ఆర్థిక అసమాన భారతం

ABN , First Publish Date - 2022-01-18T10:23:36+05:30 IST

కరోనా సంక్షోభంతో దేశంలో ఆర్థిక అసమానతలు మరింత పెరిగాయని ఆక్స్‌ఫామ్‌ ఇండియా తాజా నివేదిక హెచ్చరించింది.

ఆర్థిక అసమాన భారతం

కరోనా సంక్షోభ కాలంలో మరింత పెరిగిన అంతరం 

గత ఏడాది దేశంలో 40 మంది కొత్త బిలియనీర్లు 

మొత్తం 142కు చేరిన కుబేరుల సంఖ్య 

వారి మొత్తం సంపద రెట్టింపై రూ.53.16 లక్షల కోట్లకు చేరిక 

దేశ సంపదలో 45 శాతం 10 శాతం మంది సంపన్నుల వద్దే..

టాప్‌-98 శ్రీమంతుల నెట్‌వర్త్‌ 55.5 కోట్ల పేదల సంపదతో సమానం

కొవిడ్‌ దెబ్బకు 84ు కుటుంబాల ఆదాయంలో గణనీయ తగ్గుదల 

2020లో 4.6 కోట్ల మంది పేదరికంలోకి.. 

ఆక్స్‌ఫామ్‌ ఇండియా తాజా రిపోర్టు వెల్లడి 


న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో దేశంలో ఆర్థిక అసమానతలు మరింత పెరిగాయని ఆక్స్‌ఫామ్‌ ఇండియా తాజా నివేదిక హెచ్చరించింది. ఈ కష్టకాలంలోనూ ధనవంతులు మరింత సిరిమంతులుగా మారగా.. సగటు జీవి మాత్రం ఆదాయం కోల్పోయి అగచాట్లు పడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాదిలో భారత బిలియనీర్ల సంఖ్య 102 నుంచి 142కు చేరుకుందని (39 శాతం పెరుగుదల) రిపోర్టు వెల్లడించింది. అదే సమయంలో 84 శాతం కుటుంబాల ఆదాయం గణనీయంగా తగ్గిందని తెలిపింది. ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్‌) తొలి రోజు సమావేశాల్లో భాగంగా ‘ఇనీక్వాలిటీ కిల్స్‌’ పేరుతో ఆక్స్‌ఫామ్‌ విడుదల చేసిన నివేదికలోని మరిన్ని విషయాలు.. 


గత ఏడాది దేశంలోని టాప్‌-100 శ్రీమంతుల మొత్తం సంపద ఒకదశలో రికార్డు గరిష్ఠ స్థాయి రూ.57.3 లక్షల కోట్లకు పెరిగింది.


కరోనా సంక్షోభ కాలంలో (2020 మార్చినుంచి 2021 నవంబరు30 మధ్యకాలంలో) భారత బిలియనీర్ల మొత్తం సంపద రూ.23.14 లక్షలకోట్ల నుంచి రూ.53.16 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే రెట్టింపునకుపైగా పెరిగిందన్నమాట. 


2020లో 4.6 కోట్లకు పైగా భారతీయులు అత్యంత పేదరికంలోకి జారుకున్నట్లు అంచనా. ఐక్యరాజ్య సమితి ప్రకా రం.. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కొత్త పేదవారిలో దాదాపు సగానికి సమానమిది. 


 ప్రభుత్వ ఆర్థిక విధానాలు పేదలు, సగటు జీవుల కంటే శ్రీమంతులకే అనుకూలంగా ఉండటమే భారత్‌లో భారీ ఆర్థిక అసమానతలకు కారణం. 


కరోనా ఆరోగ్య సంక్షోభంగా మొదలై ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంగా మారింది. పది శాతం మంది కుబేరుల మొత్తం సంపద దేశ సంపదలో 45 శాతానికి సమానం. కాగా, సంపద పిరమిడ్‌లో దిగువ 50 శాతం మంది మొత్తం ఆస్తి కేవలం 6 శాతమే. 


మహిళపైనా తీవ్ర ప్రభావం 

కరోనా సంక్షోభకాలంలో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో 28 శాతం మహిళలేనని ఆక్స్‌ఫామ్‌ రిపోర్టు వెల్లడించింది.  వారి ఆదాయానికి మూడింట రెండొంతుల మేర గండిపడిందని పేర్కొంది. 2021 బడ్జెట్‌లో మహిళలు, శిశు సంక్షేమ శాఖకు కేటాయింపులు బిలియనీర్ల జాబితాలోని చివరి 10 మంది మొత్తం సంపదలోసగానికంటే తక్కువట. రూ.10 కోట్లకుపైగా ఆదాయం ఉన్న వ్యక్తులపై 2 శాతం పన్ను విధింపు ద్వారా ఈ మంత్రిత్వ శాఖ బడ్జెట్‌ను 121 శాతం  పెంచవచ్చని తెలిపింది. 


పర్యావరణ నష్టంతో నగరాల జీడీపీకి ముప్పు 

ప్రపంచ జీడీపీలో 80శాతం వాటా నగరాలదేనని డబ్ల్యూఈఎఫ్‌ నివేదిక పేర్కొంది. పారిశ్రామిక వాయు కాలుష్యంలోనూ నాలుగింట మూడొంతుల వాటా వీటిదేనని తెలిపింది. పర్యావరణ నష్టాల కారణంగా ప్రపంచ నగరాల జీడీపీ(31 లక్షల కోట్ల డాలర్లు)లో సగం వరకు కోల్పోయే ముప్పు పొంచి ఉందని రిపోర్టు హెచ్చరించింది.


ప్రపంచంలో 16 కోట్ల మంది పేదరికంలోకి.. 

ఆర్థిక అసమానతల కారణంగా 

  రోజుకు 21,000 మరణాలు 

ఈ రెండేళ్ల కరోనా సంక్షోభ కాలంలో ప్రపంచ జనాభాలో 99 శాతం మంది ఆదాయం తగ్గిందని, 16 కోట్ల మంది పేదరికంలోకి జారుకున్నారని ఆక్స్‌ఫామ్‌ రిపోర్టు వెల్లడించింది. ఆర్థిక అసమానతలు రోజుకు 21,000 మంది మరణాలు లేదా ప్రతి 4 సెకండ్లకు ఒకరి మరణానికి కారణమవుతోందని నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో ప్రపంచంలోని టాప్‌-10 కుబేరుల సంపద మాత్రం రెట్టింపునకు పైగా పెరిగి 1.5 లక్షల కోట్ల డాలర్లకు (రూ.111 లక్షల కోట్ల పైమాటే) చేరుకుందని రిపోర్టు తెలిపింది. అంటే, వారి సంపద రోజుకు 130 కోట్ల డాలర్లు (రూ.9,000 కోట్లు) లేదా సెకనుకు 15,000 డాలర్ల చొప్పున పెరిగిందట. ఈ సంక్షోభ సమయంలో రోజుకొకరు బిలియనీర్‌గా మారారట. ప్రపంచ టాప్‌ టెన్‌ కుబేరులు రేపటి రోజున ఉన్న ఫలంగా 99.999 శాతం ఆస్తి కోల్పోయినా, భూమ్మీద ఉన్న 99 శాతం జనాభా కన్నా ధనికులుగానే ఉంటారు. అంతేకాదు, ప్రపంచంలోని 310 కోట్ల మంది అత్యంత పేదల సంపద కంటే వారి మొత్తం ఆస్తి ఆరు రెట్లని రిపోర్టు వెల్లడించింది. 


