Advertisement
Advertisement
Abn logo
Advertisement

కోర్టు మొట్టినా..

దుర్గగుడి శానిటేషన్‌ టెండర్లలో పదేపదే అదే తీరు

కనిష్ఠ ధర కంటే తక్కువ కోట్‌ చేస్తే అనర్హులే

టెండర్లపై నాలుగోసారి కోర్టు తీర్పు

వివాదాల పరిష్కారానికి మార్గదర్శకాలు

అయినా మారని అధికారుల తీరు

అయినవారికి కట్టబెట్టేందుకు పక్కదారులు

ప్రభుత్వ పెద్దల ఒత్తిడే కారణం


దుర్గగుడిలో శానిటేషన్‌ కాంట్రాక్టు టెండర్‌ ప్రక్రియపై ఇది నాలుగో వ్యాజ్యం. ఇప్పటికి మూడు పిటిషన్లను పరిష్కరించాం... ఆలయంలో పారిశుధ్య పనుల నిర్వహణకు ఏడాది కాలపరిమితితో ఆహ్వానించిన ఈ టెండర్లో ఇప్పటికే బిడ్‌లు స్వీకరించినందున.. దేవస్థానం అధికారులు టెండర్‌ నోటిఫికేషన్‌కు ఒక కొరిజెండమ్‌ను జారీ చేసి, కాంట్రాక్టర్లకు వారి బిడ్‌లను సవరించడానికి అదనపు అవకాశాన్ని కల్పించడం సముచితం. ఈ తాజా ప్రక్రియలో దేవస్థానం నిర్ణయించిన కనిష్ఠ ధర కంటే తక్కువ కోట్‌ చేసిన టెండరుదారులను అనర్హులుగా ప్రకటించాలి. అర్హత సాధించిన మిగిలిన టెండర్లను పరిగణనలోకి తీసుకుని, సంబంధిత చట్టాలకనుగుణంగా శానిటేషన్‌ టెండరును ఖరారు చేయాలి..


వివాదాస్పదంగా మారిన దుర్గగుడి శానిటేషన్‌ టెండర్‌ ప్రక్రియపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేసిన హైకోర్టు చేసిన వ్యాఖ్యలివి. ఈ టెండర్‌ను ఖరారు చేసేందుకు ఏడు పాయింట్లతో మార్గదర్శకాలను నిర్దేశిస్తూ ఈ నెల 2వ తేదీన ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా కోర్టు మార్గదర్శకాల మేరకు టెండర్‌ను ఖరారు చేయకుండా... ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న ఒత్తిళ్లకు తలొగ్గుతూ రూ.కోట్ల విలువైన ఈ కాంట్రాక్టును అర్హతలు లేకున్నా, అస్మదీయ సంస్థకే కట్టబెట్టేందుకు దేవస్థానం అధికారులు వక్రమార్గాలను అనుసరిస్తుండటంతో ఈ వివాదం మరింత ముదిరి పాకానపడింది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఇంద్రకీలాద్రిపై పారిశుధ్య పనులకు సంబంధించిన కాంట్రాక్టును నిబంధనలకు విరుద్ధంగా పొడిగిస్తూ వస్తుండటంపై ఇతర కాంట్రాక్టర్లు ఒకరి తర్వాత మరొకరుగా హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈ వివాదాలపై ఇప్పటికి మూడుసార్లు న్యాయస్థానం తీర్పులు వెలువరించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు దేవస్థానం అధికారులు ఇంద్రకీలాద్రిపైన, దిగువన ఆలయ పరిసరాల్లో హౌస్‌ కీపింగ్‌, మెకనైజ్డ్‌ శానిటేషన్‌, స్వీపింగ్‌ సేవలు అందించేందుకు ఆరు నెలల క్రితం టెండర్లు పిలిచారు. ఈ టెండర్ల ప్రక్రియలో మళ్లీ చైతన్యజ్యోతి వెల్ఫేర్‌ సొసైటీనే ఎల్‌1గా నిలిచింది. దేవస్థానం అధికారులు ఎప్పటి మాదిరిగానే మళ్లీ ఏవో కుంటిసాకులు చూపిస్తూ, ఆ సంస్థకు టెండర్‌ ఖరారు చేయకుండా రద్దు చేశారు. 


అధికారుల తీరుపై ఆగ్రహం.. మళ్లీ కోర్టుకు

నిబంధనలను పాటించకుండా ఇలా పదే పదే టెండర్లను రద్దు చేస్తుండటంపై కొందరు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో ఆరు నెలల క్రితం మూడోసారి టెండర్లను ఆహ్వానించగా.. మొత్తం ఏడు సంస్థలు బిడ్‌లు దాఖలు చేశాయి. అప్పటి నుంచి టెండర్‌ను ఖరారు చేయకుండా దేవస్థానం అధికారులు కావాలనే కాలయాపన చేసున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై చైతన్య జ్యోతి వెల్ఫేర్‌ సొసైటీ కోర్టులో రిట్‌పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. మధ్యలో నిలిచిపోయిన టెండర్‌ ప్రక్రియను కొనసాగించాలని, టెక్నికల్‌, ఫైనాన్సియల్‌ బిడ్‌లను నిర్వహించి, నిబంధనల ప్రకారం ఎల్‌1గా నిలిచిన సంస్థకు టెండర్‌ ఖరారు చేయాలని ఆదేశిస్తూ ఈ నెల రెండో తేదీన తీర్పునిచ్చింది. దీనికి సంబంధించి ఏడు పాయింట్లతో మార్గదర్శకాలను జారీ చేసింది. 


