ఎక్సైజ్‌శాఖకు కిక్కునివ్వని దసరా..

ABN , First Publish Date - 2021-10-19T04:25:43+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్‌ ఖజానాకు దసరా పండుగ కాసుల కిక్కునిస్తే, ఆసిఫాబాద్‌ జిల్లాలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. ప్రతిఏటా దసరా పండుగ సందర్భంగా ఎక్సైజ్‌ లిక్కర్‌ అమ్మకాలను పెంచుకునేందుకు ప్రత్యేకంగా దుకాణాల వారీగా లక్ష్యాలను నిర్ణయించడం ఆనవాయతీగా వస్తోంది.

ఎక్సైజ్‌శాఖకు కిక్కునివ్వని దసరా..

- భారీగా తగ్గిన అమ్మకాలు

- కొవిడ్‌ ఉన్నా గతేడాది 7కోట్లపైనే రాబడి 

- మహారాష్ట్రలో మద్యం దుకాణాలు ప్రారంభించడమే కారణమంటున్న ఎక్సైజ్‌ అధికారులు

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్‌ ఖజానాకు దసరా పండుగ కాసుల కిక్కునిస్తే, ఆసిఫాబాద్‌ జిల్లాలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. ప్రతిఏటా దసరా పండుగ సందర్భంగా ఎక్సైజ్‌ లిక్కర్‌ అమ్మకాలను పెంచుకునేందుకు ప్రత్యేకంగా దుకాణాల వారీగా లక్ష్యాలను నిర్ణయించడం ఆనవాయతీగా వస్తోంది. అయితే ఈ ఏడాది జిల్లాలోని 26మద్యం దుకాణాలు, 3బార్‌అండ్‌ రెస్టారెంట్లలోనూ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. గతేడాది అక్టోబర్‌లో దసరా లక్ష్యాలకు అనుగుణంగా 7కోట్ల 56లక్షల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరగగా ఈసారి మాత్రం 5.91 కోట్లు మాత్రమే విక్రయాలు జరిగాయి. ఎక్సైజ్‌ అధికారులు వెల్లడించిన గణంకాల ప్రకారమే ఈసారి 1.65కోట్ల మేర రెవెన్యూ తగ్గినట్లు చెబుతున్నారు. అయితే ఇందుకు అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. సహజంగానే ఆసిఫాబాద్‌ జిల్లాలో దేవీనవరాత్రి ఉత్సవాలు కొనసాగుతాయి కాబట్టి దసరా సందర్భంగా అమ్మకాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. దీపావళి నాటికి అమ్మకాల్లో భారీగా వృద్ధి నమోదవుతుందన్నది అధికారుల అభిప్రాయం. అదీ కాకుండా పొరుగునే ఉన్న మహారాష్ట్రలో ఈసారి మద్యం దుకాణాలను పునరుద్దరించడం కూడా జిల్లాలో లిక్కర్‌ అమ్మకాలను దెబ్బ తీసిందంటున్నారు. ఇదిలా ఉంటే గతేడాది కరోనా తీవ్రంగా ఉండి లాక్‌డౌన్‌ కొనసాగినప్పటికీ 7కోట్ల పైచిలుకు మద్యం విక్రయాలు జరిగాయి. ఈ  తీరును బట్టి ప్రస్తుత అమ్మకాలను బేరీజు వేస్తే మహారాష్ట్ర వైపు అక్కడి అధికార యంత్రాంగం తెలంగాణ మద్యం వెల్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందనే విషయం స్పష్టమవుతోంది. మహారాష్ట్రలో చంద్రాపూర్‌ , గడ్చిరోలి జిల్లాలో మద్యం అమ్మకాలపై నిషేదం అమల్లో ఉండేది. దాంతో వాంకిడి సరిహద్దులోనుంచి చంద్రాపూర్‌ జిల్లాలోకి, కౌటాల, సిర్పూర్‌(టి), రవీంద్రనగర్‌, బెజ్జూర్‌ మద్యం దుకాణాల నుంచి గడ్చిరోలి జిల్లాలోకి పెద్ద ఎత్తున తెలంగాణ మద్యం అక్రమమార్గాల్లో రవాణా అయ్యేది. ఈ కారణంగానే గతంలో జిల్లా మద్యం అమ్మకాల్లో పెరుగుదల కనిపించేదని చెబుతున్నారు. అయితే ఈ దఫా అక్కడి ప్రభుత్వం తెలంగాణ నుంచి మద్యం అమ్మకాలు జరుగుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిషేదం నుంచి చంద్రాపూర్‌ జిల్లాను మినహాయించింది. దీంతో ఈ సారి తెలంగాణ ఎక్సైజ్‌కు అమ్మకాల దెబ్బపడిందని భావిస్తున్నారు. 

ఈసారి అమ్మకాలు ఇలా..

దసరా సందర్భంగా ఈసారి జిల్లాలో గతంలో ఎప్పుడూ లేని విధంగా అమ్మకాలు తగ్గాయి. అధికారిక గణంకాల ప్రకారం దసరా సీజన్‌లో ఈసారి 5కోట్ల 91లక్షల 55వేల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఇందులో 8,356 కేసుల ఐఎంఎల్‌ మద్యం, 5,438బీర్‌ కేసులు విక్రయించారు. గతేడాది దసరా పండుగ లక్ష్యాల్లో భాగంగా 10,766కేసుల ఐఎంఎల్‌ మద్యం విక్రయించగా 5,883 బీర్‌ కేసులు అమ్మకాల ద్వారా 7.56కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే గతేడాది అక్టోబర్‌24 నాటికి 15,691 కేసుల ఐఎంఎల్‌ మద్యం, 8,043బీర్‌ కేసుల అమ్మకాల ద్వారా 10.98కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది 16వ తేదీ నాటికి 10,547 ఐఎంఎల్‌ మద్యం కేసులు, 6,598 బీర్‌ కేసుల అమ్మకాల ద్వారా 7.33 కోట్ల ఆదాయం మాత్రమే లభించింది. 

Updated Date - 2021-10-19T04:25:43+05:30 IST