నల్లమలలో భూ ప్రకంపనలు.. శ్రీశైలం ప్రాజెక్ట్‌కు తప్పిన పెనుముప్పు..

ABN , First Publish Date - 2021-07-27T15:36:21+05:30 IST

నల్లమలలోని కృష్ణానదిలో సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో రెండు సెకన్లపాటు భూకంపం సంభవించింది..

నల్లమలలో భూ ప్రకంపనలు.. శ్రీశైలం ప్రాజెక్ట్‌కు తప్పిన పెనుముప్పు..

మహబూబ్‌నగర్/కర్నూలు : నల్లమలలో స్వల్పంగా భూమి కంపించింది. నల్లమలలోని కృష్ణానదిలో సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో రెండు సెకన్లపాటు భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల థాటికి నాగర్‌కర్నూల్‌ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని అచ్చంపేట, అమ్రాబాద్‌, బల్మూర్‌, లింగాల, ఉప్పునుంతల మండలాల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో రెండు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని అంటున్నారు.


ఏకకాలంలో.. 

శ్రీశైలం సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున 4.30 నుంచి 5 గంటల మధ్య భూమి కంపించింది. శ్రీశైలం, లింగాలగట్టు పరిసర ప్రాంతాలలో ఏకకాలంలో భూ ప్రకంపనలు వచ్చాయి. శ్రీశైలం ప్రాజెక్ట్‌కు పడమరవైపు 44 కిలోమీటర్ల దూరంలో.. నాగర్ కర్నూల్ జిల్లాకు తూర్పున 18 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని ఎన్‌జీఆర్ఐ గుర్తించింది. ఈ ప్రకంపనలతో నల్లమలలోని పలు ప్రాంతాలు, శ్రీశైలం సమీపగ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.


తప్పిన పెనుముప్పు..

మరోవైపు.. ఈ ప్రకంపనలతో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌కు పెనుముప్పే తప్పింది. అయితే ప్రాజెక్ట్ కట్టినప్పట్నుంచి ఇప్పటివరకూ ఇలాంటి ప్రకంపనలు జరగలేదని.. ఇదే మొదటిసారి అని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారే భూమి కంపించిందని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు ధైర్యం చెబుతున్నారు. ఈ భూకంపానికి కారణాలేంటి అనేవి మాత్రం ఇప్పటి వరకూ తెలియరాలేదు. అయితే వరదతో వచ్చిన ప్రకంపనలు మాత్రం ఇవి కాదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. రేపు సాయంత్రం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి వేసే అవకాశం ఉంది.


పెద్ద శబ్దాలు వచ్చాయి..

ఉదయం చదువుకునేందుకు నిద్ర లేచి లాప్‌టాప్‌ను ఓపెన్‌ చేస్తుండగా, ఒక్కసారిగా పెద్ద శ బ్దం వచ్చింది. మంచం కొద్దిగా కదిలినట్టుగా అ నిపించింది. ఈ విషయం అమ్మానాన్నలతో చెప్పా. అంతలోనే సోషల్‌ మీడియాలో ఈ ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చినట్లుగా తెలిసింది. - మనస్వి, వేంకటేశ్వర కాలనీ, అచ్చంపేట


భూ ప్రకంపనల నమోదు కాలేదు..

తెల్లవారుజామున భూ ప్రకంపనలపై ఢిల్లీలోని ఉన్నతాధికారులను సంప్రదించా. వారు ఒక వెబ్‌సైట్‌ను చూచించారు. దానిని ఓపెన్‌ చేసి చూడగా, నల్లమల ప్రాంతంలో ఎలాంటి భూ ప్రకంపనలు చూపలేదు. వనపర్తి జిల్లాలో 4.0 స్కేల్‌ నమోదు చూపించింది. - పాండు, ఆర్డీవో, అచ్చంపేట.

Updated Date - 2021-07-27T15:36:21+05:30 IST