అర్హత లేని సంస్థకు కట్టబెట్టాలంటూ ఒత్తిడి

హైకోర్టు తాజా ఉత్తర్వులననుసరించి దుర్గగుడి అధికారులు ఇంతకుముందు బిడ్‌లు సమర్పించిన కాంట్రాక్టు సంస్థలకు మరో అవకాశం కల్పిస్తూ, టెండర్‌ ప్రక్రియను కొనసాగించారు. దేవస్థానం నిర్ణయించిన కనిష్ఠ ధరకు తక్కువ కాకుండా బిడ్డర్లు ఇంతకుముందు కోట్‌ చేసిన టెండర్‌ విలువను సవరిస్తూ ఈ నెల 20వ తేదీలోపు సీల్డు కవర్లో సమర్పించాలని కోరారు. టెండర్‌ కనిష్ఠ ధరను రూ. 26,33,243గా నిర్ణయించారు. ఈ మొత్తం కంటే తక్కువకు ఎవరు టెండర్‌ కోట్‌ చేసినా, హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం అనర్హత వేటు పడుతుందని ముందుగానే హెచ్చరించారు. దీంతో పనోరమ ఎంటర్‌ ప్రైజెస్‌, కేఎల్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌, సాయి సెక్యూరిటీ సర్వీసెస్‌, చైతన్యజ్యోతి వెల్ఫేర్‌ సొసైటీలు దేవస్థానం నిర్ణయించిన కనిష్ఠ ధరనే కోట్‌ చేస్తూ సీల్డ్‌ కవరులో బిడ్‌లు సమర్పించాయి. త్రినేత్ర సెక్యూరిటీ అండ్‌ డిటెక్టివ్‌, లా మెక్‌లీన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు మాత్రం దేవస్థానం నిర్ణయించిన కనిష్ఠ ధర కంటే తక్కువగా కోట్‌ చేశాయి. త్రినేత్ర సెక్యూరిటీ అండ్‌ డిటెక్టివ్‌ సంస్థ రూ.22,73,038 కోట్‌ చేయగా.. లా మెక్‌లీన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.21,21,040 కోట్‌ చేసింది. కోర్టు మార్గదర్శకాలననుసరించి తక్కువ కోట్‌ చేసిన ఈ రెండు సంస్థలపై అనర్హత వేటు వేసి, నిబంధనల ప్రకారం మిగిలిన నాలుగు సంస్థల్లో టర్నోవర్‌, ఇతర అంశాల ఆధారంగా ఎల్‌1గా నిలిచిన సంస్థకు టెండర్‌ను ఖరారు చేసేస్తే కథ ముగిసిపోతుంది. కానీ దేవస్థానం అధికారులు ఆ పని చేయలేకపోతున్నారు. అర్హత కోల్పోయిన రెండు సంస్థల్లో ఓ సంస్థకు కాంట్రాక్టును కట్టబెట్టాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి వస్తుండటమే ఇందుకు కారణమని ఇంద్రకీలాద్రిపై బాహాటంగానే చర్చ నడుస్తోంది. ప్రభుత్వ పెద్ద కార్యాలయం నుంచే నేరుగా దేవస్థానం ఉన్నతాధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. 


మరో వివాదానికి తెర

ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గిన దుర్గగుడి అధికారులు శానిటేషన్‌ టెండర్‌ ప్రక్రియలో మరో వివాదానికి తెర తీశారు. ప్రభుత్వ పెద్దలు సిఫార్సు చేస్తున్న సంస్థ ప్రతినిధులను పిలిపించి.. దేవస్థానం నిర్దేశించిన కనిష్ఠ ధరకు తక్కువ కాకుండా టెండర్‌ విలువను కోట్‌ చేసి, మళ్లీ బిడ్‌ను సమర్పించాలంటూ మరో అవకాశం కల్పించినట్టు సమాచారం. దీనిపై ఇతర సంస్థలు మండిపడుతున్నాయి. ‘కావలసినవారికే కాంట్రాక్టు కట్టబెట్టాలనుకుంటే టెండర్లు పిలవడమెందుకు? పదేపదే టెండర్లను రద్దు చేస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురిచేయడమెందుకు?’ అంటూ ఆక్రోశం వెళ్లగక్కు తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం దేవస్థానం ఈవో భ్రమరాంబకు తలనొప్పిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏవిధంగా ముందుకెళతారనేది చర్చనీయాంశంగా మారింది. 

Advertisement
Advertisement