Abn logo
Sep 20 2021 @ 23:24PM

విద్యార్థులంతా యూనిఫాం ధరించాలి

పాఠశాలను పరిశీలిస్తున్న ఆర్జేడీ

ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి : ఆర్జేడీ మధుసూదన్‌


కొవ్వూరు, సెప్టెంబరు 20: కొన్ని చోట్ల పాఠశాలల్లో విద్యార్థులు షూ, యూనిఫాం ధరించకపోవడాన్ని గమనించామని విద్యా శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు (ఆర్జేడి) డి.మధుసూదన్‌ అన్నారు. పట్టణంలోని అల్లూరి నాగరత్నం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులంతా షూస్‌, యూనిఫాం ధరించి వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎంను హెచ్చరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్ధ్యం పెంచేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థుల సామర్ధ్యంలో కొంత వెనుకబాటు గుర్తించామని, విద్యార్థుల అభ్యసన సామర్ధ్యం గణనీయంగా పెంచాలని ఉపాధ్యాయులను ఆదేశించామన్నారు. జగనన్న విద్యా కానుక కిట్లు, పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందించకుండా స్టోర్‌ రూమ్‌లు, ఎంఈవో కార్యాలయాల్లో ఉంచితే హెచ్‌ఎం, ఎంఈవోలపై చర్యలు తప్పవన్నారు. నాడు నేడు పథకంలో కొవ్వూరు డివిజన్‌లో రూ.7 కోట్లతో 25 పాఠశాలలను అభివృద్ధి చేశామన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా లేదని, తక్షణం చర్యలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నా రు. కొవిడ్‌ దృష్ట్యా తరగతి గదికి 20 మంది విద్యార్థులను పరిమితం చేస్తూ, రోజు విడిచి రోజు బోధనకు చర్యలు చేపట్టామన్నారు. ఎంఈవో జె.కెంపురత్నం, హెచ్‌ఎం ఎంఎస్‌.శ్యామలారాణి, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.