అర్థశాస్త్రం

ABN , First Publish Date - 2020-06-19T05:30:00+05:30 IST

కాలక్రమంలో భాషలో వచ్చే అర్థాల మార్పును అధ్యయనం చేయడానికి భాషాశాస్త్రంలో ప్రత్యేకమైన విభాగమే ఉన్నది. ఒక్కోసారి ఒక మాటకు ఉండే అర్థం కాలక్రమంలో పూర్తి వ్యతిరేకార్థానికి మారిపోవచ్చును.

అర్థశాస్త్రం

కాలక్రమంలో భాషలో వచ్చే అర్థాల మార్పును అధ్యయనం చేయడానికి భాషాశాస్త్రంలో ప్రత్యేకమైన విభాగమే ఉన్నది. ఒక్కోసారి ఒక మాటకు ఉండే అర్థం కాలక్రమంలో పూర్తి వ్యతిరేకార్థానికి మారిపోవచ్చును. ఒకప్పుడు ‘కంపు’ అంటే వాసన అనే అర్థం. కానీ రాను రాను ఆమాట చెడు వాసనకే పరిమితమైంది. ఒకప్పుడు చీర అన్నది స్త్రీపురుషులెవరైనా కట్టుకునే వస్త్రం. ఇప్పుడది ఆడవాళ్ల వస్త్రవిశేషం మాత్రమే. ఇటువంటి మాటలకు అర్థాలు మారడానికి శతాబ్దాలు సహస్రాబ్దాలు పట్టి ఉండవచ్చు. సమాజంలో ఏ ఏ మార్పులు జరిగి అటువంటి అర్థ విపరిణామాలు, అర్థ వ్యాకోచసంకోచాలు జరిగాయో నిర్దిష్టంగా చెప్పలేము. కానీ, వర్తమానంలో మాత్రం పదాలు, వాటి అర్థాలు త్వరితంగానే, విపరీతార్థాలకు మారిపోతున్నాయి. లేదా, పైకి ఒక అర్థం ప్రకటిస్తూ, అంతరార్థంలో భిన్నమైనదేదో ధ్వనిస్తున్నాయి. రాజకీయాల నడవడిలోని పలుకుబడి తెలిస్తే తప్ప, ఆ శ్లేషలను గుర్తించలేము. సత్యం అన్న శీర్షిక కింద అబద్ధాల చిట్టా రాసినా తెలుసుకోలేము. 


మన దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలైన కొద్దిరోజులకే ఉపగ్రహ టీవీ, స్వతంత్ర ప్రసార కేంద్రాలు మొదలయ్యాయి. ఎల్లలు లేని ప్రపంచం అనుకున్నారేమో, సంగీతం, వేషభాషలు, భావుకత, వ్యక్తీకరణ అన్నీ కొత్త దనాన్ని ప్రదర్శించసాగాయి. అప్పుడు ‘మేడిన్‌ ఇండియా’ అనే ప్రైవేట్‌ దృశ్య గీతం సమాజాన్ని ఉర్రూతలూపింది. కొంత ఇంద్రజాలం, కొంత భావుకత కలగలసి ఉన్న ఆ పాట, ఒక రకంగా ఒక స్వదేశీ ఆదర్శానికి పట్టబోతున్న దుర్గతికి పరిహారంగా, క్షమాపణగా అసంకల్పితంగా వ్యక్తమయిన సృజన. ఈ మధ్య కాలంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఆవిష్కరించిన ‘మేకిన్‌ ఇండియా’ లక్ష్యం, మరచిపోయిన మేడిన్‌ ఇండియాకు పౌండ్రక రూపం. అంటే విన్నవారికి అది మేడిన్‌ ఇండియా అన్నంత పవిత్రంగా అనిపిస్తుంది కానీ, అది కాదన్నమాట.


ఆ మాత్రపు ద్వితీయ శ్రేణి ఆదర్శానికి కావలసిన చిత్తశుద్ధి కూడా లేకపోయింది. మేకిన్‌ ఇండియాకు ప్రేరణ ఇవాళ శత్రుస్థానంలో ఉన్న చైనానే. ఆ దేశం పురోగతికి మొత్తంగా తయారీరంగం ఒక్కటే కారణమని, చవుక శ్రమశక్తిని,  తయారీరంగ అవకాశాలను అందిపుచ్చుకుని ఎదిగిపోయిందని నిర్ధారించుకుని, దాని బాటలో నడవాలన్న ప్రయత్నం చేశాము. కానీ, ఫలితమేమీ లేకపోయింది. కరోనా ఉపద్రవం కారణంగా, చైనా నుంచి తయారీ సంస్థలు తరలిపోతే, ప్రమాదాలను అవకాశాలుగా మలచుకోవచ్చును అని ఆశించాము. అదీ పెద్దగా జరిగేటట్టు లేదు. ఇది మనల్ని మనం విమర్శించుకోవడమో, హేళన చేసుకోవడమో కాదు. ఒక లక్ష్యాన్ని, ఆదర్శాన్ని దాని సంపూర్ణ అర్థంలో తీసుకోవడం మనకు చేత కావడం లేదు, ఒక విలువగా భావించడం రావడం లేదు. 


‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ అన్నాము. కరోనా కట్టడి కాలంలో ప్రపంచమంతటా రాకపోకలు, వ్యాపారాలు, రవాణాలు ఆగిపోయిన నేపథ్యంలో మనం తప్పనిసరిగా స్వావలంబన అలవరచుకోవలసిన స్థితికి వచ్చాము. ఇదే మంచి తరుణము– అని ప్రధాని చెప్పారు. ప్రపంచం ఇంతగా లోలోపల పెనవేసుకుపోవడం వల్ల ఎంతటి ప్రమాదాలకు ఆస్కారం ఉన్నదో కరోనా కాలం చెప్పింది. అకస్మాత్తుగా, జీవితం స్తంభించవలసి వస్తే, ఎక్కడికక్కడ, ఎవరికి వారు మనుగడ సాగించాలంటే, ఎవరి కాళ్ల మీద వారు నిలబడాలి. దీన్ని ఒక సత్యంగా కరోనా బోధించింది. కానీ, ఈ దిగ్బంధపు గత్తర కాలం ఒక స్వావలంబన ఆదర్శాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి తగిన తరుణమేనా? తీసుకువెళ్లినా, మహా అయితే ఏమి చేయగలం? ప్రధానమంత్రి చెప్పినట్టు ‘‘ఎన్‌–95 మాస్కులు, పిపిఇ కిట్లు, వెంటిలేటర్లను వ్యాధి వ్యాప్తి మొదలైన నెలల తరువాత’’  తయారు చేయగలుగుతున్నాము. మొదటి దశ అంతా వాటి కోసం కూడా దిగుమతులనే ఆశ్రయించాము కదా? ఐదేళ్ల తరువాత ‘మేకిన్‌ ఇండియా’ ముందుకు వెళ్లింది ఇంతేనా? 


అసలు నాయకుల మనసులో ఉన్న ఆత్మనిర్భరత అర్థం ఏమిటి? ‘‘ఇంధన రంగంలో భారత స్వావలంబనకు బొగ్గు సంస్కరణలు ఉపయోగపడతాయి. ఇకపై బొగ్గు రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం ఉంటుంది’’– అంటున్నారు నరేంద్రమోదీ. బొగ్గు బ్లాకులను వేలం వేయడం సరే, అందులో పూర్తి విదేశీపెట్టుబడులకు ఆస్కారం ఉన్నతరువాత, ఇక స్వావలంబన ఏమిటి? నిర్భరత అన్న మాటను ఏ అర్థంలో వాడుతున్నారసలు? ప్రభుత్వ సంస్థలను, ఆస్తులను అమ్మేయడం, ఆహారధాన్యాల రవాణాను నిర్నిబంధం చేయడం– వంటి వివాదాస్పద, తీవ్రసంస్కరణలను కరోనా వ్యతిరేక ఆర్థిక ప్యాకేజిలో భాగంగానే కాక, ఆత్మనిర్భరత శీర్షిక కింద పేర్కొనడం మాత్రం అర్థపరిణామశాస్త్రానికి అర్థం కాని వైచిత్రి. 


ఇప్పుడు ఈ నిర్భరత నినాదానికి అనుగుణంగానే చైనా వస్తువుల నిషేధం గురించి మాట్లాడుతున్నారు. వివరాలలోకి వెళ్లిన కొద్దీ భారతదేశంలోని ఉత్పాదక, సరఫరా చట్రాలలో చైనా దిగుమతులు ఎంతగా పాతుకుపోయాయో తెలుస్తోంది. స్వదేశీ ప్రత్యామ్నాయాలు ఉన్న వస్తువులలో విదేశీతయారీలను ప్రోత్సహించకపోవడం ప్రభుత్వ స్థాయిలో, ప్రజల స్థాయిలో కూడా జరగాలి. అది కేవలం చైనాకే పరిమితమైన వైఖరి కాగూడదు. చైనా మంచిచెడ్డలు ఎట్లా ఉన్నా, అది ఇంకా సామ్రాజ్యవాద శక్తీ, ఆర్థిక అగ్రరాజ్యమూ కాలేదు. భారతదేశంలో కూడా చైనా కంపెనీల ఉత్పత్తులు తయారవుతున్నాయి. అమెరికా కంపెనీల ఉత్పత్తులు చైనా భూభాగంలో జరుగుతాయి. కొన్ని చైనా, వియత్నాం, కొరియా– ఇట్లా అనేక దేశాలలో తయారీ ప్రక్రియలోని వివిధ దశలను పూర్తిచేసుకుంటాయి. ఈ సంక్లిష్టతలో స్వదేశీని యాంత్రికంగా అన్వేషించడం వృథా. 


భారతదేశ ప్రజాప్రయోజనాలే భారతదేశానికి ముఖ్యం– అన్న వైఖరి ఉంటే, అందుకు అనుగుణమైన విధానాలను రూపొందించుకోవచ్చు. అసలు వైఖరులు ప్రచ్ఛన్నంగా పనిచేస్తూ ఉంటే, నినాదాల మాటలకు వాటి వాస్తవ అర్థాలకు చేతలకు పొంతన కుదరదు.

Updated Date - 2020-06-19T05:30:00+05:30 IST