ఆర్టీ‘ఛీ’ బస్సులు.. Sajjanar ఆదేశాలు బేఖాతర్‌

ABN , First Publish Date - 2022-01-06T18:50:55+05:30 IST

ఆర్టీసీ సిటీ బస్సుల్లో శుభ్రత లోపించింది. పలు డిపోల నుంచి బస్సులు శుభ్రం..

ఆర్టీ‘ఛీ’ బస్సులు.. Sajjanar ఆదేశాలు బేఖాతర్‌

  • దుమ్ము పట్టిన సీట్లతో ఇబ్బందులు


హైదరాబాద్‌ సిటీ : ఆర్టీసీ సిటీ బస్సుల్లో శుభ్రత లోపించింది. పలు డిపోల నుంచి బస్సులు శుభ్రం చేయకుండానే రోడ్లపైకి వస్తున్నాయి. దీంతో దుమ్ముపట్టిన సీట్లు, చెత్తతో నిండిన బస్సుల్లో ప్రయాణించాల్సి వస్తోంది. ఉదయం బస్సుల్లో ఎక్కిన ప్రయాణికులే సీట్లు తుడుచుకునే పరిస్థితి నెలకొందని పలువురు ప్రయాణికులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. బస్సులను శుభ్రంగా ఉంచుతూ.. నగర ప్రయాణికులను ఆకట్టుకునేలా సేవలందించాలని టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆదేశిస్తున్నా.. క్షేత్రస్థాయి అధికారులు మాత్రం వాటిని బేఖాతర్‌ చేస్తున్నారనే విమర్శలున్నాయి. బస్సులను తనిఖీ చేయాల్సిన ఉన్నతాధికారులు శుభ్రతను గాలికొదిస్తున్నారు. కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో ప్రతీ బస్సును డిపోలలో శానిటైజ్‌ చేయడంతో పాటు క్లీనింగ్‌ చేయాలి. కానీ.. ప్రయాణికుల రద్దీ పెరగడంతో బస్సుల శుభ్రతను పట్టించుకోవడం మానేశారంటూ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.


సీట్ల నిండా దుమ్ము..

హైటెక్‌ సిటీ రూట్‌లో ట్రాఫిక్‌ ఎక్కువ. అక్కడికెళ్లే బస్సు ఎక్కితే అందులోని సీట్లన్నీ దుమ్ముతో నిండిపోయాయి. 222ఏ బస్సులో వెళ్లాలంటే సీట్లు తుడుచుకోవడానికి ప్రయాణికులు టిష్యూపేపర్‌ లేదా టవల్‌ తీసుకెళ్లాలి. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు బస్సుల్లో ప్రయాణిస్తే వారికి ఆర్టీసీ ప్రయాణికుల కష్టాలు తెలుస్తాయి. ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు బస్సులను శుభ్రం చేయకుండా రోడ్లపైకి అనుమతించకూడదు. - నర్సింహారావు, చందానగర్‌, ప్రయాణికుడు.

Updated Date - 2022-01-06T18:50:55+05:30 IST