ద్వారకా తిరుమలను ఏలూరులోనే ఉంచాలి: ఏలూరు ప్రజలు

ABN , First Publish Date - 2022-01-27T21:37:53+05:30 IST

చిన వెంకన్న కొలువైన ద్వారకాతిరుమలను రాజమండ్రిలో కాకుండా ఏలూరు

ద్వారకా తిరుమలను ఏలూరులోనే ఉంచాలి: ఏలూరు ప్రజలు

ఏలూరు: చిన వెంకన్న కొలువైన ద్వారకాతిరుమలను రాజమండ్రిలో కాకుండా ఏలూరు జిల్లాలోనే ఉంచాలని ప్రభుత్వాన్ని జిల్లా ప్రజలు కోరారు. అలాగే ఏలూరు కేంద్రంగా ద్వారకా తిరుమల జిల్లాను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో పలు ప్రాంతాల్లో కొత్త సమస్యలు తెరపైకి వచ్చి వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాను రెండు జిల్లాలుగా విభజించారని వారు తెలిపారు. ఒకటి ఏలూరు జిల్లా కేంద్రంగా ఏలూరు జిల్లా, మరొకటి భీమవరం కేంద్రంగా నరసాపురం జిల్లాగా ప్రణాళికలు రూపొందిస్తున్నారని వారు పేర్కొన్నారు. అయితే పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం ప్రస్తుతం ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండి, రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో కొనసాగుతోందని వారు తెలిపారు.


ఈ నేపథ్యంలో పార్లమెంటు పరిధిలోని మండలాలను రెవెన్యూ డివిజన్ల కోసం తీసుకువెళ్ళే  క్రమంలో, ఏలూరు నుంచి కొవ్వూరు రెవిన్యూ డివిజన్‌లో‌కి ద్వారకా తిరుమల మారి, రాజమండ్రి జిల్లాలో కలవనుంది. ఈ నిర్ణయంతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరుకు ద్వారకాతిరుమలకు సుమారు 35 కిలోమీటర్ల దూరంలోనే ఉండి ప్రజలందరికీ అందుబాటులో ఉందన్నారు. అదే రాజమండ్రి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. ద్వారకాతిరుమలను రాజమండ్రిలో కలపడం వల్ల మండల ప్రజలు ప్రతి విషయంలోనూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం పునరాలోచించి ద్వారకాతిరుమల మండలాన్ని ఏలూరులోనే ఉంచాలని స్థానికులు డిమాండ్ చేశారు. అంతేకాక కొత్తగా ఏర్పడే ఏలూరు జిల్లాకు చిన వెంకన్న కొలువైన ద్వారకాతిరుమల పేరుతో ద్వారకా జిల్లాగా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో మండలంలోని 28 పంచాయతీల్లో పార్టీలకతీతంగా ప్రజలందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్థానికులు హెచ్చరించారు.

Updated Date - 2022-01-27T21:37:53+05:30 IST