నేడు కమలం గూటికి ఈటల

ABN , First Publish Date - 2021-06-14T05:51:38+05:30 IST

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సోమవారం భారతీయ జనతా పార్టీలో చేరి కాషాయ కండువా కప్పుకోనున్నారు.

నేడు కమలం గూటికి ఈటల

- బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో చేరిక

- కొవిడ్‌ నేపథ్యంలో 20 మందికి మాత్రమే అనుమతి 

- ఇప్పటికే ఢిల్లీ చేరిన రాష్ట్ర ముఖ్య నేతలు 

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 13: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సోమవారం భారతీయ జనతా పార్టీలో చేరి కాషాయ కండువా కప్పుకోనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల రాజేందర్‌తోపాటు  జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, మాజీ ఎంపీ రమేశ్‌రాథోడ్‌, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, గండ్ర నళినితో కలిసి 20 మంది వరకు బీజేపీలో చేరనున్నారు. ఈటల రాజేందర్‌ చేరిక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌, ఎంపీలు డి అర్వింద్‌, సోయం బాబురావు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ తదితర నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ నేతలను కలిసి వచ్చిన ఈటల రాజేందర్‌ దాదాపు 200 మందితో ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో చేరేందుకు ప్రత్యేక చార్టర్‌ విమానాలను సిద్ధం చేసుకున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో 20 మందికి మాత్రమే బీజేపీ అగ్రనేతలు అనుమతి ఇచ్చారు. దీంతో కేవలం ముఖ్యనేతలు రాజేందర్‌తో కలిసి పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మిగిలిన నేతలు ఆ తర్వాత రాష్ట్రంలోగానీ, ఢిల్లీలో జాతీయ నేతల సమక్షంలోగానీ దశలవారీగా చేరుతారని సమాచారం.  ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరిన తర్వాత మంగళవారం హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. ఆ మరుసటి రోజు నుంచి హుజూరాబాద్‌లోనే మకాం వేసి గ్రామాల్లో పర్యటించాలని భావిస్తున్నారని తెలిసింది. 

Updated Date - 2021-06-14T05:51:38+05:30 IST