‘పొదుపు’పై పగ

ABN , First Publish Date - 2021-07-31T07:55:23+05:30 IST

పల్లెల నుంచి పట్టణాల వరకూ మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు పరిచింది... పొదుపు సంఘాలే! ఇకపై అవి ఉనికి కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది

‘పొదుపు’పై పగ

డ్వాక్రాపై ‘సింగిల్‌’ దెబ్బ..

మహిళల స్వావలంబనపై అదుపు

తెరమీదకు సింగిల్‌ విండో విధానం

‘పొదుపు’ పూర్తిగా డ్రా చేశాకే రుణాలు

‘సున్నా వడ్డీ’ తప్పించుకునేలా పథకం

ఇక వలంటీర్ల పెత్తనం కిందకు సంఘాలు

వారు కరుణిస్తేనే మహిళలకు రుణాలు

రుణాల వినియోగంలోనూ స్వేచ్ఛ కరువు

పట్టణాల్లో ఖాతాలు సహకార బ్యాంకుల్లోకి 

పొదుపు స్ఫూర్తికి విఘాతం కలిగించే చర్యలు

సంఘాల చరిత్ర తెరమరుగయ్యే ప్రమాదం


రూపాయి, రూపాయి పోగు చేసి దాచుకుంటున్నారు. ప్రతినెలా బ్యాంకుల్లో జమ చేసి పొదుపు చేసుకుంటున్నారు. దీంతో బ్యాంకులు విరివిగా రుణాలు ఇస్తున్నాయి. అప్పు చేసే అవసరం లేకుండా వ్యవసాయ, విద్య, కుటుంబ అవసరాలకు వాడుకుంటున్నారు. రుణాలను సక్రమంగా తిరిగి చెల్లిస్తూ ‘పరపతి’ కాపాడుకుంటున్నారు. ఇలా మన రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఇకమీదట ఇదంతా ‘గతం’ కావచ్చు..! ఎందుకంటే డ్వాక్రా సంఘాలను దెబ్బ కొట్టేందుకు సర్కారు ‘సింగిల్‌ విండో విధానం’ తీసుకువచ్చింది. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పల్లెల నుంచి పట్టణాల వరకూ మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు పరిచింది... పొదుపు సంఘాలే! ఇకపై అవి ఉనికి కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది.  డ్వాక్రా సంఘాల స్వతంత్రతను, స్వీయ విచక్షణను దెబ్బతీసేలా... వాటిని గ్రామ సచివాలయాల పరిధిలోకి సర్కారు తీసుకొస్తోంది. రుణాల కోసం పొదుపు సంఘాల సభ్యులు ఇక గ్రామ, వార్డు వలంటీర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితికి తెస్తోంది. పొదుపు చేసిన మొత్తాన్ని డ్రా చేసుకున్న తర్వాతే బ్యాంకు రుణాలకు వెళ్లాలంటూ ప్రభుత్వం కొత్త మెలిక పెట్టింది. ఇది... డ్వాక్రా సంఘాలకు ఇస్తున్న సున్నా వడ్డీ ఎగ్గొట్టేందుకేననే అనుమానం కలుగుతోంది. ‘పొదుపు’పై పగ పట్టేలా ఈ నెల 16న గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) డ్వాక్రా సంఘాలకు సింగిల్‌ విండో విధానమంటూ ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మన పొదుపు సంఘాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. మహిళా సభ్యులలో పొదుపు స్ఫూర్తిని నింపడం ద్వారా గ్రూప్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రం పేరు ప్రఖ్యాతులు గాంచింది. పొదుపు సంఘాల మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా 5 వేల సెర్ప్‌ సిబ్బంది మహిళా సంఘాల అభివృద్ధికి సహకరిస్తున్నారు. ఈ సంస్థ ఉద్యోగులు సంఘాల అంతర్గత వ్యవహారాల జోలికి వెళ్లరు. వారిని ప్రోత్సహించేందుకు మాత్రమే కృషి చేస్తారు. దీంతో పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడమే కాకుండా 98ు మంది తిరిగి సకాలంలో చెల్లిస్తున్నారు. వారు దాచుకునే పొదుపు మొత్తాన్నే బ్యాంకులు ‘హామీ’గా భావిస్తున్నాయి.


