Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్య కాషాయీకరణ తగదు

  1. ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ కార్యదర్శి దినేష్‌కుమార్‌
  2. కర్నూలులో 48వ రాష్ట్ర మహాసభలు ప్రారంభం


కర్నూలు(న్యూసిటీ), డిసెంబరు 3: బీజేపీ ప్రభుత్వం విద్యను కాషాయీకరణ చేస్తోందని, కేంద్రం విధానాల నుంచి విద్యను కాపాడుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య జాతీయ కార్యదర్శి దినేష్‌కుమార్‌ అన్నారు. నగరంలో ఏఐఎస్‌ఎఫ్‌ 48వ రాష్ట్ర మహాసభలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లా పరిషత్‌ నుంచి సీపీఐ కార్యాలయం వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభకు రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు అధ్యక్షత వహించగా జై భీం దర్శకుడు టీజే జ్ఞానవేలు, ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌, రాష్ట్ర కార్యదర్శి జి.రంగన్న, రాష్ట్ర మాజీ కార్యదర్శి కె.రామాంజనేయులు హాజరయ్యారు. వందేమాతరం శ్రీనివాస్‌ రాయలసీమ కరువుపై గీతాన్ని ఆలపించారు. దినేష్‌ మాట్లాడుతూ కేంద్రం జాతీయ నూతన విద్యా విధానం తీసుకువచ్చి కాషాయికరిస్తోందని విమర్శించారు. జాతీయ విద్యాసంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్‌ సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు మాట్లాడుతూ ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుండడంపై ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ నాయకులు ధర్నా చేస్తే అరెస్టులు చేయడం దారుణమన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నాడు ఉచిత విద్యను అందిస్తామని చెప్పి నేడు ఎయిడెడ్‌ విద్యా సంస్థలను, ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ మాజీ కార్యదర్శులు ఈశ్వరయ్య, లెనిన్‌బాబు, జాయింట్‌ సెక్రటరీలు వి.గంగాసురేష్‌, జాన్సన్‌బాబు, ఆహ్వాన సంఘం కోశాధికారి బి.గిడ్డయ్య, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ధనుంజయ, శ్రీరాములు, మురళి, నంద, దుర్గ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement