జిల్లా అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2021-01-27T05:39:22+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ జిల్లా అభివృద్ధికి అంకిత భావం తో కృషి చేస్తున్నామని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పరేడ్‌ మైదానంలో నిర్వహించిన 72వ గణతంత్ర వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

జిల్లా అభివృద్ధికి కృషి
పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్‌

ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

తాగునీరు, రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

కరోనా నివారణలో వైద్య ఉద్యోగుల కీలక పాత్ర

గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

ఆదిలాబాద్‌టౌన్‌, జనవరి 26: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ జిల్లా అభివృద్ధికి అంకిత భావం తో కృషి చేస్తున్నామని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పరేడ్‌ మైదానంలో నిర్వహించిన 72వ గణతంత్ర వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా లోని ఆయా శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడు తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాబోయే రోజుల్లో ప్రజలకు అం దించే పథకాలను కలెక్టర్‌ వివరించారు. అంతకు ముందు ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జగన్మోహన్‌రావు, ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌, ఆయా శాఖల జిల్లా అధికారులతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొవిడ్‌-19 కారణంగా గతేడాది మార్చి నుంచి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కొవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తులకు ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు లక్షా 87వేల 85 మందిని కొవిడ్‌ అనుమానితులుగా గుర్తించి పరీక్షలు చేయగా 4,991 మందిని పాజిటివ్‌గా గుర్తించడం జరిగిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 30 కేంద్రాల్లో 2,794 మందికి కరోనా నివారణకు గాను వ్యాక్సిన్‌ మొదటి డోసు వేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు కొవిడ్‌ బారిన పడి 42 మంది మృతి చెందారని పేర్కొన్నారు.

పేదల సంక్షేమానికి కృషి..

జిల్లాలో వెనుకబడిన, పేద, బడుగు బలహీన వర్గాల ఆర్థికాభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.  ఇప్పటి వరకు 18వేల387 పేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లి ఖర్చులకు కల్యాణలక్ష్మి కింద రూ.153కోట్లు ఆర్థిక సాయం చేశామన్నారు. అదేవిధంగా 1693 నిరుపేద దళిత కుటుంబాలకు రూ.190కోట్లతో 4367 ఎకరాల వ్యవసాయ భూమిని అందించడం జరిగిందని, స్వయం ఉపాధి పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా 3633 మంది లబ్ధిదారులకు రూ.43.50 కోట్లు మంజూరు చేశా మన్నారు. వెనుకబడిన తరగతుల శాఖ ద్వారా కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఈ యేడాది 446 లక్షలు 7711 మంది విద్యార్థులకు మంజూరయ్యాయని తెలిపారు. గిరిజన సంక్షేమం ద్వారా జిల్లాలోని 647 మంది గిరిజనుల లబ్ధి దారులకు ఎడ్లబండ్లు, సూపర్‌మార్కెట్‌, గొర్రెలు, గేదెలు, కూరగా యల బండ్లు, టైలరింగ్‌, కిరాణా దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు సీసీడీపీ నిధులు మంజూరు చేశామన్నారు. 

మిషన్‌ భగీరథ నీరు..

మిషన్‌ భగీరథ పథకం ద్వారా ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా మంచినీటి సౌకర్యం కల్పి స్తుందన్నారు. అదే విధంగా రోడ్లు భవనాల శాఖ ద్వారా జిల్లాలో ఒక వరుస రహదారులను రెండు వరు సల రహదారులుగా చేపట్ట డం జరిగిందని, ఇందుకు 186 కి.మీల రహదారికి రూ.350కోట్లు, 6 వరుసల అభివృద్ధికి రూ.44 కోట్లతో పనులు జరుగుతున్నా యన్నారు. పంచాయతీరాజ్‌, ఇంజనీర్‌ ద్వారా ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌యోజన పథకం కింద రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. గృహ నిర్మాణం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 4195 ఇండ్లు మంజూరు కాగా 455 నిర్మాణాలు పూర్తిచేశామని, మిగతా అగ్రిమెంట్‌, నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. 

ఉపాధి హామీతో ప్రజలకు లబ్ధి..

ఉపాధి హామీ పథకం కింద ఈ యేడాది ఉపాధి కూలీల కు 76.7లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 48.24 లక్షల పని దినాలు 93 వేల 69 కుటుంబాలకు కల్పించడం జరిగిందన్నా రు. ఇందులో లక్షా 77 వేల 417 మంది కూలీలకు రూ.92.59 లక్షల రూపాయ లు కూలీ డబ్బులు చెల్లించడం జరిగిందన్నారు. హరితహారం కార్య క్రమంలో జిల్లాలో గత యేడాదిలో 47.99 లక్షల మొక్కలు నాటడం జరిగిందని, 2021 సవత్సరంలో గ్రామీణాభివృద్ధి, అటవీ, మున్సిపల్‌ శాఖల ద్వారా 71.81 లక్షల వివిధ రకాల మొక్కలు నర్సరీలలో పెంచడం జరుగుతుందన్నారు. మున్సిపల్‌ శాఖ ద్వారా ఆదిలాబాద్‌ పట్టణ ప్రజల కు అనేక సౌకర్యాలు కల్పిస్తునే అభివృద్ధి కార్యక్రమాలను వివిధ నిధుల కింద చేపడుతున్నామన్నారు. 1.90కోట్లతో డంపింగ్‌యార్డులు, 3.50 కోట్లతో వైకుంఠధామాలు, 5.89 కోట్లతో 9జంక్షన్లు, 4.60కోట్లతో సెంట్రల్‌ లైటింగ్‌, 56.85లక్షలతో వీధి వ్యాపారులకు షెడ్స్‌ నిర్మాణాలుచేపట్టడం జరుగుతుందన్నారు.  పోలీసు శాఖ ద్వారా ప్రజలకు అనేక విధాలుగా రక్షణ కల్పిస్తూ పోలీసు వారు అండగా ఉంటున్నారన్నారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తున్న మీడియా పాత్రను మరిచి పోలేమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేడుకలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జగన్మోహన్‌రావ్‌, జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, ఆదిలాబాద్‌, బోథ్‌ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపూరావు, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, డేవిడ్‌, ఆర్డీవో జాడే రాజేశ్వర్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T05:39:22+05:30 IST