ఈ విధానంలో బ్యాంకుల్లో స్వేచ్ఛగా రుణాలు పొందుతున్న మహిళలకు ఇప్పుడు ప్రభుత్వ పెత్తనం పెద్ద చిక్కు తెచ్చింది. డ్వాక్రా సంఘాలు దాచుకున్న సొమ్ము మొత్తాన్ని డ్రా చేసుకోవాలంటూ మెలిక పెట్టింది. ఇదే జరిగితే భవిష్యత్తులో పొదుపు సంఘాల ఉనికి ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఇక నుంచి డ్వాక్రా సంఘాల సభ్యులు వలంటీర్ల సహకారం తీసుకోవాలని సింగిల్‌ విండో మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. దీంతోపాటు... పొదుపు సంఘాలపై వలంటీర్ల పెత్తనం మొదలుకానుంది. ఇకపై... వలంటీర్లు సిఫారసు చేసిన డ్వాక్రా సంఘాల సభ్యులను మాత్రమే వైఎ్‌సఆర్‌ ఆసరా/చేయూత పథకాల్లో లబ్ధిదారులను గుర్తిస్తారు. ఆయా వలంటీర్లు తమ పరిధిలో ఉన్న స్వయం సహాయక సంఘంలోని సభ్యుల రుణ అవసరాలను గుర్తించి, వారి నుంచి బయోమెట్రిక్‌ ధ్రువీకరణ తీసుకోవడం ద్వారా సింగిల్‌ విండో రుణ యాప్‌లో అప్‌డేట్‌ చేసుకోవచ్చని తెలిపారు. డ్వాక్రా అకౌంట్ల నిర్వహణ పూర్తిగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోకి తీసుకోనున్నారు. 


పొదుపు సొమ్ముకు ఎసరు 

డ్వాక్రా సంఘాల సభ్యులు తాము పొదుపు చేసుకున్న సొమ్మును వారికి రుణంగా ఇవ్వడమే మొదటి ప్రాధాన్యం అని కొత్తగా వచ్చిన సింగిల్‌ విండో విధానం చెబుతోంది. పైగా ఇది నేషనల్‌ రూరల్‌ లైవ్లీవుడ్‌ మిషన్‌ మార్గదర్శకాల ప్రకారం అని చెబుతున్నారు. సభ్యులు తాము పొదుపు చేసుకున్న మొత్తం బ్యాంకుల నుంచి డ్రా చేసుకుంటే ఇక బ్యాంకుల్లో నిధులుండవు. రిజర్వు బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం 10 శాతం కార్ప్‌సగా ఉంచాలి. ఆయా గ్రూపుల్లో ఉన్న సభ్యులందరికీ ఆ పొదుపు మొత్తంపై అధికారముంటుంది. పొదుపు నిధులను చూసి బ్యాంకులు అంతకు నాలుగింతలు రుణాలు ఇస్తున్నాయి.  సభ్యులు అవసరమైనప్పుడు సొంత ఖాతాల్లో ఉన్న మొత్తంలో కొంత భాగం డ్రా చేసుకుంటున్నారు. ప్రభుత్వం సింగిల్‌ విండో విధానం పేరుతో డ్వాక్రా సభ్యులు పొదుపు మొత్తంతో పాటు స్త్రీనిధి నుంచి ముందుగా డ్రా చేసుకోవాలని, ఆ తర్వాత రుణాలకు వెళ్లాలని సూచించడంతో అసలు పొదుపు స్పూర్తికి ఎసరు వచ్చేట్లుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం  పొదుపు సంఘాలు స్వేచ్ఛగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.


ఇప్పటి వరకు వారు ఏ అవసరం కోసం రుణాలను తీసుకుంటున్నారన్న విషయాన్ని బ్యాంకులు వారి ఇష్టానికే వదిలేశాయి. దీంతో చాలా మంది వ్యవసాయ అవసరాలకు, పిల్లల చదువులకు, కుటుంబ ఖర్చులకు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇక ఇలా ఉండబోదు. తాజా విధానంతో చేయూతవంటి పథకాల పేర్ల కింద ఏయే యూనిట్లు ఏర్పాట్లు చేయాలో ప్రభుత్వమే చెబుతుంది. ఆ యూనిట్లు ఏర్పాటు చేసిన వారికే రుణమిచ్చేలా వలంటీర్లకు ఆదేశాలివ్వనున్నారు. వెరసి... వలంటీర్లు దయదలచిన కొద్ది మంది డ్వాక్రా సంఘ సభ్యులకే రుణాలు అందే ప్రమాదముందని, పొదుపు గ్రూపులు విచ్ఛిన్నమయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. పైగా డ్వాక్రా సంఘాల సభ్యులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు కూడా విముఖత చూపుతాయని అంటున్నారు. 


