Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ-క్రాప్‌.. మాయ

పంట నమోదంతా డొల్లే

నమోదులో తప్పులతడకలు

వాస్తవ రైతుకు అందని ఫలాలు

ఈ-క్రాప్‌, ఈకేవైసీతో దళారులకే మేలు

రాజకీయ ఒత్తిళ్లతో రైతులుగా పేర్లు నమోదు

పరిహారాలు.. ప్రోత్సాహకాలు ఎటుపోయాయో?


 అసలు ఊరు పేరే తెలియని వ్యక్తికి 282 ఎకరాలున్నాయి.. హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్న వ్యక్తి దావులూరు రైతయ్యాడు.. తెలంగాణలో ఉన్న వ్యక్తి కొల్లిపరలో 200 ఎకరాలకు ఆసామయ్యాడు.. ఇలా నోటికొచ్చిన సర్వే నంబర్‌.. ఇష్టమొచ్చిన ఖాతా నంబర్లతో ఈ-క్రాప్‌ నమోదు చేశారు. రైతులకు ప్రభుత్వ ఫలాలు అందించేందుకని ఈ-క్రాప్‌ను ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. అయితే వివరాల నమోదులో అంతా తప్పుల తడకలుగా జరిగిందని తేలింది. స్థానికంగా లేని వారి పేర్లతో.. అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియక పోయినా ఈ క్రాప్‌లో వారు స్థానిక రైతులుగా మార్చారంటే ఈ క్రాప్‌ నమోదులో ఎంత మాయ దాగిఉందో తెలుసుకోవచ్చు. నష్ట పరిహారం, పంట కొనుగోళ్లకు ప్రభుత్వం ఈ క్రాప్‌నే ఆధారంగా చేసుకుంది. అంటే దీనిని బట్టి ఈ రెండేళ్లలో ప్రభుత్వం నుంచి రైతుల పేరిట విడుదలైన పరిహారం, ఇతర లబ్ధి ఎవరి జేబుల్లోకి వెళ్లిందో తెలియాలంటే పక్కాగా విచారణ జరపాలని ప్రతిపక్ష నాయకులు, రైతులు, రైతుసంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. తెనాలి నియోజకవర్గంలో బహిర్గతమైన లోపాలను ప్రతిపక్ష నేతలు శుక్రవారం సబ్‌కలెక్టర్‌ దృష్టికి తీసుకురావడంతో ఈ-క్రాప్‌ నమోదు తీరు డొల్లని బహిర్గతమైంది. అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో నిజమైన రైతుకు కాకుండా ఈ-క్రాప్‌, ఈకేవైసీ ప్రక్రియలు దళారులకే మేలుచేశాయనే అనుమానాలకు ఇవి ఆధారాలుగా నిలుస్తున్నాయి. 


ఊరూ.. పేరు లేని వారు రైతులంట

వారెవరో తెలియదు.. కనీసం స్థానికంగా ఉన్న వారు కూడా కాదు.. వారి పేరు కూడా తెలియదు. అసలు వారు రైతులే కాదు. అయినా వారంతా ఆయా గ్రామాలకు చెందిన రైతులుగా, పెద్దఎత్తున వివిధ రక్షాల పంటలు సాగు చేసినట్లుగా ఈ-క్రాప్‌లో నమోదయ్యారు. అసలు తెలిసి చేశారా.. తెలియక చేశారా.. లేదంటే ఈ వివరాల నమోదు వెనుక ఏవైనా శక్తులు ఉన్నాయా తెలియాలంటే విచారణ అవసరమని అటు ప్రతిపక్షనాయకులు, ఇటు రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రాప్‌ నమోదులో గుర్తించిన తప్పులను ప్రతిపక్ష నాయకులు శుక్రవారం బహిర్గతం చేశారు. వాటిలో ఇవి కొన్ని మాత్రమే..

- దావులూరులో సర్వే, ఖాతా నంబరు, పేరు కూడా లేకుండా కేవలం ఫోన్‌ నంబరు నమోదు చేసి, ఆ ఎంట్రీలోనే 43 ఎకరాల పొలాన్ని నమోదు చేశారు. దానిలో ఉన్న ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేస్తే తన పేరు అంకిత్‌ మహాన్‌ అని, తనది హిమాచల్‌ప్రదేశ్‌ అని, తనకేంటి! ఏపీలో పొలాలుండటమేమిటి? నేనసలు ఏపీకే రాలేదు.. అటువంటిది ఏదో గ్రామంలో నా పేరుపై పొలం ఎలా వచ్చిందంటూ ఎదురు ప్రశ్నలు వేస్తూ, విస్తుపోవటం కొసమెరుపు.

