Abn logo
Oct 24 2020 @ 06:14AM

సరదాల్లేవ్‌

Kaakateeya

పట్టణాలు, పల్లెల్లో కనిపించని పండుగ శోభ

కరోనా, వర్షాలు, వరదలతో జనం సతమతం


 ఏలూరు సిటీ/కల్చరల్‌: దసరా వచ్చిందంటే పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పండుగ శోభ సంతరించుకునేది. స్కూళ్ళకు, కళాశాలలకు తొమ్మిది రోజులపాటు ఇచ్చే సెలవులతో ఇళ్లకు వచ్చేందుకు ముందస్తుగా రైళ్లు, బస్సులకు రిజర్వేషన్లు చేయించుకునే వారు. పర్యాటక విహారాలకు తేదీలను ఖరారు చేసుకునేవారు. దసరా పర్వదినాల్లో జరిగే తిరునాళ్లు, సంబరాలను తిలకించేందుకు ఎక్కడ ఉన్నా సరే వారి స్వస్థలాలకు చేరుకునేవారు. ఇప్పుడు అటువంటి సరదాలు, సంతోషాలు కరోనా కారణంగా కనుమరుగయ్యాయి. దసరాపై ఎవరిని అడిగినా నిరాశ, నిస్పృహలే వ్యక్తమవుతున్నాయి.


 దసరా సెలవులకు కుటుంబ సమేతంగా సొంత  ఊళ్లకు వచ్చేవారు. రకరకాల పిండి వంటకాలు, విందులు ఆరంగించడంతోపాటు పండుగ రోజుల్లో జరిగే ఉత్సవాలను తిలకించేందుకు సమీపంలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించడం ద్వారా అన్ని ప్రాంతాలు అప్పట్లో కళకళలాడేవి. బస్సులు, ట్రైన్లకు నెల రోజుల ముందే రిజర్వేషన్‌ చేయించుకునే వారు. దసరా ఉత్సవాలు వైభవంగా జరిగేవి. ఇప్పుడా పరిస్థితులు కన్పించడం లేదు. దసరాకు మీ ఊరు వెళ్ళడం లేదా అని అడుగుతుంటే చాలు వారి ఆర్ధిక సమస్యలను ఏకరువు పెడుతున్నారు. దసరా ఉత్సవాలపై కరోనా ఆంక్షలతో ఈ ఏడాది ఉత్సవాలు జరిగే పరిస్థితి లేదు. ఊరేగింపులు లేనట్లే. కరోనా మహమ్మారితో ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. ఏడు నెలలుగా లాక్‌డౌన్‌ నిబంధన అమలులో ఇతరత్రా కారణాలతో సాఫ్ట్‌వేర్‌ సహా ఇతర రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం పేరుతో విధులు నిర్వర్తించడంలో నిమగ్నమయ్యారు. దీంతో వారి కుటుంబ సభ్యులు అత్తారింట్లో, ఇటు పుట్టింట్లో ఉంటున్నారు. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బస్సు సర్వీసులు ప్రస్తుతం పునరుద్ధరించలేదు. దీంతో కొందరు ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దసరాకు రైల్వే ప్రత్యేక ట్రైన్లు నడిపేవి. ఇప్పుడు అవి లేవు. ఎక్కడ వారు అక్కడే ఉండడంతో రవాణాకు పెద్దగా డిమాండ్‌ లేదు. కరోనా సృష్టించే విలయంలో సతమతమవుతున్న ప్రజలు      ఇళ్ళకే పరిమితమై అతికష్టంపై బతుకు నావను నెట్టుకొస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వారిలో               ఏ కోశాన పండుగ ఉత్సాహం కన్పించడం లేదు.  మొత్తం ఈ దసరా ప్రజల్లో ఎటువంటి ఉత్సాహాన్నిచ్చే పరిస్థితి లేదు.  


ఆఫర్లు ఉన్నా.. అమ్మకాలు నిల్‌

దసరా వస్తేవ్యాపారులకు పండుగే. రకరకాల ఆఫర్లతో తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలు గా చేసుకుంటారు. ఈసారి ఆఫర్లు ఇచ్చినా అమ్మకాలు అంతంత మా త్రంగానే ఉన్నాయని వ్యాపారులు వాపోతున్నారు. షోరూమ్‌లు అమ్మకాలు లేక వెలవెలబోతున్నాయి. ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో పాటు కొవిడ్‌ ప్రభావం వ్యాపార సంస్థలపై ఎక్కువగా కనిపిస్తోంది. షోరూమ్‌ల వా రు ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసి కార్లు, మోటార్‌ సైకిళ్ల అమ్మకాలు చేసేవారు.


కొవిడ్‌ కారణంగా అనాసక్తత చూపిస్తున్నారని తెలుస్తోంది. ఈ పండగకు కొత్త వస్తువు లను కొనుగోలు చేస్తుంటారు. ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మిషన్లు, కూలర్లు, గ్రైండర్లు, మిక్సీలు, టీవీల తోపాటు ఇతర గృహోపకరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. వస్త్ర వ్యాపారం జోరు గా సాగేది. ఈసారి ఈ వ్యాపారాలు మందకొడిగా సాగుతున్నాయి. రకాల ఆఫర్లు ఇస్తున్నా పెద్దగా మార్కెట్‌ కావడం లేదని వారు చెబుతున్నాయి. మోటార్‌ సైకిల్‌ కంపెనీలు డిస్కౌంట్‌ ఆఫర్లు, జీరో వడ్డీ ఆఫర్లను ప్రకటించాయి. రూ.7 వేల వరకు  డిస్కౌంట్‌, 6.99 శాతం వడ్డీకే రుణాలు వంటి ఆఫర్లును ప్రకటించాయి. అయినా గతంలో అమ్మకాలను బేరీజు వేస్తే ఈసారి అమ్మకాలు బాగా తక్కువని  చెబుతున్నారు.

Advertisement
Advertisement