సులభతరంగా ‘ధరణి’ సేవలు

ABN , First Publish Date - 2020-10-19T09:55:26+05:30 IST

జిల్లాలో ధరణి పోర్టల్‌ సేవలను సులభతరంగా ప్రజలకు అందించేందుకు అన్ని ఏర్పాట్లుతో సిద్ధంగా ఉండాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ తహసీల్దార్లను ఆదేశించారు

సులభతరంగా ‘ధరణి’ సేవలు

ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌


ఖమ్మం రూరల్‌/ నేలకొండపల్లి, అక్టోబరు 18: జిల్లాలో ధరణి పోర్టల్‌ సేవలను సులభతరంగా ప్రజలకు అందించేందుకు అన్ని ఏర్పాట్లుతో సిద్ధంగా ఉండాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ తహసీల్దార్లను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా దసరా నుంచి ప్రారంభించనున్న  ధరణి సేవలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు ఖమ్మం రూరల్‌ తహశీల్దార్‌ కార్యాలయంలో ఆదివారం ప్రయోగాత్మకంగా రిజిస్ర్టేషన్‌ సేవలను ట్రయల్‌రన్‌ చేపట్టారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రిజిస్ట్రేషన్ల సేవలు, భూక్రయ విక్రయాల మ్యూటేషన్లతో పాటు ఈసీల జారీకి అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధంగా ఉంచడంతో పాటు, ప్రయోగాత్మకంగా పరిశీలించాలని తహశీల్దార్లను ఆదేశించారు. ప్రయోగాత్మక పరిశీలనలో ఏమైనా సాంకేతిక లోపాలు ఉంటే ముందుగానే సరిచూసుకోవాలని ఆదేశించారు. ధరణి పోర్టల్‌ ద్వారా అతితక్కువ సమయంలోనే రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌, ఈసీల ఆనీ సేవలు ప్రజలకు సులభతరంగా అందనున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్‌ డిప్యూటీ తహసీల్దార్‌ సునీల్‌ రెడ్డి, ఆర్‌ఐ నరేష్‌ పాల్గొన్నారు.


దసరా నుంచి ధరణి ప్రారంభం

దసరా పర్వదినం నుంచి రాష్ట్రంలో ధరణి వెబ్‌సైట్‌ ప్రారంభం కానున్న తరుణంలో కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ఆదివారం ఉదయం నేలకొండపల్లి తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ధరణి వెబ్‌సైట్‌ను పరిశీలించారు. రిజిస్ట్రేషన్లు సక్రమంగా అయ్యేది, లేనిది తెలుసుకోవటానికి 20 వరకు డమ్మీ రిజిస్ట్రేషన్లు చెయ్యాలని ఆదేశించినట్లు తహసీల్దార్‌ తాళ్లూరి సుమ తెలిపారు.

Updated Date - 2020-10-19T09:55:26+05:30 IST