- తూములూరు గ్రామానికి చెందిన 1177 ఎకరాల విస్తీర్ణంలో కేవలం 669 ఎకరాలకు సంబంధించిన రైతులు నిజమైనవారు. మిగిలిన విస్తీర్ణం మొత్తం తప్పులే నమోదయ్యాయి. బి. రాములు అనే రైతు పేరుతో 451, 345, 122, 345 అనే  సర్వే నంబర్లలో 100006, 100008, 100009 అనే ఖాతా నంబర్లలో మొత్తం 166.1 ఎకరాలను నమోదు చేశారు. ఈ రైతుల పేరుతో ఎవరూ లేకున్నా, ఆ పొలంలో 49.5 ఎకరాల్లో పసుపు, 48.8 ఎకరాల్లో అరటి, 49 ఎకరాల్లో కర్పూర అరటి, 48.8 ఎకరాల్లో వరి పంట సాగు చేసినట్టు చూపారు. 

- బి.రెడ్డి అనే వ్యక్తి పేరుతో 236, 346, 346 సర్వే నంబర్లలో 49.5 ఎకరాల్లో వరి, 27.5 ఎకరాల్లో పసుపు, మరో 20 ఎకరాల్లో అరటి పంటలు సాగుచేసినట్టు చూపారు. అయితే ఇంతటి విస్తీర్ణంలో సాగుచేసిన రైతులే లేకపోవడం విశేషం.

- కొల్లిపర గ్రామ పరిఽధిలో 3,883 ఎకరాల విస్తీర్ణం ఉంటే, వెంకటేశ్వర్లు అనే రైతు పేరుతో ఒక్కో సర్వే నంబర్‌లో 65 సెంట్ల చొప్పున ఏకంగా 200 ఎకరాలు సాగు చేస్తున్నట్టు ఎంట్రీలు వేశారు.   

 

  

తెనాలి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రైతు.. విస్తీర్ణం.. సాగు చేసే పంట.. సాగు తీరు.. దిగుబడి.. విక్రయాలు తదితరాలను సులభంగా తెలుసుకునేందుకు ప్రభుత్వం ఈ-క్రాప్‌ నమోదు తప్పనిసరి చేసింది. పంటకు గిట్టుబాటు ధర లభించాలంటే ఈ క్రాప్‌ నమోదు చేసుకోవాలని ప్రచారం కూడా చేసింది. ఈ క్రాప్‌ ఆధారంగా ఈకేవైసీ చేసి, రైతుల బ్యాంకు ఖాతా, ఆధార్‌ నంబర్‌తో లింక్‌ చేస్తారు. ఇవన్నీ కచ్చితంగా ఉంటేనే రైతుకు ప్రభుత్వం చెప్పినట్లు న్యాయం జరిగేది. అయితే వీటి నమోదులో సిబ్బంది నిర్లక్ష్యం..రాజకీయ కారణాలతో పలు ప్రాంతాల్లో ఈ-క్రాప్‌ తప్పులతడకలుగా జరిగింది. ఒక గ్రామ పరిధిలో  కొందరు ఈ-క్రాప్‌ నమోదు చేయించుకుంటే, ఇతర ప్రాంతాల్లో ఉన్న మరికొందరు నమోదు చేయించుకోలేకపోయారు. అలాంటి వారిని గుర్తించి వారికి ఈ క్రాప్‌పై అవగాహన కల్పించాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా వారి స్థానంలో ఇష్టం వచ్చిన వివరాలు నమోదు చేశారు. లేకుంటే వెబ్‌ల్యాండ్‌లో తప్పులుగా నమోదైనా ఆ వివరాల ఆధారంగా నమోదు చేసేశారు. తెనాలి, వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు తదితర  మండలాల్లో ఈ-క్రాప్‌ నమోదు ప్రక్రియ కూడా ఇదేతరహాలో ఉందనేది ప్రతిపక్ష నేతల ఆరోపణ. 

 పరిస్థితిపై పూర్తి ఆధారాలతో సహా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తెనాలి సబ్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లటం, ఆమె దీనిపై విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వటం కొంతవరకు రైతులకు ఊరట కలిగించే అంశం. గత లెక్కలు, పక్కదారి పట్టిన పరిహారాల గుట్టు తేల్చుతారో! అధికారం కింద కప్పి ఉంచుతారో చూడాల్సిందే.


సిబ్బంది చేతివాటం

ఈ-క్రాప్‌ నమోదు బయోమెట్రిక్‌ ఆధారంగా చేపట్టారు. రైతులు ప్రత్యక్షంగా హాజరు కావాల్సి ఉండటం, వేలిముద్రలు, ఆధార్‌ నంబర్‌ల అనుసంధానం వంటివాటిని ఈ సారి కచ్చితం చేశారు. ఇది ఒక విధంగా మంచిదే. అయితే  ఆచరణలో నమోదుకు ఆటంకంగా మారింది. ప్రత్యక్షంగా రావాలనటం, లేకుంటే కౌలురైతుల పేర్లు నమోదు చేసుకోవాలని సూచించటంతో 50 శాతం మంది రైతులు నమోదుకు ముందుకు రాలేదు. దీంతో సిబ్బంది చేతివాటం చూపారు. వారికిష్టమొచ్చిన పేర్లు, నోటికొచ్చిన సర్వే నంబర్లు, ఆధార్‌ నంబర్లతో విస్తీర్ణాన్ని నమోదు చేశామనిపించారు. 


పరిహారం.. ఎవరి జేబుల్లోకి వెళ్లిందో?

తప్పుల తడకలతో చేపట్టిన ఈ క్రాప్‌ ప్రక్రియ ఆధారంగా రెండేళ్లుగా పరిహారం, ఇతర ప్రోత్సాహకాలు విడుదలయ్యాయి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం దీనినే ఆమోదిస్తూ రెవెన్యూ, ఇరిగేషన్‌, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు సంతకాలు కూడా చేశారు. గతంలో ప్రభుత్వం నుంచి విడుదలైన పంటలకు పరిహారం అందకపోవటం, కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోలేక పోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లలో ప్రభుత్వం భారీగా పరిహారం, రైతు ప్రోత్సాహకాలు అందజేసింది. అంటే తప్పుల జాబితాలో ఉన్న అనర్హుల జేబుల్లోకి ఆ మొత్తాలు వెళ్లినట్లని రైతులు ఆరోపిస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం విపత్తుల సమయంలో నష్టపోయిన రైతులకు అందాల్సిన పరిహారం కానీ, ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించిన అనుమతులు కానీ అర్హులైన రైతులకు అందడంలేదు. రెండేళ్లుగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం పంపిణీ కానీ, ధాన్యం, జొన్నలు, మొక్కజొన్నలు, పత్తి, మిర్చి వంటి పంటలను కొనుగోలు చేసినప్పుడు పూర్తి శాతం కొనుగోళ్లు చూపారంటే, ఆ లెక్కలు ఎవరివనేది అంతుపట్టని ప్రశ్న. పంటల నమోదు సరిగాలేకుంటే పరిహారం కూడా అందరికీ అందే అవకాశం లేదు. ప్రభుత్వం రైతులందరికీ పంట నష్టపరిహారం వారి ఖాతాల్లో వేశామని ప్రకటనలు గుప్పిస్తే, మరి వేసిన డబ్బంతా ఎవరి ఖాతాలో జమయిందనేది సమాధానం దొరకని ప్రశ్న. లేకుంటే ప్రభుత్వమే ఈ తరహాలో తప్పుగా నమోదుచేయించి ఆ మొత్తాలను రైతులకు చేరనివ్వకుండా వారిలో పెద్దలెవరైనా జేబుల్లో వేసుకుని ఉంటారనేది ప్రతిపక్షాల ఆరోపణ. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ళ విషయంలో కూడా ఈ-క్రాప్‌, ఈకేవైసీ చేయించుకున్న రైతుల దగ్గర నుంచే కొంటున్నామని ప్రభుత్వం చెబుతుంది. అంటే సగంమందికిపైగా అడ్రస్‌లు లేని రైతుల పేర్లతో ఎవరు పంటలను అమ్ముకున్నారనేది తేలాల్సిన విషయం. ఆధారాలను సబ్‌ కలెక్టర్‌కు చూపుతున్న మాజీ మంత్రి ఆలపాటి

పంట నష్టం సర్వే తప్పుల తడక

సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఆలపాటి


తెనాలిటౌన్‌: వర్షాలతో నష్ట పోయిన రైతులకు పరిహారం అందించేందుకు అధికారులు చేపట్టిన పంటల సర్వే తప్పుల తడకగా సాగిందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.  సర్వేలో జరిగిన తప్పులను ఆయన ఆధారాలతో  సబ్‌కలెక్టర్‌ డాక్టర్‌ నిధి మీనాకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. నష్టపోయిన స్థానిక రైతుల పేర్లు నమోదు చేయకుండా రాష్ర్టేతరుల పేర్లు, ఫోన్‌ నంబర్లతో  సర్వే తడకగా జరిపారన్నారు. ఇలాగైతే నిజమైన రైతులకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. 65 సెంట్లు మాత్రమే ఉన్న వ్యక్తి పేరుపై 230 ఎకరాలున్నట్లు నమోదు చేసిన అధికారులు నిర్లక్ష వైఖరిని ఏమనుకోవాలన్నారు. ఢిల్లీ, రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో ఉంటున్న వారి ఫోన్‌ నంబర్లు ఎలా నమోదు చేశారో విచారణ జరపాలన్నారు.  తప్పులతడకగా సర్వే చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రాప్‌లో కేవలం 60 శాతం మాత్రమే రైతులు నమోదు చేసుకున్నారని, మిగతా 40 శాతం మందికి కూడా నష్ట పరిహారం ఎలా ఇస్తారో ముందుగానే చెప్పాలన్నారు.  రైతులకు న్యాయం దక్కేవరకు పోరాటం చేస్తామన్నారు. ఆధారాలిస్తే  పరిశీలించి చర్యలు తీసుకుంటామని సబ్‌ కలెక్టర్‌ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కనక రాంబాబు, మాదల కోటేశ్వరరావు,  సుబ్యయ్య, రమాదేవి, నలుకుర్తి విజయ, శాంత కుమారి, రమ్య, అనిత, దినేష్‌, మహేష్‌, విజయ్‌  తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement