ఈసీలు బంద్‌

ABN , First Publish Date - 2020-09-21T08:24:34+05:30 IST

రిజిస్ర్టేషన్ల శాఖలో ఎన్‌కంబర్స్‌మెంట్‌ సర్టిఫికెట్‌(ఈసీ)లు ఇవ్వడం ఆగిపోయింది. దీంతో బ్యాంకు రుణాలు, రిజిస్ర్టేషన్లు ఆగిపోతున్నాయి. రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు గ్రామ

ఈసీలు బంద్‌

రుణాలు.. రిజిస్ట్రేషన్లకు బ్రేక్‌

గ్రామ సచివాలయాల్లోనే  డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌కు నిర్ణయం


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రిజిస్ర్టేషన్ల శాఖలో ఎన్‌కంబర్స్‌మెంట్‌ సర్టిఫికెట్‌(ఈసీ)లు ఇవ్వడం ఆగిపోయింది. దీంతో బ్యాంకు రుణాలు, రిజిస్ర్టేషన్లు ఆగిపోతున్నాయి.  రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు గ్రామ/వార్డు సచివాలయాల నుంచే డాక్యుమెంట్లను రిజిస్ర్టేషన్‌ చేయించుకునే కార్యక్రమాన్ని ప్రారంభించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.


ఇందులో భాగంగా ఆ శాఖలో ఉన్న డేటాను సచివాలయాల్లోని కంప్యూటర్లలో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ముగిసేవరకు ఈసీలు ఇవ్వడం కుదరదన్నారు. ఈ పని వారం రోజుల్లోనే అయిపోతుందని చెప్పారు. 2వారాలు గడచినా దిక్కూమొక్కూ లేదు. దీంతో ఆస్తులపై బ్యాంకు రుణానికి వెళ్లినవారికి, రిజిస్ర్టేషన్లు చేయించుకునేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


ఈసీ ఎంత కీలకమంటే..

ఇల్లు/ఫ్లాటు/స్థలం కొనుగోలు చేసేటప్పుడు ఈసీ కీలకం. సదరు ఆస్తి ఎవరి పేరుపై ఉంది.. ఆస్తి ఎవరెవరి చేతులు మారింది.. ప్రస్తుత పరిస్థితి ఏంటి.. అది ప్రభుత్వానిదా.. పట్టానా.. తదితర వివరాలన్నీ ఈసీలోనే వ స్తాయి. ఈసీలు ఇవ్వడం ఆగిపోవడంతో.. రిజిస్ర్టేషన్లు చేసుకునేవారు అది చూసేవరకు చేసుకోం అంటున్నారు. మరోవైపు ఈసీ లేని పరిస్థితిని అడ్డుపెట్టుకుని అక్రమ రిజిస్ర్టేషన్లకు కూడా పాల్పడేవారుం కూడా ఉంటారు. ప్రభుత్వ భూములే గాక తమవి కాని ఆస్తులను కూడా అమ్మేసే ఆస్కారం ఉంటుంది. అందుకే ఈసీ కచ్చితంగా చూడాలనుకునేవారి రిజిస్ర్టేషన్లు ఆగిపోయాయి.


నమ్మకం ఉన్నవారు మాత్రం చేయించుకుంటున్నారు. కాగా.. ఆస్తి కొనుగోలు కోసం రుణం తీసుకోవాలనుకుంటే బ్యాంకులకు ఈసీ కచ్చితంగా ఇవ్వాలి. దానిని పరిశీలలించకుండా బ్యాంకులు అప్పు ఇవ్వవు. ఇప్పుడు ఈసీలు ఆగిపోవడంతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుందామనే వారికి ఇబ్బందిగా పరిణమించింది. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో సొంత ఆస్తులపై రుణం తీసుకుందామనుకున్నవారికి ఇది పెద్ద సమస్యగా మారింది. డేటా అప్‌లోడ్‌ ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందా అని వారు ఎదురుచూపులు చూస్తున్నారు.


Updated Date - 2020-09-21T08:24:34+05:30 IST