టాప్‌-10 కుబేరుల సంపదతో పాతికేళ్లపాటు దేశంలోని పిల్లలందరికీ విద్య 

భారత్‌లోని టాప్‌-10 శ్రీమంతుల మొత్తం సంపదతో 25 ఏళ్ల పాటు దేశంలోని పిల్లలందరి ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసానికి ఫండింగ్‌ చేయవచ్చని ఆక్స్‌ఫామ్‌ రిపోర్టు వెల్లడించింది. దేశంలోని 10 శాతం సంపన్నులపై ఒక శాతం  పన్ను విధించడం ద్వారా ఈ కొవిడ్‌ కాలంలో దాదాపు 17.7 లక్షల అదనపు ఆక్సిజన్‌ సిలిండర్లను సమకూర్చుకోవచ్చని రిపోర్టు పేర్కొంది. అలాగే, దేశంలోని 98 సంపన్న కుటుంబాలపై ఒక శాతం పన్ను వసూలు చేయడం ద్వారా ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమానికి అవసరమైన నిధులు సమకూరుతాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం. కరోనా రెండో దశ వ్యాప్తి సమయంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. అంతేకాదు, కొవిడ్‌ బారినపడి లక్షలాది మరణించారని రిపోర్టు పేర్కొంది. 


మరిన్ని ఆసక్తికర విషయాలు.. 

దేశంలోని టాప్‌-98 శ్రీమంతుల మొత్తం ఆస్తి.. అట్టడుగు 40 శాతమైన 55.5 కోట్ల పేదల మొత్తం సంపద (రూ.49 లక్షల కోట్లు)తో సమానం. 

టాప్‌-10 కుబేరులు రోజుకు 10 లక్షల డాలర్లు (దాదాపు రూ.7.5 కోట్లు) ఖర్చు చేసినా వారి సంపద మొత్తం తరిగిపోయేందుకు 84 ఏళ్లు పడుతుంది. 

మల్టీ మిలియనీర్లు, బిలియనీర్లపై వార్షిక సంపద పన్ను విధిస్తే, ఏటా 7,830 కోట్ల డాలర్ల (దాదాపు రూ.5,87,250 కోట్లు) అదనపు ఆదాయం సమకూరుతుంది. తద్వారా ఆరోగ్యం కేసం కేంద్రం కేటాయించే బడ్జెట్‌ను 271 శాతం పెంచవచ్చు. లేదా దేశీయ కుటుంబాల ఆరోగ్య ఖర్చులు పోను 3,050 కోట్ల డాలర్లు మిగులుతాయి. 

దేశంలోని టాప్‌-100 బిలియనీర్ల సంపదతో జాతీయ గ్రామీణ ఉపాధి మిషన్‌  పథకానికి వచ్చే 365 ఏళ్లపాటు ఫండింగ్‌ చేయవచ్చు. 

టాప్‌-98 ధనిక కుటుంబాలపై 4 శాతం సంపద పన్ను విధించడం ద్వారా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు రెండేళ్లకు పైగా నిధులు సమకూర్చవచ్చు. ఆ 98 కుటుంబాల మొత్తం సంపద భారత బడ్జెట్‌ కంటే 41 శాతం అధికం. ఈ కుటుంబాల సంపదపై ఒక శాతం పన్ను విధించినా ప్రాథమిక విద్యాభ్యాసం, అక్షరాస్యత కార్యక్రమాలకు ఏటా అవసరమైన నిధులు సమకూరుతాయి. 4శాతం పన్ను విధిస్తే 17 ఏళ్లపాటు దేశవ్యాప్తంగా మధ్యా హ్న భోజన పథకానికి నిధులు పోగవుతాయి. లేదా సమగ్ర శిక్షా అభియాన్‌ పథకానికి ఆరేళ్లు ఫండింగ్‌ చేయవచ్చు. వారి సంపదపై 4 శాతం పన్ను విధించడం ద్వారా పోషణ్‌ 2.0 మిషన్‌కు పదేళ్లపాటు ఫండింగ్‌ చేయవచ్చు. 

Updated Date - 2022-01-18T10:23:36+05:30 IST