సాగుకు ‘ఉపాధి’ ఊతమెప్పుడు?

ABN , First Publish Date - 2021-01-18T05:43:35+05:30 IST

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయరంగానికి పూర్తిస్థాయిలో అనుసంధానం చేయాలన్న రైతుల అభ్యర్థన అరణ్య రోదనగానే మిగిలిపోతోంది. ప్రస్తుతం కొన్ని పనులకే పరిమితమైన ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తే రైతులకు ఎంతో మేలు కలుగుతుంది.

సాగుకు ‘ఉపాధి’ ఊతమెప్పుడు?

నీతి ఆయోగ్‌ సూచించినా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం
గ్రామాల్లో తీవ్రంగా వేధిస్తున్న కూలీల కొరత
తడిసిమోపెడవుతున్న కూలీల ఖర్చు.. ఇబ్బంది పడుతున్న రైతులు
అనుసంధానిస్తే రైతులపై తగ్గనున్న భారం


హన్మకొండ, (ఆంధ్రజ్యోతి)
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయరంగానికి పూర్తిస్థాయిలో అనుసంధానం చేయాలన్న రైతుల అభ్యర్థన అరణ్య రోదనగానే మిగిలిపోతోంది. ప్రస్తుతం కొన్ని పనులకే పరిమితమైన ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తే రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సైతం గతంలో చాలాసార్లు ఈజీఎ్‌సను వ్యసాయరంగానికి అనుసంధానం చేయాలని, ఆ దిశగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కానీ దీనిపై నిర్ణయం తీసుకోవలసింది కేంద్ర ప్రభుత్వమే. ఈ విషయమై కేంద్రం ముఖ్యమంత్రుల కమిటీని నియమించింది. ఆ కమిటీ ముసాయిదాను దాదాపు సిద్ధం చేసింది. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులకు పెట్టుబడి భారం తగ్గుతుంది. కూలీలకు కూడా ఏడాది పొడవునా పనులు దొరుకుతాయని రైతులు, రైతు సంఘాల నాయకులు అంటున్నారు.

వేధిస్తున్న కూలీల కొరత
వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రతీ సీజన్‌లో కూలీల సమస్య తీవ్రమవుతోంది. ఉపాధి హామీ పథకం రావడంతోనే ఈ పరిస్థితి దాపురించిందన్న వాదన ఉన్నది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 5,65,534 మంది రైతులు ఉన్నారు. 23,50,023 ఎకరాల్లో వివిధ పంటలను సాగుచేస్తున్నారు. 12.10లక్షల మంది జాబ్‌కార్డులు కలిగి ఉన్నారు. సరాసరిగా 37,200 మంది కూలీలు ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో క్రమంగా పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుండడంతో కూలీల కొరత తీవ్రమవుతోంది. యంత్రాలు లేకుంటే సాగు మానుకోవలసిన దుస్థితి తలెత్తుతోంది. ప్రస్తుతం యాసంగిలో నీటి లభ్యత పెరిగింది. దీంతో అధిక విస్తీర్ణంలో పంటలు వేసే అవకాశమున్నందున సాగుకు ఈజీఎ్‌సను అనుసంధానిస్తే రైతులకు మేలు కలుతుంది.

నీతి ఆయోగ్‌ సూచన
వ్యవసాయానికి ఉపాధిహామీ పనులను పూర్తి స్థాయిలో అనుసంధానించాలని 2016 ఏప్రిల్‌లోనే కేంద్ర ప్రభుత్వానికి  నీతిఆయోగ్‌ సూచించింది. ఈజీఎస్‌ ద్వారా చేపట్టే పొలం పనుల్లో 75శాతం రైతులు భరించేలా, 25శాతం ప్రభుత్వం చెల్లించేలా వ్యవసాయ పనులను చేపట్టాలని తెలిపింది. కానీ ఇప్పటివరకు సాగు పనులకు ఉపాధి హామీ ఊతం అందనే లేదు. రైతులు స్వతహాగా చేపట్టే తమ పొలాల్లోని పనులను ఈజీఎ్‌సకు అనుసంధించాలని నీతిఆయోగ్‌ సూచించినా అమలు చేయడం లేదు.

