ఉపసంహరణం!

ABN , First Publish Date - 2021-03-03T07:28:36+05:30 IST

కాకినాడ (ఆంధ్రజ్యోతి): గతేడాది మధ్యలో నిలిచిపోయిన మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ తిరిగి మళ్లీ మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ఘట్టంతో మొదలైంది. తొలిరోజు ఉపసంహరణలు భారీగా నమోదయ్యా యి. ఎక్కడికక్కడ మున్సిపాల్టీ కార్యాలయాల పరిధిలో జరిగిన విత్‌డ్రాలన్నీ కలిపి మొత్తం 292గా తేలాయి. పెద్దాపురం

ఉపసంహరణం!

మున్సిపల్‌ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం తుది అంకానికి చేరుకుంది. తొలి రోజు ఏడు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీల పరిధిలో విత్‌డ్రాలు భారీగానే జరిగాయి. ప్రధాన పార్టీలు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులతో సహా మొత్తం 292 మంది తమ అభ్యర్థిత్వాలు ఉపసంహరించుకున్నారు. అత్యధికంగా పెద్దాపురం మున్సిపాల్టీ పరిధిలో 61మంది విత్‌డ్రా అయ్యారు. అత్యల్పంగా ముమ్మిడివరం నగర పంచాయతీలో ముగ్గురు ఉపసంహరించుకున్నారు. కాగా నామినేషన్ల విత్‌డ్రాకు బుధవారం చివరి రోజు కావడంతో అధికార వైసీపీ బేరాలు ముమ్మరం చేసింది. వార్డుకు అత్యధికంగా రూ.10 లక్షల వరకు ఇచ్చేలా టీడీపీ అభ్యర్థులపై వల విసురుతోంది. ఎట్టి పరిస్థితుల్లో బుధవారం మధ్యాహ్నంలోగా భారీగా ఏకగ్రీవాలు అయ్యేలా బేరాలు నడుపుతోంది. అటు ఎన్నికలు జరగనున్న మొత్తం 268 వార్డుల్లో ఇప్పటికే 22 చోట్ల వైసీపీ ఏకగ్రీవాలయ్యాయి.


తొలిరోజు 292 మున్సిపల్‌ 

నామినేషన్లు ఉపసంహరణ

అత్యధికంగా పెద్దాపురం మున్సిపాల్టీ 

పరిధిలో 61 మంది వెనక్కు

విత్‌డ్రా అయినవారిలో అధికంగా

 ప్రధాన పార్టీల డమ్మీ అభ్యర్థులే

ఉపసంహరణకు నేడే ఆఖరు రోజు.. 

బేరాల జోరు పెంచిన వైసీపీ

టీడీపీ అభ్యర్థులు బరి నుంచి 

తప్పుకుంటే రూ.10 లక్షలు : కాంట్రాక్టు వర్కులు

కాదంటే కేసులు పెడతామంటూ హెచ్చరికలు.. 

రంగంలోకి అధికార పార్టీ నేతలు

మొత్తం 268 వార్డులకు 

ఇప్పటికే వైసీపీ ఖాతాలో 22 ఏకగ్రీవాలు

కాకినాడ (ఆంధ్రజ్యోతి): గతేడాది మధ్యలో నిలిచిపోయిన మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ తిరిగి మళ్లీ మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ఘట్టంతో మొదలైంది. తొలిరోజు ఉపసంహరణలు భారీగా నమోదయ్యా యి. ఎక్కడికక్కడ మున్సిపాల్టీ కార్యాలయాల పరిధిలో జరిగిన విత్‌డ్రాలన్నీ కలిపి మొత్తం 292గా తేలాయి. పెద్దాపురం మున్సిపాల్టీ పరిధిలో మొత్తం 61 నామినేషన్లు ఉపసంహరించుకోగా, ఇందులో వైసీపీ డమ్మీ అభ్యర్థులు 26 మంది, టీడీపీ డమ్మీ అభ్యర్థులు 23, సీపీఎం 4, జనసేన 1, బీజేపీ 2, ఇండిపెండెంట్‌ 5 చొప్పున ఉన్నాయి. తుని మున్సిపాల్టీ పరిధిలో 51 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉప సంహరించుకోగా, వైసీపీ నుంచి 24, టీడీపీ 24, కాంగ్రెస్‌ 2, జనసేన 1 చొప్పున ఉన్నాయి. మండపేట పరిధిలో మొత్తం 37 మంది విత్‌డ్రా కాగా, అందులో టీడీపీ 31, జనసేన 4, వైసీపీ 1, ఇండిపెండెంట్‌ 1 ఉన్నాయి. అమలాపురంలో వైసీపీ నుంచి 25, టీడీపీ 9, బీజేపీ 1, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు అయి దుగురు మొత్తం 40 మంది విత్‌డ్రా అయ్యారు. రామచంద్రపురం ము న్సిపాల్టీలో 27 మంది నామినేషన్లు ఉపసంహరించుకోగా, వైసీపీ 19, టీడీపీ 2, జనసేన 3, ఇండిపెండెంట్లు ముగ్గురు ఉన్నారు. పిఠాపురం మున్సిపాల్టీలో వైసీపీ నుంచి 3, టీడీపీ అభ్యర్థి 4, ఇండిపెండెంట్‌లు అ యిదుగురితో కలిపి మొత్తం 12 మంది విత్‌డ్రా అయ్యారు. అదేవిధంగా సామర్లకోటలో 44 విత్‌డ్రాలు నమోదుకాగా, టీడీపీ డమ్మీ అభ్యర్థులు 19 మంది, వైసీపీ 18, జనసేన 4, సీపీఎం 3 చొప్పున ఉన్నాయి. ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో ఏడు నామినేషన్లు విత్‌డ్రా అవగా, అవన్నీ వైసీపీ నుంచి దాఖలైన డమ్మీ అభ్యర్థులవే ఉన్నాయి. గొల్లప్రోలు నగర పంచాయతీలో వైసీపీ డమ్మీ అభ్యర్థులు 9 మంది, టీడీపీ నుంచి ఒకటి వెరసి పది విత్‌డ్రాలు నమోదయ్యాయి. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో వైసీపీ 2, ఇండిపెండెంట్‌ 1 కలిపి మొత్తం ముగ్గురు అభ్యర్థులు అభ్యర్థిత్వాలు ఉపసంహరించుకున్నారు.


గురి వాటిపైనే...

నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి బుధవారం ఆఖరిరోజు కావడంతో అధికార వైసీపీ ఎక్కడికక్కడ బరితెగించింది. సాధ్యమైనన్ని ఎక్కువ వార్డుల్లో పోటీ లేకుండా ఏకగ్రీవం చేసుకునేందుకు వీలుగా బేరాలు ముమ్మరం చేసింది. అందుకోసం టీడీపీ అభ్యర్థులపై ప్రలోభాల వల విసురుతోంది. బుధవారం నామినేషన్‌ విత్‌డ్రా చేసుకుంటే వార్డుకు రూ.10లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఇవ్వజూపుతోంది. ముఖ్యంగా తుని మున్సిపాల్టీ పరిధిలో ఇప్పటికే వైసీపీకి 14 వార్డులు ఏకగ్రీవం అయ్యా యి. దీంతో మిగిలిన మరికొన్ని వార్డుల్లోను పోటీ లేకుండా చేసుకోవడానికి కోట్లలో వెదజల్లుతోంది. అందులో భాగంగా మరో ఆరు వార్డుల్లో టీడీపీ అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి దారిలోకి తెచ్చుకోవడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు కొనసాగిస్తోంది. నగదుతోపాటు మున్సిపాల్టీలో కాంట్రాక్టు వర్కులు ఇస్తామని హామీ ఇస్తోంది. పిఠాపురం, గొల్లప్రోలు, రామచంద్రపురం, అమలాపురం, మండపేట, పెద్దాపురం, సామర్లకోట మున్సిపాల్టీల పరిధి లో ఈ బేరాలు ఎక్కువగా సాగుతున్నాయి. బుధవారం ఉద యంలోగా ఈ మున్సిపాల్టీల పరిధిలో మరికొన్ని వార్డులు చేజిక్కించుకోవాలన్న వ్యూహంలో భాగంగా మంగళవారం రాత్రి నుంచి పలువురు వైసీపీ కీలకనేతల రంగంలోకి దిగి బేరసారాలు ముమ్మరం చేశారు. కాగా మంగళవారం వరకు సామర్లకోట మున్సిపాల్టీలో ఒకటో వార్డు, పిఠాపురంలో 6వ వార్డు, తుని లో 14 వార్డులు, అమలాపురం 5 వార్డులు, రామచంద్రపురంలో 6వ వార్డు కలిపి మొత్తం 22 వార్డులను వైసీపీ బెదిరింపులు, ప్రలోభాలతో ఏకగ్రీవం చేసుకుంది. బుధవారం మరికొన్ని వార్డులు సైతం ఏకగ్రీవాల జాబితాలో వేసుకునేందుకు సిద్ధమైంది.

ఎక్కడ..ఎన్ని..

పెద్దాపురం 61

తుని  51

మండపేట 37

అమలాపురం 40

రామచంద్రపురం 27

పిఠాపురం 12

సామర్లకోట 44

ఏలేశ్వరం 07

గొల్లప్రోలు 10

ముమ్మిడివరం 03

మొత్తం       292



Updated Date - 2021-03-03T07:28:36+05:30 IST