జిల్లాలో 76 క్లస్టర్లు

ABN , First Publish Date - 2020-05-24T11:00:13+05:30 IST

వానాకాలంలో మొక్కజొన్న సాగుకు స్వస్తి పలకాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

జిల్లాలో 76 క్లస్టర్లు

ప్రతి క్లస్టర్‌ ఓ రైతు వేదిక

మొక్కజొన్న స్థానంలో కంది, పెసర, పత్తి సాగు

కూరగాయల కోసం ప్రత్యేక అర్బన్‌ క్లసర్లు


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌): వానాకాలంలో మొక్కజొన్న సాగుకు స్వస్తి పలకాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వానా కాలంలో దిగుబడి తక్కువ రావడమే కాకుండా మార్కెట్‌లో ధర కూడా అంతంత మాత్రంగానే ఉంటే రైతులు నష్టపోయే ప్రమాదముందని ప్రభుత్వం మొక్కజొన్న సాగును ప్రోత్సహించడం లేదు. మొక్కజొన్న సాగు చేస్తే రైతుబంధు పథకం వర్తింపజేయబోమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టంగా ప్రకటించడంతో రైతులు కూడా ఇతర పంటల సాగువైపు ఆలోచిస్తున్నారు. మొక్కజొన్న సాగు చేసే విస్తీర్ణంలో ప్రత్నామాయ సాగుకు జిల్లా వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. 


మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా..

జిల్లాలో కొద్ది సంవత్సరాలుగా రైతులు మొక్కజొన్న, వరి సాగును పెంచుతూ పత్తి సాగును తగ్గిస్తూ వస్తున్నారు. నూతన వ్యవసాయ విధానంలో భాగంగా అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి, పొడువుగింజ గల వరి ధాన్యానికి మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. దీంతో పత్తి, 6.5 మిల్లీమిటర్ల సైజుగల బియ్యం ఉత్పత్తి అయ్యే వరి ధాన్యం సాగును పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. స్థానికంగా సన్న రకం బియ్యం అవసరాలు ఎక్కువగా ఉండడంతో ఆ పంటను కూడా ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు. జిల్లాలో 2017 వానాకాలంలో 20,741 ఎకరాలు, 2018లో 26,764 ఎకరాలు, 2019లో 27,191 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు.


ఈ సంవత్సరం 32,500 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. వరి 2017లో 1,15,424 ఎకరాల్లో, 2018లో 1,34,949 ఎకరాల్లో, 2019లో 1,96,291 ఎకరాల్లో సాగు చేశారు. ఈ వానాకాలంలో 2,10,250 ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా వేశారు. ప్రభుత్వం వరి సాగు విస్తీర్ణాన్ని గత వానాకాలం సాగు చేసిన మేరకే ఉంచాలని, ఆ విస్తీర్ణంలో కూడా 40శాతం సన్న రకాలను సాగు చేసేలా చూడాలని భావిస్తున్నది. దీంతో జిల్లాలో సమారు 2 లక్షల ఎకరాలలో వరి సాగు చేస్తే 70 వేల నుంచి 80 వేల ఎకరాల్లో సన్నరకం సాగును ప్రోత్సహించే విధంగా వ్యవసాయశాఖ ప్రణాళికను రూపొందిస్తున్నది. మరో రెండు, మూడు రోజుల్లో ఈ ప్రణాళిక రూపొందుతుందని భావిస్తున్నారు. 


ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం

ఈ సంవత్సరం వానా కాలం 32,500 ఎకరాల్లో మొక్కజొన్న నసాగు జరుగుతుందని అంచనా వేయగా ఆ సాగే లేకుండా చూడాలని ముఖ్యమంత్రి పేర్కొనడంతో పత్తి, పప్పుధాన్యాల సాగువైపు రైతులను మళ్ళించేందుకు ప్రత్నామ్నాయ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గత వానా కాలం 27,191 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరుగగా ఆ విస్తీర్ణాన్ని పత్తి, పప్పు ధాన్యాలకు మళ్లించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గత వానాకాలంలో 90,841 ఎకరాల్లో పత్తి సాగు జరుగగా ఈసారి లక్ష ఎకరాల్లో పత్తి సాగు చేసేలా చూడాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది.  గతంలో 2,411 ఎకరాల్లో కంది పంటను సాగు చేయగా ఈసారి మూడువేల ఎకరాల వరకు, 966 ఎకరాల్లో సాగైన పెసరను  ఐదు వేల ఎకరాలకు పెంచాలని వ్యవసాయశాఖ భావిస్తూ అందుకు విత్తనాలు సమకూర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. 


