Abn logo
May 10 2021 @ 08:29AM

కరోనా కష్ట కాలంలో ఈ పండు తిని.. ఇమ్యూనిటీ పెంచుకోండి

హైదరాబాద్/దిల్‌సుఖ్‌నగర్‌ : ఆరెంజ్‌ రంగులో మెరిసిపోయే నారింజ పండ్లు చూడగానే నోరూరిస్తాయి. పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లక్షణాలు సమృద్ధిగా ఉండే కమ్మని నారింజ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి శక్తినిచ్చే నారింజ కరోనా కష్ట కాలంలో ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది. సిట్రస్‌ జాతికి చెందిన నారింజలో విటమన్‌-సి పుష్కలంగా ఉండడంతో పాటు జలుబు, దగ్గులాంటి అనారోగ్య సమస్యలను దరిచేరనీయదు. దీంతో ఈ పండ్లను ఎక్కువగా తినేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.


రెండు రకాలు..

నారింజ, నిమ్మ, బత్తాయి ఒకే జాతికి చెందిన ఫలాలు. ఈ మూడింటి గుణాలు దాదాపు సమానంగానే ఉంటాయి. నిమ్మకన్నా నారింజను కాస్త ఉత్తమంగా భావిస్తారు. నారింజలో పుల్ల నారింజ, తీపి నారింజ అనే రెండు రకాల పండ్లున్నాయి. పులుపు పండ్లలో నీరు అధికంగా, లవణాలు తక్కువగా ఉంటాయి. తీపి నారింజలో నీరు తక్కువగా ఉండి..లవణాలు ఎక్కువగా ఉంటాయి. పుల్ల నారింజలు వర్షకాలంలో, తీపి నారింజలు వేసవిలో కాస్తుంటాయి. ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం వేసవి కాలంలో లభించే తీపి నారింజనే తీసుకోవడం శ్రేయస్కరమంటున్నారు.

నారింజ పండ్లతో ప్రయోజనాలు..

  1. నారింజ పండ్లు శరీరానికి బలాన్నిస్తాయి. మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చూస్తాయి. జ్వరాల బారిన పడినప్పుడు నారింజను తింటే జీర్ణ సమస్య తగ్గడమే కాక దేహానికి శక్తినిస్తుంది.
  2. ఆహారనాళంలో క్రిములు చేరకుండా నిరోధిస్తాయి. వీటిలోని బీటా కెరోటిన్‌ శరీరంలోని కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండ్లలో ఉండే కాల్షియం ఎముకలు, దంతాల ధృడత్వానికి ఉపయోగపడుతుంది. 
  3. రక్తాన్ని శుద్ధి చేయడంలో, రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూడటంలో నారింజ పండ్లు కీలకపాత్ర పోషిస్తాయి. దీంతోపాటు గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది. విటమిన్‌-సి అధికంగా ఉండడంతో చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. 
  4. గర్భిణులు నిత్యం నారింజ పండ్లను తీసుకుంటే పోలిక్‌యాసిడ్‌ లోపం రాకుండా చూడవచ్చు. ఇవి వ్యాధి నిరోధిక శక్తిని పెంచుతాయి. అస్తమా, టీబీ వంటి వాటితో బాధపడేవారికి నారింజ పండ్లు చక్కని ఉపశమనాన్నిస్తాయి.
  5. నారింజ జ్యూస్‌ చేసుకుని తాగితే కిడ్నీలో రాళ్లు రాకుండా నిరోధించవచ్చు. మెదడుకు ఉత్సామం, ఉత్తేజాన్ని ఇచ్చే గుణం నారింజలో ఉంది.
  6. రోజుకు 2 గ్లాసుల నారింజ రసం తాగితే రక్తపోటు ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.
  7. మలబద్ధకాన్ని, కొలెస్ర్టాల్‌ను తగ్గించడంతో పాటు పలు రకాల కేన్సర్‌లకు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు వీటిలో ఉంటాయి. 
  8. అస్తమా లాంటి అలర్జీ సంబంధిత సమస్యలకు కూడా ఈ పండ్లు మందులా పనిచేస్తాయి.

సిట్రస్‌ పండ్లను తినడం శ్రేయస్కరం

విటమిన్‌-సీ సమృద్ధిగా ఉండే నారింజ పండ్లను తినడం మూలంగా తక్షణ శక్తి లభిస్తుంది. నారింజ పండులో విటమిన్‌-ఏ, బీ స్వల్ఫంగా, విటమిన్‌-సీ అధికంగా ఉంటాయి.  దీంతో పాటు సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నిషియం, రాగి, గంధకం, క్లోరిన్‌లు కూడా ఉంటాయి. ఆహార నాళ్లలో విషక్రిములు చేరకుండా, నారింజ వాటిని చంపేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించే నారింజ పండ్లతో పాటు సిట్రస్‌ పండ్లను ఎక్కువగా తీసుకోవడం శ్రేయస్కరం. కరోనా విజృంభిస్తున్న వేల పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం మూలంగా వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది. - డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, వైద్య నిపుణులు

ప్రత్యేకం మరిన్ని...