Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 8 2021 @ 02:13AM

బహిష్కరణ వెనుక కేటీఆర్‌కు ‘ఈడీ నోటీసులు’!

వాయిదా వేసినందుకే టీఆర్‌ఎస్‌ ఎంపీల నిష్క్రమణ

 వేల కోట్ల భూ కుంభకోణంలో కేటీఆర్‌ ప్రమేయం

విచారణ తప్పించుకోవడానికి బీజేపీతో ఒప్పందం

ప్రధాని మోదీ ఆదేశించారు.. సీఎం కేసీఆర్‌ పాటించారు

ఈడీ కేసుపై సమగ్రంగా దర్యాప్తు చేయాలి: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

  టీఆర్‌ఎస్‌ ఎంపీల బహిష్కరణకు కారణమిదే

  3 వేల కోట్ల భూ స్కాంలో కేటీఆర్‌ ప్రమేయం


న్యూఢిల్లీ, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటును బహిష్కరించడం వెనుక బీజేపీతో ఆ పార్టీకి రహస్య ఒప్పందం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. ఒక భూ కుంభకోణంలో మంత్రి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయడాన్ని ఈడీ తాత్కాలికంగా వాయిదా వేసిందని, ఇందుకు బదులుగా.. పార్లమెంటు సజావుగా సాగేలా కేంద్రానికి సహకరించడానికి టీఆర్‌ఎస్‌ ఎంపీలు సమావేశాలను బహిష్కరించారని ఆరోపించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌ శివారులో దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన భూ లావాదేవీల్లో సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల రియల్‌ ఎస్టేట్‌ సంస్థను, ఇరిగేషన్‌ కాంట్రాక్టులు చేస్తున్న మరో సంస్థను విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. ఈ భూములను గతంలో హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో వేలం వేసినప్పుడు విదేశాలకు చెందిన ఓ సంస్థ రూ.450 కోట్లకు కొనుగోలు చేసిందన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆ సంస్థను బెదిరించి ఆ భూములను దాదాపు రూ.300 కోట్లకు రాయించుకుందని ఆరోపించారు.


ఆ భూముల విలువ ప్రస్తుతం రూ.3 వేల కోట్ల మేర ఉంటుందన్నారు. టెండర్ల నియమ నిబంధనల ప్రకారం భూములను ఇతర సంస్థలకు బదిలీ చేయడానికి వీల్లేదని, అయినా బదిలీకి మంత్రి కేటీఆర్‌ అనుమతించారని తెలిపారు. ఈ మొత్తం కుంభకోణానికి కేటీఆరే కారణమని ఈడీ తేల్చిందని చెప్పారు. 


ధాన్యాన్ని అడ్డం పెట్టుకొని నాటకం..

కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చే క్రమంలో బీజేపీకి, టీఆర్‌ఎ్‌సకు కొంత అంతరం ఏర్పడిందని, దాంతో ధాన్యం కొనుగోలును అడ్డం పెట్టుకొని ఈడీ నోటీసులు, విచారణ నుంచి తప్పించుకోవడానికి పార్లమెంటు వేదికగా రెండు పార్టీలు నాటకమాడాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వాటి మధ్య రహస్య ఒప్పందంలో భాగంగానే కేటీఆర్‌కు నోటీసులివ్వడాన్ని ఈడీ తాత్కాలికంగా ఆపేసిందని చెప్పారు. దాంతో పార్లమెంటులో ఆందోళనలు విరమించి హైదరాబాద్‌కు రావాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలకు సీఎం కేసీఆర్‌ సూచించారని తెలిపారు. అంతేకాకుండా, ఈడీ కేసులను పీఎల్‌ఎంఏ చట్టం కింద కాకుండా ఫెమా చట్టం కిందికి మార్చుకుంటున్నారని ఆరోపించారు. ఈడీ కేసుపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని, కేటీఆర్‌ను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా కాపాడే ప్రయత్నం చేస్తున్నందునే పార్లమెంటు నుంచి ఆ పార్టీ ఎంపీలు వెనక్కి వెళ్లారని అన్నారు. ‘‘పార్లమెంటులో నిరసనలు విరమించుకోవాలని ప్రధాని మోదీ ఆదేశించారు.. సీఎం కేసీఆర్‌ పాటించారు’’ అని రేవంత్‌ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ ఎంపీల డ్రామా ముగిసిందని, మంగళవారం హైదరాబాద్‌కు వచ్చేస్తారంటూ రేవంత్‌ సోమవారమే చెప్పిన విషయం తెలిసిందే.

 

రైతుల సమస్య తీరిందా?

అంతర్గతంగా మోదీ, కేసీఆర్‌ అవగాహనకు వచ్చారని, అందుకే నవంబరులో ఢిల్లీ వచ్చి వెనక్కి వెళ్లిన కేసీఆర్‌ ఎక్కడ కూడా రైతు సమస్యలపై కార్యాచరణ ప్రకటించలేదని రేవంత్‌రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో అగ్గిపుట్టిస్తానన్న సీఎం కేసీఆర్‌ ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర రైతులు ఎదుర్కొంటున్న సమస్య తీరిందా? యాసంగిలో ఎంత కొనుగోలు చేస్తుందో పార్లమెంటులో కేంద్రం ప్రకటన చేసిందా? అని నిలదీశారు. కేంద్రం ఏ మాత్రం స్పష్టత ఇవ్వలేదని, సమస్య మరింత తీవ్రమయిందని తెలిపారు. రైతులు మరణిస్తున్నారని, పంట కొనుగోలు చేయకపోవడంతో దుఃఖంతో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటును బహిష్కరించి ఎందుకు వెనక్కి వెళ్లారని ప్రశ్నించారు. 

Advertisement
Advertisement