ముత్యాల నగరిలో మరో మణిహారం..!

ABN , First Publish Date - 2020-09-26T09:31:54+05:30 IST

ముత్యాల నగరిలో మరో మణిహారం చేరింది. ట్రాఫిక్‌ చిక్కులకు పరిష్కారంగా.. పర్యాటక హంగులు అద్దుతూ రూ.184 కోట్లతో నిర్మించిన కేబుల్‌ వంతెన

ముత్యాల నగరిలో మరో మణిహారం..!

అందుబాటులోకి దుర్గుం చెరువు కేబుల్‌ వంతెన

ప్రారంభించిన కేటీఆర్‌, కిషన్‌రెడ్డి

హాజరైన పలువురు మంత్రులు, మేయర్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు

రోడ్‌ నెంబర్‌- 45 ఎలివేటెడ్‌ కారిడార్‌ కూడా అందుబాటులోకి

నగర పర్యాటకానికి ఐకానిక్‌గా మారుతుందంటున్న అధికారులు

విద్యుధగధగలతో ద్విగుణీకృత ఆకర్షణ

వర్షంతో హడావిడిగా కార్యక్రమం

శని, ఆదివారాల్లో వాహనాల రాకపోకలపై నిషేధం


హైదరాబాద్‌ సిటీ(ఆంధ్రజ్యోతి): 

ముత్యాల నగరిలో మరో మణిహారం చేరింది. ట్రాఫిక్‌ చిక్కులకు పరిష్కారంగా.. పర్యాటక హంగులు అద్దుతూ రూ.184 కోట్లతో నిర్మించిన కేబుల్‌ వంతెన, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-45లో రూ.150 కోట్లతో (మొత్తం రూ.334 కోట్లు) నిర్మించిన ఎలివేటెడ్‌ కారిడార్‌లు శుక్రవారం నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. శుక్రవారం సాయంత్రం మంత్రి కే తారక రామారావు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి వంతెనను ప్రారంభించారు. మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, ఆరెకపూడి గాంధీ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన వంతెన, ఇతర అభివృద్ధి పనుల నమూనా ప్రదర్శన తిలకించారు. అధునాతన ఎక్స్‌ట్రా డోస్డ్‌ ఇంజనీరింగ్‌ పరిజ్ఞానంతో వంతెన నిర్మించారు.


దక్షిణ ఏసియాలో ఇదే అత్యంత పొడవైన తీగల వంతెన అని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. రెండు పైలాన్‌లలో... ఒక్కో దానికి 26 తీగల చొప్పున 52 తీగల ఆధారంతో 233 మీటర్ల స్పాన్‌ నిర్మించారు. వాహనాల కోసం నాలుగు లేన్లు, సైకిల్‌ ట్రాక్‌, పాదచారుల బాటల కోసం మరో రెండు లేన్లు కేటాయించారు. వంతెనపై వర్షపు నీరు నిలవదని, స్తంభాలు లేకుండా వీధి దీపాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. తీగలపై పండుగల విశిష్టత, మహనీయుల గురించి తెలిసేలా రంగురంగుల విద్యుద్దీపాలతో చిత్రాలు ప్రదర్శించేలా రూ.9 కోట్లతో ఎలక్ర్టిఫికేషన్‌ పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం జూబ్లీచెక్‌ పోస్ట్‌ నుంచి రోడ్‌ నెంబర్‌- 36, మాదాపూర్‌ మార్గంలో వెళ్లేందుకు 25 నుంచి 30 నిమిషాలు పడుతుంది. వంతెనలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో రెండు కిలోమీటర్ల దూరం తగ్గడంతోపాటు ప్రయాణానికి పది నిమిషాల సమయం మాత్రమే పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయా నికి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా వెళ్లే అవకాశం ఉంటుంది. రోడ్‌ నెంబర్‌-36, మాదాపూర్‌ మార్గంలో వాహనాల రద్దీ తగ్గనుంది. ఇంజనీరింగ్‌ అద్భుతాల్లో ఇది ఒకటని ఓ అధికారి చెప్పారు.


వర్షంతో హడావిడిగా...

కేబుల్‌ వంతెనను ఆర్భాటంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం సాయంత్రం నుంచి వర్షం మొదలవడంతో ప్రారంభోత్సవాన్ని హడావిడిగా పూర్తి చేశారు. రంగురంగుల విద్యుద్దీపాలతో ధగధగలాడిన వంతెనపై పేల్చిన బాణసంచా విశేషంగా ఆకట్టుకుంది. మంత్రులందరూ బాణసంచా పేలుళ్లను ఆసక్తిగా తిలకించారు. వంతెన నిర్మాణంపై చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీధర్‌, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ వెంకటరమణ ప్రత్యేక దృష్టి సారించారు. 


శని, ఆదివారాల్లో వాహనాలు నిషేధం...

ఐటీ కారిడార్‌కు కేబుల్‌ వంతెన కొత్తందాలు అద్దనుంది. వంతెనతోపాటు దుర్గం చెరువు చుట్టూ తీర ప్రాంతంలో అభివృద్ధి చేశారు. ల్యాండ్‌ స్కేపింగ్‌, ఓపెన్‌ జిమ్‌, చదరంగం నమూనా, గజిబోలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన దుర్గం చెరువు పర్యాటక ఐకానిక్‌గా మారుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో సందర్శకుల వీక్షణకు, వారికి ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. శని, ఆదివారాల్లో సందర్శకులు ఉంటారన్న ఉద్దేశంతో ఆ రెండు  రోజులు వాహనాల రాకపోకలు వంతెనపై నిషేధించారు. కేవలం సందర్శకులకు మాత్రమే వంతెనపైకి అనుమతి ఉంటుంది. 

Updated Date - 2020-09-26T09:31:54+05:30 IST