పట్టణ పరిసర గ్రామాల్లో కూరగాయల సాగుకు ప్రోత్సాహం

జిల్లాలో అర్బన్‌ క్లస్టర్లను రూపొందించి పట్టణ ప్రాంతాలకు చుట్టు పక్కన ఉన్న గ్రామాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయశాఖ నిర్ణయించింది. మూడేళ్లుగా 1,600 నుంచి రెండు వేల ఎకరాల వరకు కూరగాయల సాగు జరుగుతున్నది. ఈసారి నాలుగు వేల ఎకరాల వరకు పెంచేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. 


ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి రూ. 20 లక్షలు

జిల్లాలో  మొత్తం సాగు భూమి 3,56,903 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ భూమి ఉన్న ప్రాంతాలను 76 క్లస్టర్లుగా విభజించారు. ఈ 76 క్లస్టర్లలో వ్యవసాయ అధికారులను, వ్యవసాయ విస్తర్ణ అధికారులను పూర్తిస్థాయిలో కేటాయించి ప్రభుత్వం సూచించిన మేరకు పంటలు సాగు చేసే విధంగా రైతులను సంసిద్ధులను చేసేలా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ప్రతి క్లస్టర్‌కు ఒక రైతు వేదికను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం ఒక్కో రైతు వేదికకు 20 లక్షల రూపాయలు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


రెండు గదులతో రైతు వేదిక కార్యాలయం, దానికి అనుబంధంగా ఒక సమావేశ మందిరం, టాయిలెట్లు, ఇతర సౌకర్యాలను సమకూర్చుతారు. రైతులందరూ అక్కడే సమావేశమై సాగు సంబంధమైన అంశాలను, సమస్యలను చర్చించుకోవడంతోపాటు అధికారులతో సమావేశమయ్యేందుకు వీలుగా రైతు వేదికను నిర్మిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల కలెక్టర్లు, వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో తన వ్యవసాయ క్షేత్రం ఉన్న ఎరబెల్లిలో రైతు వేదికను తన సొంత ఖర్చుతో నిర్మిస్తానని ప్రకటించారు. జిల్లా మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్‌ కూడా తమ నియోజకవర్గాల్లో ఒక రైతు వేదికను నిర్మించేందుకు ముందుకు వచ్చారని సమాచారం. 


ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు 

ప్రతి జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. వ్యవసాయ సెజ్‌లను కూడా ఏర్పాటు చేయాలని సంకల్పంతో ప్రభుత్వం ఉన్నది. జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిందని సమాచారం. దీని కోసం జిల్లా యంత్రాంగం  స్థల సేకరణ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. నేదునూరులో గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ప్రాజెక్టును నెలకొల్పేందుకు సేకరించిన 475 ఎకరాల స్థలాన్ని అధికారులు ఐదు రోజుల క్రితం పరిశీలించారు. ఈ కేంద్రానికి వెయ్యి నుంచి 1,500 ఎకరాలు ఉంటే బాగుంటుందనే ఆలోచనకు వచ్చిన అధికారుల దృష్టి తోటపల్లి ప్రాజెక్టు కోసం సేకరించిన స్థలంపైకి మళ్లిందని సమాచారం. తోటపల్లి రిజర్వాయర్‌ సమీపంలో సుమారు 1400 ఎకరాల స్థలం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది. ఇది రాజీవ్‌ రహదారికి సమీపంలో ఉండడంతో దీనిని ఫుడ్‌ప్రాసెసింగ్‌ కేంద్రం కోసం కేటాయించాలని ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. 


హుజూరాబాద్‌లో నూతన వ్యవసాయ విధానానికి శ్రీకారం..?

నూతన వ్యవసాయ విధానానికి రైతులతో నేరుగా సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో ఏప్రాంతంలో ఏ పంటలు వేయాలనే సమగ్ర నివేదిక తయారైన తర్వాత ముఖ్యమంత్రి ఆ వ్యవసాయ విధానాన్ని కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రకటించే అవకాశమున్నది. రైతుబంధు, రైతు బీమా పథకాలకు హుజూరాబాద్‌లోనే శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ హుజురాబాద్‌లోనే నూతన వ్యవసాయ విధానానికి శ్రీకారం చుడతారని తెలిసింది. తన మనోగతాన్ని ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఇప్పటికే వెల్లడించారని సమాచారం. 


Updated Date - 2020-05-24T11:00:13+05:30 IST