నేరగాళ్లని నిలబెడితే కారణాలు చెప్పాలి: ఈసీ

ABN , First Publish Date - 2022-01-09T02:12:55+05:30 IST

క్రిమినల్ కేసులున్న వ్యక్తులను ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెడితే ఆ..

నేరగాళ్లని నిలబెడితే కారణాలు చెప్పాలి: ఈసీ

న్యూఢిల్లీ: క్రిమినల్ కేసులున్న వ్యక్తులను ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెడితే ఆ వివరాలను రాజకీయ పార్టీలన్నీ తమ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయడం తప్పనిసరి అని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అలాంటి వ్యక్తులను అభ్యర్థులుగా ఎందుకు నిలబెట్టాల్సి వచ్చిందో కూడా కారణాలు చెప్పాలని సీఈసీ సుశీల్ చంద్ర పేర్కొన్నారు. శనివారంనాడు ఎన్నికల షెడ్యూల్‌ను ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభ్యర్థులుగా ఎంపిక చేసిన వారిపై ఉన్న పెండింగ్ క్రిమినల్ కేసుల సమాచారాన్ని పార్టీలు తమ వెబ్‌సైట్ హోంపేజీలో పేర్కొనాలని, క్రిమినల్ చరిత్రను మూడు సందర్భాల్లో పేపర్లు, టీవీ ఛానల్స్‌లో ప్రచారం చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు.


అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించినందున ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) తక్షణం అమల్లోకి వచ్చిందని, ఎంసీసీ నిబంధనలు సమర్ధవంతంగా అమలు చేసేందుకు ఈసీ విస్తృత ఏర్పాట్లు చేసిందని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని కూడా ఆయన హెచ్చరించారు. డబ్బులు పంచడం, ఉచిత కానుకలు ఇవ్వడం సహా ఎంసీసీ ఉల్లంఘనలు ఎక్కడ చోటుచేసుకున్నా వెంటనే ఓటర్లు 'విజిల్ అప్లికేషన్' ద్వారా తమ దృష్టికి తేవాలన్నారు. ఫిర్యాదు నమోదైన 100 నిమిషాల్లోనే ఘటనా స్థలికి ఈసీ అధికారులు చేరుకుంటారని కూడా సీఈసీ స్పష్టం చేశారు.

Updated Date - 2022-01-09T02:12:55+05:30 IST