ఉపాధికి ఊతం

ABN , First Publish Date - 2021-12-07T04:10:38+05:30 IST

జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గత సంవత్సరం కొవిడ్‌ ఉధృతితో పనులు చేసేందుకు కూలీలు ముందుకురాలేదు. ప్రజల ప్రాణాలు కాపాడటంపైనే దృష్టిసారించిన అధికారులకు ఉపాధి పనుల గురించి ఆలోచించే పరిస్థితి లేకుండాపోయింది.

ఉపాధికి ఊతం
కొండాపూర్‌ మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు

గ్రామాల్లో ముమ్మరంగా ఈజీఎస్‌ పనులు

సంగారెడ్డి జిల్లాలో పనులు చేస్తున్న 1,69,204 మంది కూలీలు

2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ.620.87 కోట్ల అంచనాతో 18,659 పనుల మంజూరు

ఇప్పటివరకు రూ.484.83 కోట్ల విలువైన 16,866 పనులు పూర్తి

గతేడాది కొవిడ్‌తో నామమాత్రంగానే పనులు

రూ.42.62 లక్షల విలువైన 81 పనులు మాత్రమే నిర్వహణ


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, డిసెంబరు 6: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గత సంవత్సరం కొవిడ్‌ ఉధృతితో పనులు చేసేందుకు కూలీలు ముందుకురాలేదు. ప్రజల ప్రాణాలు కాపాడటంపైనే దృష్టిసారించిన అధికారులకు ఉపాధి పనుల గురించి ఆలోచించే పరిస్థితి లేకుండాపోయింది. ఈసారి కూడా కొవిడ్‌ రెండోదశ భయపెట్టినా బతుకుదెరువు కోసం పనిచేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకే కూలీలు ధైర్యంచేసి పనులకు వచ్చారు. క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఉపాధి పనులు జోరందుకున్నాయి. 2021–22 ఆర్థిక సంవత్సరం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు తొమ్మిది నెలల్లో 99,052 కుటుంబాలకు చెందిన 1,69,204 మంది కూలీలకు పనులు కల్పించారు. వీరిలో 7,206 మంది వంద పని దినాలను పూర్తిచేశారు. రూ.620.87 కోట్ల అంచనాలతో 18,659 పనులను జిల్లా యంత్రాంగం మంజూరు చేయగా.. ఇప్పటివరకు రూ.484.83 కోట్ల విలువైన 16,866 పనులను పూర్తిచేశారు. 


కాల్వలు, చెరువులు బలోపేతం

ఈ ఏడాది ఉపాధిహామీ పథకంలో భాగంగా గ్రామాల్లో మట్టి రోడ్లు వేయడం, కందకాలు తవ్వడం, పంట పొలాలకు నీటి మళ్లింపు కాల్వల పునరుద్ధరణ, కాల్వలకు ఇరువైపులా రాతి కట్టడాలు, చెరువులు, కుంటలు, చెక్‌డ్యాముల్లో పూడికతీత పనులు చేపట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం కోసం అవసరమైన మొక్కల పంపిణీ కోసం నర్సరీల్లో ఉపాధి కూలీలను వినియోగించినట్టు అధికారులు వివరించారు. ప్రభుత్వ నర్సరీల్లో మొక్కల సంరక్షణ, మొక్కల పెంపకానికి కవర్లలో మట్టి నింపడం తదితర పనులను ఉపాధి హామీ పథకం కూలీలతో చేయించినట్టు వెల్లడించారు.


గతేడాది అంతంతే..

కొవిడ్‌ వ్యాప్తి కారణంగా గత (2020–21) ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పనులు దాదాపుగా నిలిచిపోయాయి పేర్కొనవచ్చు. గత సంవత్సరం రూ.857.41 కోట్లతో 26,352 పనులను చేపట్టాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. కానీ ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యేనాటికి కొవిడ్‌వ్యాప్తి, లాక్‌డౌన్‌ కారణంగా కూలీలు పనులకు రాలేదు. కొవిడ్‌ లేదని నిర్దారించుకున్న అనంతరం అతికొద్ది ప్రాంతాల్లో పూడికతీత, పొదలు తొలగించడం, కందకాలు తీయడం తదితర పనులు జరిగాయి. కానీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.42.62 లక్షల విలువైన 81 పనులను పూర్తిచేశారు.

Updated Date - 2021-12-07T04:10:38+05:30 IST