అశనిపాతం

ABN , First Publish Date - 2020-08-01T05:36:21+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటు బిల్లుకు గవర్నర్‌ ఆమోదముద్ర పడింది. దానితో పాటు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సిఆర్‌డిఎ)ను రద్దు చేసే బిల్లుపై కూడా గవర్నర్....

అశనిపాతం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటు బిల్లుకు గవర్నర్‌ ఆమోదముద్ర పడింది. దానితో పాటు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సిఆర్‌డిఎ)ను రద్దు చేసే బిల్లుపై కూడా గవర్నర్‌ సంతకం చేశారు. దాదాపు నెలన్నర ఉత్కంఠ తరువాత జరిగిన ఈ పరిణామం, ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని కోరుకుంటున్న వారందరినీ తీవ్ర కలవరానికి లోను చేసింది. అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన ఆ ప్రాంత రైతులకు గవర్నర్‌ నిర్ణయం పిడుగుపాటు వలెతాకింది. బిల్లులు విచారణలో ఉన్నందున, న్యాయస్థానం తీర్పు ఒక్కటే తమకు మిగిలిన ఆశ అని ఉద్యమకారులు, అమరావతివాదులు చెబుతున్నారు.


వై.ఎస్‌. జగన్మోహనరెడ్డి నాయకత్వంలో వైసిపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి, అమరావతిపై తన విముఖతను ఏదో రకంగా ప్రదర్శిస్తూనే ఉన్నది. ప్రజావేదికను కూల్చినప్పుడే, రాష్ట్రప్రభుత్వానికి నిర్మాణాత్మక దృష్టి లేదని అర్థమైపోయింది. కర్నూలులో న్యాయరాజధాని, అమరావతిలో లెజిస్లేటివ్‌ రాజధాని, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్‌ రాజధాని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ప్రభుత్వం చెప్పినప్పుడు, ప్రతిపక్షాలు మొదట కొంత తొట్రుపాటు ప్రదర్శించాయి. ఆ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తే, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఎట్లా స్పందిస్తాయో తెలియని స్థితి. అభివృద్ధిని, అధికారాన్ని వికేంద్రీకరించాలి కానీ, రాజధానిని కాదని వాదించే గొంతులు బలపడ్డాయి. న్యాయరాజధాని ఇవ్వడం వల్ల రాయలసీమకు ఒరిగేది ఏమీ లేదని అక్కడి నాయకులే పెదవి విరిచారు. ఇక, పాలనారాజధానిగా విశాఖను ప్రకటించడంపై అక్కడి ప్రజలు పెద్దగా ఉత్సాహాన్ని చూపలేదు. నిలకడగా అభివృద్ధి గమనంలో ఉన్న ఆ నగరం ప్రశాంతజీవనానికి కూడా ప్రసిద్ధి. కొత్త పరిణామం, తమ పట్టణాన్ని ఎటు తీసుకువెడుతుందోనన్న భయాందోళనలు అక్కడి పౌరుల్లో ఏర్పడ్డాయి. రాజధాని మూడు ముక్కలు కావడం వల్ల, ప్రత్యక్షంగా బాధితులు అయిన అమరావతి రైతులు ఉద్యమించారు. రెండువందల రోజుల పాటు ఉద్యమశిబిరాన్ని నిర్వహించారు. ఉద్యమక్రమంలో, ఆశాభంగంతో, వేదనతో అనేకమంది రైతులు ప్రాణాలు కోల్పోయారు కూడా.


ఈ బిల్లులు రాజ్యాంగబద్ధం కావని ప్రతిపక్షాల వాదన. గత ప్రభుత్వ హయాంలో జరిగిన రాజధాని ప్రాంత ఏర్పాటు ప్రక్రియ, స్థానిక రైతులతో ఒప్పందం– ఇవన్నీ కొత్త మార్పుల కారణంగా భంగపడుతున్నాయని, వాగ్దానభంగానికి గాను న్యాయపర్యవసానాలను ఎదుర్కొనవలసి ఉంటుందన్నది ఒక అంశం కాగా, శాసనమండలి సెలక్ట్‌ కమిటీకి నివేదించి ఉండగా, రెండు సార్లు అసెంబ్లీ ఆమోదంతో ముందుకు వెళ్లడం చెల్లదన్నది మరో అభిప్రాయం. న్యాయస్థానాలు ఎటువంటి వైఖరి తీసుకుంటాయో నిరీక్షించవలసి ఉన్నది. రాజధాని మార్పు పరిపాలనా నిర్ణయమా కాదా, ఈ బిల్లులు సాంకేతికంగా చెల్లుతాయా లేదా అన్నది పక్కనబెడితే, అమరావతి రైతులకు జరిగిన నష్టాన్ని పూడ్చడం న్యాయవ్యవస్థ బాధ్యత. 


రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ విషయంలో రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించలేదని నిరూపణ జరిగి, తప్పు దిద్దుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. రాజధాని విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరించిందా లేదా, రాజ్యాంగ బద్ధంగా నిర్ణయం తీసుకున్నదా లేదా– అన్నదాన్ని న్యాయప్రక్రియకు వదిలివేస్తే, నైతికంగా మాత్రం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దోషియే. ఎందుకంటే, అమరావతిని రాజధానిగా నిర్ణయించిన క్రమంలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌ కూడా భాగస్వామి. మనస్ఫూర్తిగా ఆ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్టు ఆయన నిండుసభలో ప్రకటించారు. తరువాత, భూసమీకరణ వంటి అంశాలలో అభిప్రాయభేదాలున్నప్పటికీ, మొత్తం మీద రాజధాని ఏర్పాటు ప్రక్రియలో జగన్‌, ఆయన పార్టీ తీవ్ర వ్యతిరేకత చూపింది లేదు. పోనీ, గత ఎన్నికల సందర్భంగా, రాజధానిని మార్చాలనుకుంటున్నట్టు చెప్పడం కానీ, మేనిఫెస్టోలో చేర్చడం కానీ జరగలేదు. మొదట అమరావతిని సమర్థించడానికి కారణం, తనకు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల్లో ఉన్న మద్దతు దెబ్బతింటుందేమోనని. మరి రాజధానిని వికేంద్రీకరించాలనుకున్నప్పుడు రాయలసీమకు పెద్దపీట వేయవచ్చును కదా, సీమ నాయకుడిగా గుర్తింపు పొందడం ఆయనకు ఇష్టం లేదు కాబట్టి, విశాఖకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో రాయలసీమకు ఒరిగింది ఏముంది? 1956లో విశాలాంధ్ర ఏర్పడినప్పుడు, రాజధానిని కోల్పోయింది రాయలసీమ. తిరిగి ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు న్యాయంగా సీమకే ఆ అవకాశం లభించాలన్న వాదన వినిపించింది. మరి జగన్‌ ఆ వాదనను ఎందుకు తలకెత్తుకోలేదు, ఇప్పుడయినా, విశాఖ బదులుగా కర్నూలును ఎందుకు పాలనా రాజధానిగా ప్రతిపాదించలేదు? అమరావతి ప్రాజెక్టును భగ్నం చేయడమే లక్ష్యం కాబట్టి. ఈ విధ్వంసక ఆలోచనావిధానం రాష్ట్రానికి మున్ముందు మరింత చేటు చేస్తుంది. 


ఈ విషయమై భారతీయ జనతాపార్టీ వైఖరి విస్మయం కలిగిస్తోంది. గవర్నర్‌ నిర్ణయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆయన నిబంధనల ప్రకారం వెళ్లారు. న్యాయసలహాలు తీసుకున్నారు, సెలక్ట్‌ కమిటీ నియామకం ఎందుకు జరగలేదని అధికారులను వాకబు చేశారు. బహుశా, కేంద్రాన్ని కూడా సంప్రదించి ఉంటారు. భారతీయ జనతాపార్టీ మాత్రం అమరావతికి తమ మద్దతు అంటూ చెబుతూ వస్తున్నారు. శుక్రవారం నాడు గవర్నర్‌ సంతకం తరువాత కూడా అదే మాట చెబుతున్నారు. బిజెపి నేతలు గవర్నర్‌ను ప్రభావితం చేయాలని ఎవరూ కోరలేదు. కానీ, సాక్షాత్తూ ప్రధానమంత్రి విచ్చేసి, ప్రారంభించిన రాజధాని ప్రాజెక్టును ఇట్లా విచ్ఛిన్నం చేయడం మీద కేంద్రంలోని పెద్దలకు రాష్ట్ర బిజెపి నేతలు తగిన అవగాహన కలిగించి ఉండాలి. ఇప్పుడు కూడా అమరావతి వైపే తామున్నామని అనడం, భవిష్యత్తులో వచ్చే న్యాయనిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని అంటున్న మాటనా, లేక, రైతులకు పరిహారం లభింపజేయడం వరకు తాము కృషిచేస్తూ ఉంటామని చెప్పడమా? మొత్తానికి కేంద్రంలోని బిజెపి పెద్దలు, ఆంధ్రప్రదేశ్‌లోని అధికారప్రతిపక్షాలు రెంటితోనూ దాగుడుమూతలు ఆడడం కొనసాగిస్తున్నారని అర్థమవుతోంది. 


కక్షసాధింపులు మాత్రమే పరిపాలన కాదు. అభివృద్ధి అంటే వితరణలు, విదిలింపులు కావు. ఆలోచనల్లో నిర్మాణాత్మకత ఉంటే, వెనుకబడిన ప్రాంతాలకు పూర్తి న్యాయం చేయవచ్చు, సమన్యాయం ద్వారా సామాజిక అసంతృప్తులన్నిటిని మాయం చేయవచ్చును. దీన్ని గ్రహించకపోతే, తగిన పర్యవసానాలను భవిష్యత్తే ఖాయం చేస్తుంది.

Updated Date - 2020-08-01T05:36:21+05:30 IST