ఈ-పంట నమోదులో ఇబ్బందులు

ABN , First Publish Date - 2021-08-02T05:41:44+05:30 IST

ఈ-పంట నమోదులో ఇబ్బందుల కారణంగా క్షేత్రస్థాయిలో కార్యక్రమం మందకొడిగా సాగుతోంది. గతంలో క్లిష్టతరంగా ఉన్న నమోదు ప్రక్రియను సరళతరం చేసేందుకు ప్రభుత్వం యూడీపీ (యూనిఫైడ్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫాం) యూప్‌ని తీసుకొచ్చింది. ఇందులో రెవెన్యూ సహాయకులు చేయాల్సిన పనులను కూడా వ్యవసాయ సిబ్బందే చేపట్టాల్సి రావడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. గతంలో రోజుకు 80 నుంచి 100 సర్వే నంబర్లను ఈ-పంటలో నమోదు చేసేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 30కి మించడం లేదు

ఈ-పంట నమోదులో ఇబ్బందులు
పోకూరులో ఈ క్రాప్‌ చేస్తున్న వ్యవసాయ సిబ్బంది

యూడీపీ యాప్‌పై అవగాహన లేమితో సమస్యలు

ఇప్పటికి 8వేల ఎకరాలు మాత్రమే రిజిస్ట్రేషన్‌

ఒంగోలు(జడ్పీ), ఆగస్టు 1 : ఈ-పంట నమోదులో ఇబ్బందుల కారణంగా క్షేత్రస్థాయిలో కార్యక్రమం మందకొడిగా సాగుతోంది. గతంలో క్లిష్టతరంగా ఉన్న నమోదు ప్రక్రియను సరళతరం చేసేందుకు ప్రభుత్వం యూడీపీ (యూనిఫైడ్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫాం) యూప్‌ని తీసుకొచ్చింది. ఇందులో రెవెన్యూ సహాయకులు చేయాల్సిన పనులను కూడా వ్యవసాయ సిబ్బందే చేపట్టాల్సి రావడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. గతంలో రోజుకు 80 నుంచి 100 సర్వే నంబర్లను ఈ-పంటలో నమోదు చేసేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 30కి మించడం లేదు. వివరాలు ఎక్కువగా నమోదు చేయాల్సి రావడంతో సమయం తీసుకుంటోంది. ఇంతకు ముందు ఆధార్‌, పట్టాదారు పాసుపుస్తకంలో ఏదో ఒక సంఖ్య నమోదు చేయగానే రైతుకు సంబంధించిన పూర్తి వివరాలు కనిపించేవి. రైతు ఫొటో తీసుకుని జియోట్యాగింగ్‌  చేసేవారు. కానీ నూతన యాప్‌లో అలా కుదరడం లేదు. మొత్తం వివరాలను అప్పటికప్పుడే నమోదు చేయాల్సి రావడంతో జాప్యం జరుగుతోంది. యాప్‌ సాంకేతికత యాప్‌పై సిబ్బందికి శిక్షణ ఇచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం కూడా సమస్యగా మారింది. దీంతో 25 రోజుల క్రితం ప్రక్రియ ప్రారంభమైనా ఇప్పటి వరకూ కేవలం 8వేల ఎకరాలను మాత్రమే రైతులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

యూడీపీతో రైతులకు అధిక ప్రయోజనం 

 గతంతో పోలిస్తే యూడీపీ యాప్‌లో నమోదుతో రైతులకు అధిక ప్రయోజనం చేకూరుతుందని జేడీఏ శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం రైతులకు రశీదు కూడా ఇస్తున్నందున కచ్చితమైన గణాంకాలు ప్రభుత్వం దగ్గర ఉంటాయన్నారు. నూతనంగా ప్రవేశపెట్టడం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు ఎదురుకావడం సహజమేనన్నారు. ఇప్పటికే గాడినపడి ప్రక్రియ ఊపందుకుందని రాబోయే రోజుల్లో మరింత వేగంగా దీనిని ముందుకు తీసుకువెళతామన్నారు.  వివిధ ప్రయోజనాలు ఈ-పంటతో ముడిపడి ఉన్నందున రైతులు కూడా తమ సాగు వివరాలను నమోదు చేసుకోవడంలో శ్రద్ధ చూపాలని జేడీఏ కోరారు.


Updated Date - 2021-08-02T05:41:44+05:30 IST