గోతిలోకి గుడ్లు

ABN , First Publish Date - 2021-08-04T06:27:58+05:30 IST

పాఠశాల విద్యార్థులకు అందాల్సిన గుడ్లు పాడైపోయాయి. పాఠశాల ఆవరణలో గొయ్యి తీసి, ఏకంగా మూడు వేల గుడ్లను పూడ్చేశారు.

గోతిలోకి గుడ్లు
పాడైన కోడి గుడ్లను పూడుస్తున్న పాఠశాల సిబ్బంది

  1. విద్యార్థులకు ఇవ్వకుండా వృథా


పత్తికొండ, ఆగస్టు 3: పాఠశాల విద్యార్థులకు అందాల్సిన గుడ్లు పాడైపోయాయి. పాఠశాల ఆవరణలో గొయ్యి తీసి, ఏకంగా మూడు వేల గుడ్లను పూడ్చేశారు. పత్తికొండ మోడల్‌ స్కూల్‌లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కొవిడ్‌ కారణంగా పాఠశాలలను మూసివేశారు. దీంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో భాగంగా సరఫరా చేసిన గుడ్లను నేరుగా విద్యార్థులకు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. పత్తికొండ మోడల్‌ పాఠశాలకు జూన్‌, జూలై నెలల అవసరాలకు 9 వేల కోడి గుడ్లను ప్రభుత్వం సరఫరా చేసింది. ఇందులో 3 వేల గుడ్లను విద్యార్థులకు ఇవ్వలేకపోయారు. వాటన్నింటినీ తరగతి గదిలో నిల్వ చేశారు. ఆగస్టు నెలకు కొత్త స్టాక్‌ రావడంతో ప్రధానోపాధ్యాయుడు ఆ గదిని ఇన్నాళ్లకు తెరిచారు. దుర్వాసన వస్తుండటంతో పాత స్టాక్‌ చెడిపోయినట్లు గుర్తించారు. విద్యార్థులకు చేరాల్సిన గుడ్లను గోతిలో కప్పిపెట్టారు. పంపిణీలో నిర్లక్ష్యమే ఇందుకు కారణమన్న విమర్శలు వస్తున్నాయి.


విద్యార్థులు తీసుకెళ్లలేదు..

మా పాఠశాలలో 369 మంది విద్యార్థులు ఉన్నారు. జూన్‌, జూలైకి 9 వేల గుడ్లు అందాయి. 270 మంది విద్యార్థులు మాత్రమే గుడ్లు తీసుకెళ్లారు. 5,940 కోడిగుడ్లను మాత్రమే పంపిణీ చేయగలిగాం. మిగిలిన గుడ్లను ఎవరికి పంపాలన్న అంశంపై స్పష్టత లేదు. అందుకే పాఠశాలలోనే ఉంచేశాం. నిన్న కొత్త స్టాకు రావడంతో రూం తెరిచిచూస్తే వాసన వస్తోంది. విద్యార్థులకు పొరబాటుగా చెడిపోయిన గుడ్లను పంపిణీ చేయకూడదని పాడైన వాటిని పారవేశాం. 


 - చంద్రశేఖర్‌, ప్రిన్సిపాల్‌

Updated Date - 2021-08-04T06:27:58+05:30 IST