ఈ-మునిసిపాలిటీలు!

ABN , First Publish Date - 2021-01-17T09:40:48+05:30 IST

పారదర్శకంగా, జవాబుదారీతనంగా, ప్రతి సేవను నిర్ణీత గడువులోగా అందించేలా పట్టణాల్లో మరింత మెరుగైన పాలనకు మునిసిపల్‌ శాఖ మెరుగులు దిద్దుతోంది.

ఈ-మునిసిపాలిటీలు!

సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే...

పట్టణ పరిపాలనలో పారదర్శకత

సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్ల ఏర్పాటు

గడువు దాటితే బాధ్యులపై జరిమానా

తప్పుల సవరణల అధికారం కమిషనర్లకే


హైదరాబాద్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): పారదర్శకంగా, జవాబుదారీతనంగా, ప్రతి సేవను నిర్ణీత గడువులోగా అందించేలా పట్టణాల్లో మరింత మెరుగైన పాలనకు మునిసిపల్‌ శాఖ మెరుగులు దిద్దుతోంది. అన్ని పట్టణాలనూ ఈ-మునిసిపాలిటీలుగా మారుస్తోంది. పరిపాలన, పౌరులకు అందించే సేవలన్నీ కూడా ఆన్‌లైన్‌లోనే అందించనున్నది. సేవలన్నీ నిర్ణీత గడువులో అందిస్తారు. జాప్యమైతే బాధ్యులకు జరిమానా విధిస్తారు. సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(సీజీజీ) ద్వారా పరిపాలనను సాగించనుంది. ఈ మేరకు కనీసం ఒకటి  అంతకన్నా ఎక్కువ సంఖ్యలో ఉండేలా సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్ల(సీఎ్‌ససీ)ను ఏర్పాటు చేయనున్నది. కొత్త మునిసిపల్‌ చట్టంలో పేర్కొన్న విధంగా సంస్కరణలు చేపడుతోంది. ఇప్పటికే పలు మునిసిపాలిటీల్లో ఆన్‌లైన్‌ సేవలు అందుతున్నాయి. అన్ని మునిసిపాలిటీల్లోనూ ఈ-సేవలను విస్తరించనున్నారు. 


2019నాటి మునిసిపల్‌ చట్టంలో సెక్షన్‌ 58 ప్రకారం ‘ఈ-గవర్నెన్స్‌ అండ్‌ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌’, సెక్షన్‌-85(2) ప్రకారం ‘అసె్‌సమెంట్‌ అండ్‌ కలెక్షన్‌ ఆఫ్‌ ట్యాక్సెస్‌ ఆర్‌ ఫీజ్‌ ఆర్‌ యూజర్‌ చార్జెస్‌’, సెక్షన్‌-103 ప్రకారం ‘పవర్‌ టు కరెక్ట్‌ ది అసె్‌సమెంట్‌ రికార్డ్స్‌’కు సంబంధించిన అంశాలున్నాయి. చట్టంలోని ఈ అంశాలను విధిగా అమలు చేయాలని మునిసిపల్‌ శాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ ఆదేశించారు. నిబంధనలు పాటించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కమిషనర్లు, సంబంధిత అధికారులను ఆయన హెచ్చరించారు. 


ఈ-మునిసిపాలిటీలలో అందే సేవలివే..

పౌరులు ఎక్కడి నుంచైనా, ఏ సమయంలోనైనా సేవలు పొందేలా... పౌర సేవలను మెరుగ్గా, వేగంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో అందించేందుకు ప్రతి మునిసిపాలిటీ కూడా ఈ-గవరెన్స్‌ విధానాన్ని తేవాలి. 

పౌర సేవలన్నీ నిర్ణీత సమయంలో అందాలి. గడువు దాటితే బాధ్యులపై  జరిమానా విధించాలి. 

ప్రతి మునిసిపాలిటీలో కనీసం ఒక సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్‌ను ఏర్పా టు చేయాలి. వీటిల్లో పౌర సేవల పరిష్కార వసతులు కల్పించాలి. 

సేవలు ఎలకా్ట్రనిక్‌ యంత్రాల ద్వారా జరగాలి. పన్ను చెల్లింపులు, సమాచార నవీకరణ అంతా ఆన్‌లైన్‌లో చేయాలి. 

పన్నుల మదింపు సవరణలు, యజమానుల పేర్లలో దొర్లిన తప్పుల సవరణలు, సమాచారం నమోదులో జరిగే పొరపాట్ల వంటివి సవరించే అధికారం మునిసిపల్‌ కమిషనర్లకు మాత్రమే ఉంటుంది. అయితే అక్షర దోషాలను మాత్రమే సవరించాలని, పూర్తి పేరును మార్చే అధికారం లేదని స్పష్టం చేశారు. సంబంధిత మార్పులన్నీ కూడా ప్రాంతీయ అధికారి అనుమతితోనే చేస్తారు.

Updated Date - 2021-01-17T09:40:48+05:30 IST