Abn logo
Oct 19 2021 @ 02:21AM

దళితబంధుకు ఈసీ బ్రేక్‌

  • హుజూరాబాద్‌లో పథకాన్ని నిలిపివేయాలని ఆదేశం
  • అన్ని రూపాల్లోనూ అమలును నిలిపివేయాలి
  • ఉప ఎన్నిక ముగిశాక కొనసాగించుకోవచ్చు
  • ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకే
  • కోడ్‌ అమల్లో ఉన్నందున నిర్ణయం: ఈసీ
  • నియోజకవర్గంలో 20,929 దళిత కుటుంబాలు
  • ఇప్పటికే 18 వేల మంది ఖాతాల్లో నగదు జమ
  • దళిత బంధు పాతదేనని గతంలో కలెక్టర్‌ నివేదిక
  • అయినా ఆంక్షలు విధించిన ఎన్నికల కమిషన్‌


హైదరాబాద్‌/కరీంనగర్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ఉప ఎన్నిక జరుగుతున్న హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో దళిత బంధు పథకం అమలుకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఉప ఎన్నిక ముగిసేదాకా ఈ నియోజకవర్గ పరిధిలో అన్ని రూపాల్లోనూ దళిత బంధు పథకం అమలును నిలిపివేయాలని భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) సోమవారం ఆదేశించింది. నియోజకవర్గంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున.. ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఉప ఎన్నిక ముగిశాక పథకాన్ని యథావిధిగా కొనసాగించుకోవచ్చని సూచించింది. ఈ మేరకు ఈసీఐ ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30 వరకు హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని నిలిపివేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వాస్తవానికి ఈ పథకాన్ని నిలిపివేయాల్సిందిగా సీఈసీకి ఏ రాజకీయ పార్టీగానీ, వ్యక్తులుగానీ ఫిర్యాదు చేయలేదు. 


ఈ అంశంపై తమను ఎవరూ కోరలేదని రాష్ట్ర ఎన్నికల అధికారులు కూడా ఇదివరకే స్పష్టత ఇచ్చారు. అయినా ఈసీ తనంతట తానుగా నిర్ణయం తీసుకుంది. కాగా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మొత్తం 20,929 దళిత కుటుంబాలు ఉండగా.. ఇప్పటికే మొదటి విడతగా 18 వేల మంది బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నగదును జమ చేసింది. ఒక్కొక్కరి ఖాతాలో రూ.9.90 లక్షల చొప్పున జమ చేశారు. రూ.10 వేలను రక్షణ నిధికి కేటాయించారు. అయితే రూ.9.90 లక్షల నిధులను వినియోగించుకోకుండా ఫ్రీజింగ్‌ విధించారు. లబ్ధిదారులు ఈ మొత్తంతో ఏ వ్యాపారం చేద్దామనుకుంటున్నారో, ఏ యూనిట్‌ స్థాపించాలనుకుంటున్నారనే దానిపై అధికారులు సర్వే చేసి నివేదికలు సిద్ధం చేశారు. వాటికి సంబంధించి ప్రాజెక్టు రిపోర్టులు సమర్పించి లబ్ధిదారులు ఆయా యూనిట్ల స్థాపనకు అవసరమైన శిక్షణ పొందిత తరువాత నిధులు విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. అయితే నియోజకవర్గ పరిధిలో అన్ని రూపాల్లోనూ దళిత బంధు పథకాన్ని నిలిపివేయాలని ఈసీ ఆదేశించడంతో ఈ పథకానికి సంబంధించిన ప్రక్రియలన్నీ తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.

 

ప్రతిష్ఠాత్మకంగా దళిత బంధు..

సమాజంలో అన్ని వర్గాల్లోకెల్లా వెనకబడ్డ దళితులకు ఆర్థిక స్వావలంబన కల్పించాలని, ప్రతి దళిత కుటుంబానికీ రూ.10 లక్షల చొప్పున అందజేసి వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ ప్రతిష్ఠాత్మక పథకాన్ని  హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించారు. అయితే హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక రానుండడంతో దళితుల ఓట్ల కోసమే ఈ పథకాన్ని తెచ్చారనే ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వచ్చాయి. ముఖ్యమంత్రి కూడా.. ప్రభుత్వంలో ఉన్న పార్టీగా పథకాన్ని ప్రవేశపెట్టి ప్రయోజనం పొందాలనుకోవడంలో తప్పేముందని తొలుత అన్నారు. కానీ, ఆ తరువాత మాత్రం ఎప్పటినుంచో దళిత బంధు పథకం తమ ప్రతిపాదనల్లో ఉందని, ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనే దీనిని ప్రస్తావించామని, నిధులు కూడా కేటాయించామని తెలిపారు.


 రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా అన్ని దళిత కుటుంబాలకూ రూ.10 లక్షల చొప్పున అందజేస్తామని ప్రకటించారు. ఈ పథకం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొచ్చారు. అయితే దళిత బంధును పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయాలనుకున్న హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ వెలువడనుండడం, ఎన్నికల కమిషన్‌ దీనిని కొత్త పథకంగా పరిగణనలోకి తీసుకునే అవకాశాలుండడంతో .. ముందుగా సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఆగస్టు 4న ప్రారంభించారు. గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు రూ.7.60 కోట్లను ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ ఖాతాలోకి ఆగస్టు 5న బదిలీ చేశారు. ఆ తరువాత ఆగస్టు 16న హుజూరాబాద్‌లో సమావేశం నిర్వహించి 15 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. 


పాత పథకమేనని కలెక్టర్‌ నివేదిక...

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 46,700 మంది దళిత ఓటర్లు ఉన్నారని, ఉప ఎన్నికలో వారి ఓట్లను అధికార పార్టీ పొందేందుకే ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని తెచ్చిందంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో దళిత బంధు పథకం పాతదేనని సీఈసీకి కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ నివేదిక ఇచ్చారు. గత మార్చిలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లోనే ఈ పథకానికి ప్రభుత్వం రూ.1000 కోట్ల నిధులు కేటాయించిందని, ఆగస్టు 4న వాసాలమర్రి గ్రామంలో ప్రారంభమైందని నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ పథకం అమలు జరుగుతుందన్నారు. హుజూరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించాలని మాత్రమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. అయినా.. ఇప్పుడు పథకాన్ని నిలిపివేయాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.


సోమవారమూ 4 మండలాలకు నిధులు.. 

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళిత బంధు పథకం అమలుకు రూ.2 వేల కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఐదు విడతల్లో రూ.2 వేల కోట్లు విడుదల చేశారు. 20219 ఆగస్టు 9న రూ.500 కోట్లు, ఆగస్టు 23న రూ.500 కోట్లు, ఆ తర్వాత వరుసగా మూడు రోజులపాటు రూ.  200 కోట్లు, రూ.300 కోట్లు, రూ.500 కోట్లు విడుదల చేశారు. తాజాగా సోమవారం మరో రూ.250 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రానికి నలుదిక్కుల ఉన్న నాలుగు నియోజకవర్గాల్లోనూ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామన్న సీఎం కేసీఆర్‌ ప్రకటనకు అనుగుణంగా.. వీటిలో రూ.100 కోట్లను ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలానికి, రూ.50 కోట్లు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలానికి, రూ.50 కోట్లు నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాలలోని చారగొండ మండలానికి, రూ.50 కోట్లు కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలోని నిజాంసాగర్‌ మండలానికి విడుదల చేశారు.