సున్నా వడ్డీ తప్పించుకునేందుకేనా?

డ్వాక్రా సంఘాలను ఆకర్షించేందుకు ఆర్భాటంగా సున్నా వడ్డీ, ఆసరా లాంటి పథకాలు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు తప్పించేందుకే ఈ పన్నాగం పన్నుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏటా వెయ్యి కోట్లకు పైగా సున్నా వడ్డీ కింద డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం చెల్లిస్తోంది. దీంతో పాటు ఏటా డ్వాక్రా సంఘాలు తీసుకునే రుణాల మొత్తం కూడా పెరుగుతోంది. ఇది ఒక రకంగా ప్రభుత్వానికి భారంగా మారుతుందని ప్రభుత్వం భావించినట్టుంది. అందుకే ఇప్పటికే సున్నా వడ్డీ రుణాల పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు తగ్గించింది. ఇప్పుడు సున్నా వడ్డీ చెల్లించకుండా ఎసరు పెడుతోందనే అనుమానాలు కలుగుతున్నాయి. 


అప్పులకోసం కొత్త పాచిక?

స్వయం సహాయక సభ్యులు అందుబాటులో ఉన్న జాతీయ బ్యాంకుల్లో ఖాతాలు ఏర్పాటు చేసుకుని పొదుపు చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం తాజాగా వారి ఖాతాలన్నీ పట్టణ కో-ఆపరేటివ్‌ బ్యాంకుల్లోకి మార్చాలని మెప్మాలకు, బ్యాంకులకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వం నవరత్నాల పథకాల అమలు కోసం పలు బ్యాంకుల నుంచి రుణాలు స్వీకరిస్తోంది. ఈ క్రమంలో కొన్ని బ్యాంకుల నుంచి రుణం పొందడం ప్రభుత్వానికి భారంగా మారింది. జాతీయ బ్యాంకులను ఏమీ చేయలేని పరిస్థితుల్లో కో-ఆపరేటివ్‌ బ్యాంకుల్లోకి పొదుపు మొత్తం మళ్లించడం ద్వారా ప్రభుత్వానికి అవసరమైనప్పుడల్లా రుణం పొందవచ్చని యోచన చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్వాక్రా సంఘాల నిధులను తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి ప్రభుత్వం రుణం పొందేందుకు పథకం పన్నిందని, డ్వాక్రా సభ్యులకు మేలు చేయడం అటుంచి వారినే తాకట్టు పెట్టే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. 


ఇదీ మన పొదుపు ఘనత...

స్వయం సహాయక సంఘాల ఏర్పాటులో ఏ రాష్ట్రమైనా ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకుంటుంది. ఇతర రాష్ట్రాల్లోని అధికారులు అధ్యయనం కోసం రాష్ట్రంలోని సంఘాలను సందర్శిస్తుంటారు. విదేశాల నుంచి కూడా వచ్చి అధ్యయనం చేస్తుంటారు. పలు రీసెర్చి సంస్థలు, ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థల దృష్టిలో కూడా మన డ్వాక్రా సంఘాలకు ప్రత్యేక స్థానముంది. రుణాలు తిరిగి చెల్లించలేరన్న కారణంతో ఒకప్పుడు బ్యాంకులు పేద కుటుంబాలకు రుణాలిచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసేవి కావు. ఇప్పుడు పొదుపు స్ఫూర్తి పెరిగి, ప్రతి పేద కుటుంబంలోని మహిళలు పొదుపు గ్రూపులో సభ్యులుగా ఉండటంతో బ్యాంకులు రుణాలందిస్తున్నాయి. స్వతంత్రంగా బ్యాంకుల్లో పొదుపు చేసుకుని, బ్యాంకుల్లో రుణాలు పొందుతున్న డ్వాక్రా సంఘాలకు సెర్ప్‌ సహకారం అందిస్తోంది.

Updated Date - 2021-07-31T07:55:23+05:30 IST