సమన్వయంతో వ్యాధుల నిర్మూలనకు కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-06-23T05:19:04+05:30 IST

ఉమ్మడి జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఉన్న 31 ఏజెన్సీ పీహెచ్‌సీల పరిధిలో వైద్య సిబ్బంది సమన్వయంతో పని చేసి వ్యాధుల నిర్మూలనకు కృషి చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి భవేష్‌మిశ్రా అన్నారు.

సమన్వయంతో వ్యాధుల నిర్మూలనకు కృషి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో భవేష్‌మిశ్రా

ఉట్నూర్‌, జూన్‌ 22: ఉమ్మడి జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఉన్న 31 ఏజెన్సీ పీహెచ్‌సీల పరిధిలో వైద్య సిబ్బంది సమన్వయంతో పని చేసి వ్యాధుల నిర్మూలనకు కృషి చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి భవేష్‌మిశ్రా అన్నారు. మంగళవారం స్థానిక కుమ్రం భీం ప్రాంగణంలోని పీఎంఆర్సీ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాలోని వైద్యులు, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, సూపర్‌వైజర్‌లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. 31 పీహెచ్‌సీలలో అదనపు సౌకర్యాలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. వర్షాకాలంలో సంభవించే అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలన్నారు. అవసరమైన చోట గ్రామీణ నీటి పారుదల శాఖ, పంచాయతీ శాఖలతో సమన్వయం చేసుకొని పారిశుధ్య కార్యక్రమాలు, మంచినీటి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. కొత్తనీరు వచ్చిన వెంటనే బావుల్లో క్లోరినేషన్‌ చేయాలని, అదే విధంగా కలుషిత నీరు ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రజలకు క్లోరినేషన్‌ మాత్రలు అందించాలని సూచించారు. ఐటీడీఏ ద్వారా ఏజెన్సీలోని వైద్య సమస్యల పరిష్కారం కోసం తమ వంతుగా పూర్తి సహకారం అందిస్తామన్నారు. మెడికల్‌ ఆఫీసర్లు ఎమైన సమస్యలు ఉంటే వాట్సప్‌ ద్వారా తనకు సమాచారం అందించాలన్నారు. జిల్లాలోని ప్రజలందరికి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తి చేసిన తరువాత కోవిడ్‌ థర్డ్‌వేవ్‌తో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.  గ్రామీణ ప్రాంతాలలోని గిరిజనులు రక్త హీనతతో బాధపడితే వారిని ఉట్నూర్‌లోని పౌష్ఠిక ఆహార పునరావస కేంద్రానికి తరలించాలన్నారు. జూలై 1 నుంచి ప్రారంభించనున్న ర్యాపీడ్‌ ఫీవర్‌ సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని పీహెచ్‌సీలకు నాలుగు నెలల కోసం వాహనాలను కేటాయిస్తామని తెలిపారు. ఆశ వర్కర్లకు డెంగ్యూ, మలేరియా నివారణ కోసం కావాల్సిన కిట్‌లను అందిస్తామన్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో రాథోడ్‌ నరేందర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఏడు హైరిస్క్‌ మండలాలను గుర్తించామని వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి వ్యాధుల నిర్మూలన కోసం కృషి చేస్తామన్నారు. 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 10,259 మందికి రక్తపు పూతలు సేకరించామని, కేవలం కొద్ది మందికి మాత్రమే మలేరియా పాజిటివ్‌ వచ్చిందన్నారు. ఏడీఎంహెచ్‌వో కుడిమెత మనోహర్‌ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో గర్భిణుల మరణాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి వైద్య సిబ్బందిపై ఉందని అన్నారు.  జైనూర్‌, ఆసిఫాబాద్‌ ఆస్పత్రుల్లో రేడియోలోజిస్టులు అవసరం ఉందని ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకవచ్చారు. ఈ సమావేశంలో వైద్య సిబ్బంది తులసీదాస్‌, శ్రీనివాస్‌, గోకుల్‌, జైవంత్‌రావు, పవార్‌సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T05:19:04+05:30 IST