మత విద్వేష వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యేకు ఈసీ నోటీసు

ABN , First Publish Date - 2022-01-17T15:31:46+05:30 IST

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మత విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే నంద్ కిషోర్ గుర్జార్‌కు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నోటీసులు జారీ చేసింది....

మత విద్వేష వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యేకు ఈసీ నోటీసు

లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మత విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే నంద్ కిషోర్ గుర్జార్‌కు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నోటీసులు జారీ చేసింది.లోనీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే నంద్ కిషోర్ గుర్జార్ ఈ ఎన్నికల్లోనూ పోటీ చేయనున్నారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత తన మద్ధతుదారులను ఉద్ధేశించి నంద్ కిషోర్ మాట్లాడుతూ మత విద్వేష వ్యాఖ్యలు చేశారు.‘‘నా అలీ, నా బాహుబలి, మే సిర్ఫ్ బజరంగ్ బలి’’ (నేను అలీ కాదు, బాహుబలి కాదని బజరంగ్ బలి మాత్రమే’’ అని నంద్ కిషోర్ వ్యాఖ్యానించారు.విద్వేష వ్యాఖ్యలపై మూడు రోజుల్లోగా  అంటే బుధవారంలోగా ఎన్నికల కమిషన్‌కు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని నంద్ కిషోర్ గుర్జార్‌ను ఈసీ కోరింది. 




దీనిపై స్పందించిన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించాలి.ఈసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ, అఖిలేష్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్, మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీల మధ్య చతుర్ముఖ పోరు జరిగే అవకాశం ఉంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను అధికార బీజేపీ సీఎం అభ్యర్థిగా భావిస్తోంది. కొవిడ్-19 కేసుల పెరుగుదల కారణంగా  జనవరి 22 వరకు ఉత్తరప్రదేశ్‌తో సహా మొత్తం ఐదు రాష్ట్రాల్లో ప్రచార ర్యాలీలను కేంద్ర ఎన్నికల సంఘం నిషేధించింది.


Updated Date - 2022-01-17T15:31:46+05:30 IST