Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘గ్రంథాలయాల బలోపేతానికి కృషి’

కర్నూలు (కల్చరల్‌), నవంబరు 30: రాష్ట్రంలోని గ్రంథాలయాల బలోపేతానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ డైరెక్టర్‌ ఎంఆర్‌ ప్రసన్నకుమార్‌ తెలిపారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. గ్రంథాలయంలోని పుస్తక ప్రదర్శన శాల, దినపత్రికల పఠనశాల, విద్యార్థులు ఉపయోగించే డిజిటలైజేషన్‌ ల్యాబ్‌లను పరిశీలించారు.  పాఠకులతో మాట్లాడారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను, నూతనంగా చేపట్టిన అంశాలపై అధికారులతో చర్చించారు. కిందిస్థాయి  ఉద్యోగులను పిలిచి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాలను ఈ-గ్రంథాలయ పేరుతో డిజిటలైజేషన్‌ దిశగా తీర్చిదిద్దుతున్నామని, జిల్లాలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలోని 58 వేల పుస్తకాలను డిజిటలైజేషన్‌ చేశామని తెలిపారు. జిల్లాలో మరో 12 గ్రేడ్‌ గ్రంథాలయాలను కూడా ఇదే దిశగా మార్పు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అందుబాటులోని మరిన్ని పుస్తకాలను తీసుకువస్తామన్నారు. గ్రంథాలయాలకు సెస్‌ బకాయలను ఆయా గ్రంథాలయాలకు అందే దిశగా కృషి చేశానని, ఒక్క కర్నూలు జిల్లాలోనే రూ.3 కోట్లు వసూలైందని చెప్పారు. మరో రూ.11 కోట్లు దశలవారీగా జిల్లా గ్రంథాలయ సంస్థకు అందేలా జిల్లా అధికారులతో చర్చిస్తామని చెప్పారు. జిల్లాలో గ్రంథాలయాలకు పుస్తకాలను ఇచ్చే దాతలను ప్రోత్సహించాలని, వారితో చర్చించే దిశగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో గ్రంథాలయ సంస్థ కింద ఖాళీగా ఉన్న నాలుగు గ్రంథాలయాధికారుల పోస్టులను, ఎనిమిది అటెండరు పోస్టులను భర్తీకి మార్గదర్శకాలు డిసెంబరు 3న జారీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సి. శ్రీనివాసరెడ్డి, ఉప గ్రంథపాలకురాలు వి. సుబ్బరత్నమ్మ, గ్రంథాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement