హుజూరాబాద్‌పై ‘డేగ కన్ను’

ABN , First Publish Date - 2021-10-10T05:52:31+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై అందరి దృష్టి ఉంది. ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక అబ్జర్వర్లను నియమించి నియోజకవర్గంలో ఏమి జరుగుతున్నదనేది క్షణక్షణం తెలుసుకుంటున్నది.

హుజూరాబాద్‌పై ‘డేగ కన్ను’

- డ్రోన్లు, సీసీ కెమెరాల నీడలో నియోజకవర్గం

- ప్రతి కదలిక కెమెరాల్లో నిక్షిప్తం

- ఆకస్మిక తనిఖీల్లో అరకోటి నగదు పట్టివేత

కరీంనగర్‌ క్రైం, అక్టోబరు 9: హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై అందరి దృష్టి ఉంది. ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక అబ్జర్వర్లను నియమించి నియోజకవర్గంలో ఏమి జరుగుతున్నదనేది క్షణక్షణం తెలుసుకుంటున్నది.  ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా నియోజకవర్గంలో భారీ ఎత్తున సీసీ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాలతో పోలీసు శాఖ నిఘా పెట్టింది. 1900 మంది పోలీసు బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేసింది. త్వరలో 120 సెక్షన్‌ల కేంద్ర బలగాలు రానున్నాయి. 

బ్లూకోల్ట్స్‌, పెట్రోకార్‌లతో పెట్రోలింగ్‌

 ఏదైనా చిన్న ఘటన జరిగినా, అనుమానం ఉన్నా డ్రోన్లు, బ్లూ కోల్ట్స్‌, పెట్రోకార్‌లతో పోలీసులు రేయింబవళ్లు పెట్రోలింగ్‌ను కొనసాగిస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు, వివిధ రకాల అక్రమ చర్యలకు పాల్పడేందుకు ప్రయత్నించేవారి ప్రతి కదలికలు నిక్షిప్తం చేసేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నాలుగు డ్రోన్‌లతో నిత్యం పరిశీలిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలు, నాకాబందీలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో ఇప్పటికే అరకోటి రూపాయలు నగదుతోపాటు భారీ ఎత్తున మద్యం, మత్తు పదార్థాలు, పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. ఎన్నికల సభలు, సమావేశాలకు అనుమతుల మేరకే ప్రజలు హాజరయ్యారా? లేక అధిక సంఖ్యలో ప్రజలను తరలించారా? ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారా? అనేది పరిశీలించేందుకు డ్రోన్‌ కెమెరాలు, సీసీ కెమెరాలను వినియోగించి అంచనా వేస్తున్నారు. ఏ వాహనం, వ్యక్తిపై అనుమానం ఉన్నా వెంటనే సమీపంలోని చెక్‌పోస్టుకు సమాచారం అందించి తనిఖీ చేస్తున్నారు. పోలీస్‌ కమిషనర్‌ ప్రతి రోజు రెండు సార్లు హుజురాబాద్‌ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు అధికారులు, సిబ్బందికి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు

ఉప ఎన్నికలపై నిఘా కోసం హుజురాబాద్‌ నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో 406 ప్రత్యేక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. హుజురాబాద్‌ పోలీసు ఠాణా పరిధిలో 110, జమ్మికుంట ఠానా పరిధిలో 169, వీణవంకలో 87, ఇల్లందకుంటలో 36 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.  150 మంది వరకు పాతనేరస్థులను బైండోవర్‌ చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఫేక్‌ న్యూస్‌, వదంతులు వ్యాప్తి చెందకుండా 24 గంటలు రెండు సైబర్‌ క్రైం టీంలతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో నిఘా పెట్టారు. 

12 రోజుల్లో కోటి 27 లక్షల నగదు పట్టివేత

హుజురాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో సెప్టెంబరు 28వ తేదీ నుంచి శనివారం వరకు కమిషనరేట్‌ వ్యాప్తంగా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో కోటి 27 లక్షల 34 వేల 610 రూపాయలు, 3,70,092 విలువైన 635 లీటర్ల మద్యం, ఐదు వేల విలువ చేసే 935 గ్రాముల గంజాయి, 40,040 రూపాయల విలువైనజిలెటిన్‌స్టిక్స్‌, డిటోనేటర్స్‌, 1500 మీటర్ల కార్డ్‌ వైర్‌ను స్వాధీనం చేసుకున్నారు. 67 చీరలు, 40 టీషర్ట్స్‌, మూడు తులాల బంగారం, 14 కిలోల వెండి, 112 కేసుల్లో 648 మందిని బైండోవర్‌ చేశారు. 75 ఆయుధాలను డిపాజిట్‌ చేయించామని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన సంఘటనల్లో 33 కేసులను నమోదు చేశారు. 


Updated Date - 2021-10-10T05:52:31+05:30 IST