సిఫారసులతో డుమ్మా! పలుకుబడితో కొవిడ్‌ డ్యూటీల ఎగవేత

ABN , First Publish Date - 2021-05-17T05:10:30+05:30 IST

సిఫారసులతో డుమ్మా! పలుకుబడితో కొవిడ్‌ డ్యూటీల ఎగవేత

సిఫారసులతో డుమ్మా! పలుకుబడితో కొవిడ్‌ డ్యూటీల ఎగవేత

సేవలకు 25మంది నర్సింగ్‌ ఉద్యోగుల గైర్హాజరు

సెకండ్‌వేవ్‌ వైద్య సేవలందిస్తున్న వారిలో కాంట్రాక్టు నర్సింగ్‌ ఉద్యోగులే అధికం

వారం పాటు పనిచేసినా నో క్వారంటైన్‌

జిల్లా పెద్దాసుపత్రిలో నర్సింగ్‌ విధుల కేటాయింపుపై విమర్శలు

ఖమ్మం సంక్షేమవిభాగం, మే 16: జిల్లా పెద్దాసుపత్రికి జాతీయ స్థాయి గుర్తింపు దక్కడంలో ప్రధానపాత్ర పోషించిన నర్సింగ్‌ ఉద్యో గుల విధుల కేటాయింపుల్లో వివక్ష ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ సేవలందించే విషయంలో సిఫారసుల బాట పట్టారు. ఉన్నతస్థాయి పలుకుబడిని ఉపయోగించి కొవిడ్‌ విధులకు దూరం గా ఉంటున్నారు. దీంతో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ నర్సింగ్‌ ఉద్యోగు లపై పనిభారం అధికమవుతోంది. జిల్లా ప్రధానాసుపత్రిలో 79 మంది వైద్యులతో పాటు పర్మినెంట్‌, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు విధా నంలో నర్సింగ్‌ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. గ్రేడ్‌-1లో ఒక్కరు, గ్రేడ్‌-2లో ఇద్దరు, హెడ్‌నర్సులు-11 మంది, స్టాప్‌నర్సులు- 149 మంది ఉన్నారు, వీరిలో పలు కారణాలతో 20మంది స్టాఫ్‌నర్స్‌లు సెలవులో ఉన్నట్లు సమాచారం. 

రెండో విడతలో నర్సింగ్‌ విధుల్లో వివక్ష

జిల్లా ఆసుపత్రిలొని కరోనా విభాగంలో మూడు షిప్టులుగా విధులు కేటాయించారు. ఒక్కో షిప్టులో 15మందికి గాను 12మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ నర్సింగ్‌ ఉద్యోగులే ఉంటున్నారు. ఒక్కో షిప్టులో కేవలం ముగ్గురు మాత్రమే పర్మినెంట్‌ నర్సింగ్‌ ఉద్యోగులను కేటాయిస్తున్నారు. కాగా వారం రోజులు విధులు నిర్వహించిన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ నర్సింగ్‌ ఉద్యోగులకు కనీసం ఒక్క రోజు క్వారంటైన్‌ కూడా ఇవ్వటం లేదని, వారికే తిరిగి తిరిగి డ్యూటీలు వేస్తున్నారనే  విమర్శలు ఉన్నాయి. జిల్లా ఆసుపత్రిలో పనిచేసే ఓ కాంట్రాక్టు స్టాఫ్‌నర్స్‌ భర్తతో పాటుగా ముగ్గురు కుటుంబ సభ్యులు కరోనా వార్డులో చికిత్స పొందుతుండగా, ఆమెకు కనీసం ఒక్కరోజు సెలవు కూడా ఇవ్వలేదని సమాచారం.

పాతిక మందికి పైగానే..

తొలి విడత కరోనా వైద్యసేవల సందర్భంగా పలు అనారోగ్య కారణాలతో ముగ్గురు వరకు నర్సింగ్‌ ఉద్యోగులు కొవిడ్‌ వార్డులో విధులు నిర్వహించలేదు. రెండో విడత కరోనా వైద్యసేవల్లో మాత్రం కరోనా వార్డు వైద్యసేవలకు రాని నర్సింగ్‌ ఉద్యోగులు 25మందికి పైగానే ఉన్నట్లు తెలుస్తొంది. ఇంతమందికి విధులు కేటాయించకపోవటం జిల్లా దవాఖానాలో చర్చనీయాంశంగా మారింది.  ముఖ్యంగా పలుకుబడి కలిగిన నర్సింగ్‌ ఉద్యోగులు, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి సిఫారసు లేఖలు తెస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

పెరిగిన నర్సింగ్‌ పర్యవేక్షకులు, తగ్గిన పర్యవేక్షణ

జిల్లా ఆసుపత్రిలో గతంలో గ్రేడ్‌- 1 నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ ఒక్కరు మాత్రమే ఉండేవారు. ప్రభుత్వం హెడ్‌ నర్ససలకు ఉద్యోగోన్నతి కల్పించటంతో జిల్లా హాస్పటల్‌కు మరో ఇద్దరు గ్రేడ్‌- 2 నర్సింగ్‌ పర్యవేక్షకులు వచ్చారు. కాని గతంలో కంటే నర్సింగ్‌ విధులు కేటాయింపు, వారి విధుల పర్యవేక్షణపై వివక్ష, వివాదాలు పెరిగాయి. ప్రమోషన్‌పై వచ్చిన గ్రేడ్‌-2 నర్సింగ్‌ పర్యవేక్షకులకు కనీస బాధ్యతలు అప్పగించకపోవటమే కారణమని తెలుస్తోంది.

రోస్టర్‌ పద్ధతి మేరకు విధులు కేటాయిస్తున్నాం

సుగుణ, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌, 

కరోనా వార్డులో విధులు కేటాయింపు సందర్భంగా ఎటువంటి వివక్ష లేదు. అనారోగ్యంగా ఉన్నవారికి, శిశువులకు పాలు ఇస్తున్నవారికి కొన్ని రోజులు పాటు కరోనా వార్డులో కాకుండా మరో విభాగంలో విధులు కేటా యిస్తున్నాం. క్రమ పద్ధతిలో నర్సింగ్‌ ఉద్యోగులకు విధులు కేటాయిస్తాం. 

Updated Date - 2021-05-17T05:10:30+05:30 IST