నిష్ణాతులున్నా.. నిర్లక్ష్యమేల?

ABN , First Publish Date - 2021-07-30T05:44:50+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారు.. ప్రతి సబ్జెక్టు ప్రశ్నపత్రాన్ని అత్యంత పకడ్బందీగా తయారుచేసే సత్తా మన ఉపాధ్యాయులకు ఉంది.

నిష్ణాతులున్నా..  నిర్లక్ష్యమేల?

 ప్రైవేటు పబ్లిషర్‌ నుంచి బేస్‌లైన్‌ ప్రశ్నపత్రాలు కొనుగోలు

ఒక్కో సబ్జెక్టు పశ్నపత్రం రూ.10 

టీచర్లకు ప్రశ్నపత్రం తయారు చేసే సత్తా ఉన్నా.. ఎందుకో ఉదాశీనత!  


గుంటూరు(విద్య), జూలై 29: ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారు.. ప్రతి సబ్జెక్టు ప్రశ్నపత్రాన్ని అత్యంత పకడ్బందీగా తయారుచేసే సత్తా మన ఉపాధ్యాయులకు ఉంది. అయినా.. ఓ పరీక్ష కోసం ప్రైవేటు పబ్లిషర్‌ నుంచి ప్రశ్నపత్రాలు కొనుక్కొనే దుస్థితికి   కొందరు ఉపాధ్యాయులు చేరారు. ఈ నెల 27వ తేదీ నుంచి విద్యార్థులకు బేస్‌లైన్‌ పరీక్ష ప్రారంభమైంది. నమూనా పత్రాలను డీసీఈబీ (డిస్ర్టిక్‌ కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు) ఇంటర్‌నెట్‌లో ఉంచింది. వీటిని డౌన్‌లోడ్‌ చేసుకుని దానికి అనుగుణంగా పత్రాలను రూపొందించి పరీక్షలు నిర్వహించాలని  ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ సూచించింది.

కానీ ఎక్కువమంది ఉపాధ్యాయులు సొంతగా ప్రశ్నపత్రం రూపొందించకుండానే పరీక్ష జరిపేందుకు సిద్ధమయ్యారు. దీనికోసం ప్రైవేటు పబ్లిషర్లు రూపొందించిన క్వశ్చన్‌ పేపర్లను ఆశ్రయించారు. తెనాలికి చెందిన ఓ ప్లబిషర్స్‌ సంస్థ వీటిని తయారు చేసి డీసీఈబీ కార్యాలయం బయట ఉంచి అమ్మకాలు జరిపారు. ఒక్కో సబ్జెక్టు ప్రశ్న పత్రాన్ని రూ.10 చెల్లించి ఉపాధ్యాయులు కొనుగోలు చేశారు. 

 జిల్లాలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు ఎంతోమంది సబ్జెక్టు టీచర్లు ఉన్నారు. రెండేళ్ల నుంచి కరోనా కారణంగా పాఠశాలలు సరిగ్గా జరగడం లేదు. ఒక్క పది విద్యార్థులకు తప్ప ఇతర తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన అందించాల్సిన అవసరం కూడా లేదు. అయినా ఉపాధ్యాయులు ప్రశ్న పత్రాలు తయారు చేసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యహరించారనే విమర్శలు వస్తున్నారు. జిల్లాలో దాదాపు అన్ని పాఠశాలల యాజమాన్యాలు తెనాలికి చెందిన ఓ ప్రైవేటు పబ్లిషర్‌ వద్ద బేస్‌లైన్‌ ప్రశ్న పత్రాలు కొనుగోలు చేశారు. వీటినే ప్రస్తుతం బేస్‌లైన్‌ పరీక్ష కోసం వినియోగిస్తున్నారు. ఇప్పటికైనా ఉపాధ్యాయులు సొంతగా ప్రశ్న పత్రాలు తయారు చేసుకునేలా విద్యశాఖ దిశానిర్ధేశం చేయాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2021-07-30T05:44:50+05:30 IST