ఈ యుద్ధ సమయాన...!

ABN , First Publish Date - 2020-05-28T07:42:30+05:30 IST

రెడ్‌జోన్లలో కదులుతున్న వర్తమానం సెల్ పరామర్శలతో ఊపిరిపోసుకొంటోన్న మానవసంబంధాలు కరోనా సంధ్యాసమయాన...

ఈ యుద్ధ సమయాన...!

రెడ్‌జోన్లలో 

కదులుతున్న వర్తమానం

సెల్ పరామర్శలతో 

ఊపిరిపోసుకొంటోన్న 

మానవసంబంధాలు

కరోనా సంధ్యాసమయాన

ఏదో ఒక జోన్‍లో

నిర్మానుష్యమైన వీధుల్ని పల్కరిస్తూ

రాలిన పసుపుపచ్చపూలన్నీ

మట్టిని ముద్దాడినపుడు,

పాదాలకింద నలిగిన

ఎండిన రాగాకుల

గొణుగుడు వింటూ

తోకాడిస్తూ మనిషి వెనకాలే కుక్కపిల్లలు

మనిషికి మనిషి దూరమంటున్న

కరోనా హెచ్చరికలు

నాగరికత వికృత వికటాట్టహాసంతో

వార్ జోన్‌లో కూరుకుపోయిన ప్రపంచం!

ఈ యుద్ధ విరామ సమయాన

సడలింపుల సయ్యాటలో

లిక్కర్ కోసం వెంపర్లాట-

‘డ్రింక్ రెస్పాన్స్‌బిలి’ అనేది- ఒకనాటి మాట

ఇప్పుడిక బాధ్యతారహితంగా 

ఎంతైనా తాగేయమనే

రెవెన్యూ రాజ్యతంత్రం

కుతి తీర్చుకునే నరాల యాతన;

వెనువెంటే కనపడని

శత్రువు దొంగదెబ్బతో

క్షతగాత్రులెందరో,

లెక్కలేసుకుంటున్న మరణాలెన్నో

ఆకలి అలసట తీరనిదాహానికి-

వలసజీవుల దిక్కులేని చావులెన్నో,

మన జాతి ఆపదలో- 

ఇపుడు బాహాటంగానే- 

రెండు దేశాలు- ఇండియా దటీజ్ భారత్!!

నిఖిలేశ్వర్

Updated Date - 2020-05-28T07:42:30+05:30 IST