Abn logo
Sep 26 2021 @ 02:15AM

వీధినపడ్డ విద్యావంతులు

రాష్ట్రంలో వీధి వ్యాపారులుగా 60వేల మంది నిరుద్యోగులు

పట్టణ ప్రగతి-స్ట్రీట్‌ వెండర్స్‌ యాప్‌లో నమోదు

వీరిలో 50శాతం డిగ్రీ పూర్తిచేసినవారే.. 

పీజీ, వృత్తి విద్య చదినవారు, ప్రైవేటు టీచర్లూ 

యాప్‌లో మొత్తంగా 6లక్షఽలకు పైగా.. 

సగం పండ్లు, కూరగాయల షాపులే

16శాతం చేతివృత్తులు, వస్త్ర వ్యాపారాలు

రాష్ట్రంలో 25శాతం పెరిగిన స్ట్రీట్‌ వెండర్లు

‘పీఎం స్వనిధి’ ద్వారా రూ.10వేల రుణం

రాష్ట్రంలో 3.38 లక్షల మంది ఖాతాల్లో డబ్బు

క్యాష్‌లెస్‌ లావాదేవీలు జరిపితే లాభాలు


హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రోడ్లు, వీధుల వెంబడి వెళుతుంటే ఓ ప్రధాన మార్పును గమనించే ఉంటారు! పండ్లు, కూరగాయల షాపులు మునుపటి కన్నా పెరిగాయి. టిఫిన్‌ సెంటర్లు, పూలు, కొబ్బరికాయల బండ్లు, పానీపూరీ, మిర్చి బండ్ల వంటివీ విరివిరిగా కనిపిస్తున్నాయి. ఎందుకు? కరోనా మహమ్మారి, తదనంతర పరిణామాల వల్ల కొలువులు కోల్పోయినవారు, కొలువులు దొరకని విద్యావంతులు ఇలా బతుకుదెరువు కోసం వీధి వ్యాపారులు (స్ట్రీట్‌ వెండర్లు)గా మారారు. వీరి సంఖ్య ఎంత ఉంటుందో తెలుసా? ప్రభుత్వ విభాగాల లెక్కల ప్రకారమే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి కోల్పోయినవారు.. కొలువులు దొరకని ఉన్నతవిద్యావంతులు ఏకంగా 60వేల మంది వీధి వ్యాపారులుగా మారారు. వీరంతా కుటుంబాలను పోషించుకోలేక ఇలా ప్రత్యామ్నాయ ఉపాఽధిని ఎంచుకున్నారు. వీరిలో డిగ్రీ చదివినవారుసగం మంది ఉండగా, మిగతా సగం పీజీ, ఇతర టెక్నికల్‌ కోర్సులు పూర్తిచేసినవారు, ప్రైవేటు ఉపాధ్యాయులు ఉన్నారు. మొత్తంగా 2020లో కరోనా లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత రాష్ట్రంలో వీధి వ్యాపారుల సంఖ్య 25శాతం పెరిగిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 


ఈ లెక్క ఎలా తెలిసింది! 

‘పట్టణ ప్రగతి- సర్వే ఆఫ్‌ స్ట్రీట్‌ వెండర్స్‌’.. ఇది ఓ మొబైల్‌ యాప్‌! రాష్ట్ర పురపాలక శాఖ ఆధ్వర్యంలో అన్ని పట్టణాలు, మున్సిపాలిటీల పరిధిలో ఉన్న వీధి వ్యాపారుల ప్రత్యేక నమోదు కొరకు దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 6,02,578 మంది వీధి వ్యాపారులు నమోదయ్యారు. యాప్‌లో వీధి వ్యాపారుల ఫొటో, ఆధార్‌, వ్యాపార వివరాలను నమోదు చేస్తారు. అనంతరం ప్రత్యేక విభాగం ద్వారా స్ట్రీట్‌ వెండర్లుగా వారికి గుర్తింపు కార్డులను జారీచేస్తున్నారు. నమోదైన 6లక్షల పైచిలుకు స్ట్రీట్‌ వెండర్లలో 60వేల మంది ఉద్యోగ, ఉపాధి కోల్పోయిన వారు, ఉన్నత విద్యావంతులైన నిరుద్యోగులు ఉన్నట్లు తేలింది. నమోదైన స్ట్రీట్‌ వెండర్లలో సగం మంది పండ్లు, కూరగాయల వ్యాపారంలోనే ఉన్నారు. 

‘పీఎం స్వనిధి’ ద్వారా రుణం

కరోనాతో చతికిల పడ్డ వీధి వ్యాపారులకు చేయూతనిచ్చేందుకు పీఎం స్వనిధి పథకం ద్వారా కేంద్రం రూ.10వేలు రుణ సదుపాయం కల్పించింది. ఈ పథకం కోసం రాష్ట్రంలోని కనీసం 3.4 లక్షలమంది స్ట్రీట్‌ వెండర్లను గుర్తించాలని టార్గెట్‌ పెట్టారు. అయితే రాష్ట్రంలో మరింత ఎక్కువగా 3.57 లక్షల మందిని గుర్తించారు. వీరిలో 3.38 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. ఈ విధంగా కేంద్రం లక్ష్యాన్ని దాదాపు వంద శాతం పూర్తిచేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 


డిజిటల్‌ లావాదేవీలకు ప్రోత్సాహం

 వీధి వ్యాపారులకు క్యూఆర్‌ కోడ్‌ కేటాయించి వారు డిజిటల్‌ లావాదేవీలు జరుపుకొనేలా ప్రభుత్వ విభాగాలు ప్రోత్సహిస్తున్నాయి. క్యాష్‌లె్‌సగా నిర్వహించుకునేలా పురపాలక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు. ఫలితంగా రాష్ట్రంలోని వీధి వ్యాపారుల్లో 3.25 లక్షల మంది డిజిటల్‌ లావాదేవీలు కొనసాగిస్తున్నారు.. రూ.25 చొప్పున నెలకు 200 లావాదేవీలు చేస్తే కేంద్రం ద్వారా రూ.100 క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. అలా క్యాష్‌బ్యాక్‌ రూపంలో మన రాష్ట్రంలోని వీధి వ్యాపారులకు రూ.41,90,000 వచ్చింది. అదేవిధంగా సకాలంలో రుణాలు చెల్లించడం ద్వారా రాష్ట్రంలోని వీధి వ్యాపారులు కేంద్రం నుంచి 7శాతం ఇంట్రెస్ట్‌ సబ్సిడీ (రూ.3.24 కోట్లు) పొందడం విశేషం.