సాగు పనులు
ప్రస్తుతం ఈజీఎస్‌ కింద వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా పందిరి కూరగాయల సాగు, షెడ్ల నిర్మాణం, బావుల తవ్వకం, పూడికతీత, ఫీడర్‌ చానళ్లు, నీటి నిల్వ కందకాల తవ్వకం, వర్మీ కంపోస్టు గుంతల తవ్వకం, ఇంకుడుగుంతలు, గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు డంపింగ్‌ యార్డుల నిర్మాణాలను చేపడుతున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో ఏటా సుమారు రూ.450కోట్ల నిధులను ఈజీఎస్‌ పనులకు వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరినాట్లు, పత్తి తీత, కలుపు నివారణ, పసుపు తీయడం, నూర్పిడులు తదితరాలకు ఉపాధిహామీ ద్వారా సాయమందించేలా ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.

భారమైన కూలీల ఖర్చు
ఇటీవల వ్యవసాయ పనులకు వెళ్లే కూలీల సంఖ్య తగ్గడంతో సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో వ్యవసాయ పనులు జోరుగా సాగే రోజుల్లో ఉపాధి హామీ పనులను నిలిపివేయాల్సి వస్తోంది. పొలాల్లో నాట్లు వేసినప్పటి నుంచి కోతలు, నూర్పిడుల వంటి పనులకు కూలీలు దొరకడం లేదు. సమీప గ్రామాల నుంచి ట్రాలీ ఆటోలు, ట్రాక్టర్లలో కూలీలను తెచ్చుకుంటున్నారు. ఇలా కూలీలకు రవాణా ఖర్చులతో రైతులపై ఆర్థికభారం పడుతోంది. ఒక్కో కూలీకి సగటున రూ.200 నుంచి రూ.300వరకు చెల్లిస్తున్నారు. ఇలా ఒక ఎకరం పత్తి చేనులో కలుపు తీయడానికి రోజుకు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు ఖర్చవుతోంది. సాగు కాలంలో ఎకరం పొలంలో కలుపు తీయడానికి రైతుకు రూ.10వేలకు పైగా వ్యయమవుతోంది. కొన్ని సందర్భాల్లో కూలీలు దొరక రైతులు ఎక్కువ కూలి చెల్లించి వ్యవసాయ పనులను చేయించుకోవాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో వ్యవసాయానికి ఈజీఎ్‌సను అనుసంధానిస్తే రైతులకు కూలీల కొరత తీరి ఆర్థికంగానూ కలిసివస్తుంది. కూలీలకూ ఏడాది పాటు పనులు లభిస్తాయి. వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు నీటికుంటల నిర్మాణం, పండ్ల తోటలు, కూరగాయలు సాగుచేయడం, మెట్ట ప్రాంతంలో చిన్న వంకలకు అడ్డంగా వర్షపు నీటిని నిలిపి భూగర్భజల మట్టాన్ని పెంచేందుకు చిన్నఊట కుంటను నిర్మించడం తదితర పనులు కొంత ఉపయుక్తంగా ఉన్నా రైతులకిచ్చే రాయితీని పెంచాలి. బావుల్లో పూడికతీత చేపట్టాలి. వర్షాధారిత పండ్లతోటల పెంపకానికి పూర్తిస్థాయి ప్రోత్సాహాకాలు అందిస్తే మేలని అన్నదాతలు చెబుతున్నారు. పాలకులు ఈ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

పెద్ద రైతులకే యంత్రాలు
కూలీల కొరతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. 50 నుంచి 90శాతం వరకు సబ్సిడీతో రైతులకు వ్యవసాయ పరికరాలను పంపిణీ చేస్తోంది. ఈ పథకాన్ని పెద్ద రైతులు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ఐదెకరాలలోపు పొలం ఉన్న చిన్న, సన్నకారు రైతులు వీటిని వినియోగించుకునేవీలు లేదు. యంత్రాల అద్దె కంటే కూలీల ఖర్చే తక్కువగా ఉందని రైతులు చెబుతున్నారు. పైగా యంత్ర పరికరాలు కావాలంటే ప్రజాప్రతినిధుల సిఫార్సులతో పాటు అధికారులు, దళారులకు మామూళ్లు ఇచ్చుకోవాల్సి వస్తోందని, అందుకే వాటి జోలికి వెళ్లడం లేదని రైతులు చెబుతున్నారు.

Updated Date - 2021-01-18T05:43:35+05:30 IST