్రారంభించారు. విగ్రహాలను ప్రత్యేక వాహనాల్లో పెట్టి తెల్లవార్లు దారి పొడవునా ఊరేగించారు. పూడిమడకరోడ్డులోని రామాలయం వద్ద నుంచి నెహ్రూచౌక్‌, మెయిన్‌ రోడ్డు, ఎన్టీఆర్‌, చిననాలుగురోడ్లు, వన్‌వే జంక్షన్లు, గవరపాలెంలోని పురవీధుల మీదుగా సాగిన ఊరేగింపులో దారి పొడవుగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం వరకు పురవీధుల్లో ఊరేగింపు సాగుతూనే ఉంది. విద్యుత్‌ సెట్టింగ్‌లు, నేలవేషాలు, నవశక్తుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఊరేగింపులో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పట్టణ సీఐ ఎల్‌.భాస్కరరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు, ట్రాఫిక్‌ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు పీవీ రమణతో పాటు కమిటీ సభ్యులు పొలిమేర శ్రీను, కాండ్రేగుల నాయుడు, సతకంపట్టు పెద్దలు పాల్గొన్నారు.