‘తూర్పు’ మూడు!

ABN , First Publish Date - 2022-01-26T07:13:46+05:30 IST

కొత్త జిల్లాల సందడి మొదలైంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల స్థానే 26 జిల్లాలు చేయడానికి ప్రభు త్వం నిర్ణయించింది. ఈమేరకు ఫోన్ల ద్వారా కేబినెట్‌ ఆమోదం కూడా పొందినట్టు ప్రకటించింది. దీంతో తూర్పుగోదావరి జిల్లాను మూడు జిల్లాలుగా చేయనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి అందిన సమాచారం ప్రకారం మన తూర్పు గోదావరి జిల్లాను ఏజెన్సీ మినహా యించి మూడు జిల్లాలుగా విభజిస్తున్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా గోదావరి

‘తూర్పు’ మూడు!

గోదావరి (రాజమహేంద్రవరం) జిల్లా 

కాకినాడ జిల్లా 

కోనసీమ (అమలాపురం) జిల్లా

ఏజెన్సీ ప్రాంతం అరకు జిల్లాలోకే 

పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోనే కొత్త జిల్లాలు


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

కొత్త జిల్లాల సందడి మొదలైంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల స్థానే 26 జిల్లాలు చేయడానికి ప్రభు త్వం నిర్ణయించింది. ఈమేరకు ఫోన్ల ద్వారా కేబినెట్‌ ఆమోదం కూడా పొందినట్టు ప్రకటించింది. దీంతో తూర్పుగోదావరి జిల్లాను మూడు జిల్లాలుగా చేయనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి అందిన సమాచారం ప్రకారం మన తూర్పు గోదావరి జిల్లాను ఏజెన్సీ మినహా యించి మూడు జిల్లాలుగా విభజిస్తున్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా గోదావరి జిల్లా ఏర్పడనుంది. కాకినాడ కేంద్రంగా కాకినాడ జిల్లా ఏర్పడనుంది. అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పడనుంది. రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని అరకు జిల్లా పరిధిలోకి  తీసుకొచ్చారు. ఈ జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్‌ ఆమో దం తెలిపింది. ఆన్‌లైన్‌లో మంత్రులకు ప్రతిపాదనలు పంపి ఆమోదం పొం దిన ప్రభుత్వం. కానీ ఇంత ఆకస్మికంగా ఈ అంశాన్ని తెరమీదకు తేవడం, ఇటీవల కేబినెట్‌ సమావేశం జరిగినా, అక్కడ కనీస ప్రస్తావన లేకుండా, ఆన్‌లైన్‌ ప్రతిపాదనలు పంపి, మంత్రులతో ఆమోదింపచేయడం.. ఇదంతా ఓ తతంగంగా జరుగుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఒకపక్క ఉద్యోగ సంఘాలు సమ్మె సైరన్‌ మోగించగా,  మరొక పక్కన ప్రజాభిప్రాయం లేకుం డా ఈ నిర్ణయం తప్పని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. వాస్తవానికి  2021 జనాభా లెక్కలు (జనగణన) పూర్తయ్యే వరకూ ఏ విభజనలు చెల్లవ ని గతంలో కేంద్రం స్పష్టం చేసింది. కానీ కొవిడ్‌ వల్ల ఇప్పటికీ జనగణన జరగలేదు. మరి ప్రభుత్వం ఏవిధంగా  నిర్ణయం తీసుకుందనే చర్చ జరుగుతోం ది. ఉగాదికే కొత్త జిల్లాలు ఏర్పడతాయనే ప్రచారం ఉంది.  రేపోమాపో నోటిఫికేషన్‌ జారీ కానుంది. ఉగాదినాటికి రెండో నోటిఫికేషన్‌తో కొత్త జిల్లాలను అమలులోకి తేవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు.


గోదావరి జిల్లా :

రాజమహేంద్రవరం కేంద్రంగా గోదావరి జిల్లా ఏర్పడనుంది. మొదట రాజమహేంద్రవరం జిల్లా అనుకున్నారు. గోదావరి ఉనికిపోకుండా ప్రజల కోరిక మేరకు గోదావరి జిల్లాను ఏర్పాటుచేస్తున్నారు. రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం ఈ గోదావరి జిల్లా కానుంది. ఇందులో రాజమహేంద్రవరం సిటీ,  రూరల్‌ నియోజకవర్గాలు, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాలు, పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలు ఉంటాయి. రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ కార్యాలయాన్ని జిల్లా కలెక్టరేట్‌గా మార్చే అవకాశం ఉంది. ఇంకా ధవళేశ్వరంలోని ఇరిగేషన్‌ భూములు పరిశీలించారు. దీంతో రాజమహేంద్రవరం సిటీతోపాటు ఈ పరిసర గ్రామాల్లోనూ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పడే అవకాశం ఉంది.


కాకినాడ జిల్లా :

కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో కాకినాడ జిల్లాగా మారనుంది. ఇందులో కాకినాడ సిటీ, కాకినాడ రూరల్‌, పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, తుని, పెద్దాపురం నియోజకవర్గాలు ఉంటాయి. కాకినాడలో కలెక్టరేట్‌ ఉంది కాబట్టి అదే ఉంటుంది. అక్కడ ఆఫీసులకు ఇబ్బంది ఉండదు.


కోనసీమ జిల్లా :

అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పడనుంది. లోక్‌సభ పరిధిలోని అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం, కొత్తపేట, మండపేట, రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఇక్కడ ఆర్డీవో కార్యాలయం ప్రస్తుత కలెక్టరేట్‌గా ఉండే అవకాశం ఉంది.


ప్రజల డిమాండ్‌ గాలికేనా..?

 కొత్త జిల్లాల ఏర్పాటు అంశంలో చాలాకాలం నుంచి ప్రజల్లో చాలా వాదనలు ఉన్నాయి. వాటిని ప్రభుత్వం పట్టించుకున్నట్టు లేదు. రాజమహేంద్రవరం కేంద్రంగా గోదావరి జిల్లా ఏర్పాటుకావాలని ప్రజలే డిమాండ్‌ చేశారు. ఇందులో మండపేట నియోజకవర్గం కూడా ఉండాలనే డిమాండ్‌ ఉంది. అమలాపురం వెళ్లాలంటే దూరం అవుతుందనే వాదనతో గతంలో విజ్ఞాపనలు ఇచ్చారు. కానీ ప్రస్తుత నిర్ణయం ప్రకారం ఇది కోనసీమ జిల్లా పరిధిలోకి వెళ్లింది. ఇక గోపాలపురం నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లాలో కలపాలని, అక్కడ ప్రముఖ దేవాలయం ద్వారకాతిరుమల ఆ జిల్లాలోనే ఉండాలనే డిమాండ్‌ కూడా ఉంది. పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా రాజమహేంద్రవరం జిల్లాలో కలపాలనే డిమాండ్‌ ఉండేది. ఇవేవీ జరగలేదు.

Updated Date - 2022-01-26T07:13:46+05:30 IST