Abn logo
May 23 2020 @ 10:47AM

తూర్పు గోదావరి జిల్లాలో కలకలం.. చనిపోయిన వ్యక్తి నుంచి 8మందికి కరోనా..

ఒక్కరోజే 11 కేసులు.. తూర్పు గోదావరి జిల్లాను కుదిపేస్తున్న కొవిడ్‌ కేసులు 

8 మందికి జీజీహెచ్‌లో వైరస్‌తో మృతి చెందిన వ్యక్తి ద్వారా వ్యాప్తి

అంతా దగ్గర బంధువులే.. ఆరుగురిది గొల్లలమామిడాడ, ఇద్దరిది బిక్కవోలు

బాధితుల్లో ఇద్దరు మహిళలు, ఆరుగురు పురుషులు, సగంమంది 50 ఏళ్లవారే 

మృతునికి రామచంద్రపురం వెళ్లినప్పుడు వైరస్‌ సోకినట్టు అంచనా

విదేశాల నుంచి వచ్చి బొమ్మూరు క్వారంటైన్‌లో ఉన్న ఇద్దరికి పాజిటివ్‌

రాజమహేంద్రవరంలో సీతంపేటకు చెందిన  25 ఏళ్ల యువకుడికీ కొవిడ్‌ 

జిల్లాలో మొత్తం 75 కు చేరిన కేసులు

ఒకేరోజు 11 కేసుల నిర్ధారణ తొలిసారి

గత నెల 18న రాజమహేంద్రవరం, పిఠాపురంలో ఒకే రోజు ఆరు కేసులు 


కాకినాడ-ఆంధ్రజ్యోతి ప్రతినిధి: తూర్పు గోదావరి జిల్లాను కొవిడ్‌ కేసులు కుదిపేస్తున్నాయి. ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదుకాని ప్రాంతాల్లో కొత్తగా ఇవి వెలుగులోకి వస్తుండడంతో వైద్యులు, అధికారులు తల పట్టుకుంటున్నారు. వారం రోజులుగా వరుసపెట్టి ఎక్కువ సంఖ్యలో పాజిటివ్‌లు నిర్ధారణ అవుతుండడంతో ఆయా ప్రాంతాల్లో కలకలం రేగుతోంది. పైగా ఇప్పుడు వస్తున్న కేసులన్నీ కొత్త ప్రాంతాలే కావడంతో తగ్గిపోయాయనుకున్న రెడ్‌జోన్‌లను మళ్లీ పెంచుతున్నాయి. తాజాగా జిల్లాలో శుక్రవారం ఒక్కరోజే ఏకంగా పదకొండు పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో ఎనిమిది మందికి కొవిడ్‌తో గురువారం మృతి చెందిన వ్యక్తి ద్వారా వ్యాపించినట్టు వైద్యశాఖ నిర్ధారణకు వచ్చింది. ఇందులో ఇద్దరు మహిళలు, ఆరుగురు పురుషులుండగా, సగం మంది వయస్సు యాభై ఏళ్లపైనే. పైగా వీరంతా సదరు మృతుడి రక్త సంబంధీకులు, దగ్గరి బంధువులే. 


కొవిడ్‌తో గురువారం మృతిచెందిన 53 ఏళ్ల వ్యక్తి ఇటీవల రామచంద్రపురం వెళ్లారు. ఈయనకు గొల్లలమామిడాడలో సొంతంగా ఓ ఫొటో స్టూడియో ఉంది. అందులో భాగంగా వివాహ ముహూర్తాలకు ఫోటోల కాంట్రాక్టు కుదుర్చుకుంటాడు. ఈ పనిలో భాగంగా ఇటీవల రామచంద్రపురంలో ఓ శుభకార్యానికి హాజరైనట్టు వైద్యశాఖ గుర్తించింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాతే సదరు వ్యక్తి వైరస్‌ బారిన పడ్డారని అధికారులు దాదాపు అంచనాకు వచ్చారు. ఆ తర్వాత అనపర్తికి వెళ్లి కంటి పరీక్ష చేయించుకున్నాడు. అక్కడ్నించి బిక్కవోలులో మేనకోడలు ఇంటికి వెళ్లాడు. అయితే కొవిడ్‌ సంగతి తెలియకపోవడం, వైరస్‌ కాస్తా ముదిరి ఈయన మృతి చెందాడు. అయితే శుక్రవారం ఎనిమిది మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, వీరందరికి సదరు మృతుడి ద్వారా వైరస్‌ వ్యాపించినట్టు అధికారులు గుర్తించారు. ఇందులో ఆరుగురు మృతుడి రక్త సంబంధీకులు, మరికొందరు ఇంటికి దగ్గర్లో నివసిస్తున్న వ్యక్తులు. 


ఈ ఆరుగురిలో ముగ్గురి ఇంటి పేరు మృతుడి ఇంటి పేరు వారే. ఇందులో ఓ మహిళ వయ స్సు (50), ఇద్దరు పురుషుల్లో ఒకరిది (40), మరొకరిది (19) ఏళ్లుగా గుర్తించారు. మిగిలిన ముగ్గురిలో ఒకరిది వయస్సు (37) మరొకరిది (50), ఇంకొకరిది (59)గా నిర్ధారించారు. మరో ఇద్దరు బాధితులు బిక్కవోలులో తేలారు. ఇందులో 50 ఏళ్ల మహిళ.. మృతి చెందిన వ్యక్తికి మేనకోడలు వరుస అవుతారు. వీరిని చూసేందుకు సదరు వ్యక్తి ఈనెల 15న బిక్కవోలు వచ్చి ఒకరోజు అక్కడే ఉన్నాడు. దీంతో మేన కోడలితోపాటు ఆమె మనవడు (17)కి కూడా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఈ ఎనిమిది మందిని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. మరోపక్క తొలిసారిగా బిక్కవోలులో కొవిడ్‌ కేసులు రావడంతో ఈ ప్రాంతాన్ని రెడ్‌ జోన్‌లో చేర్చారు. పాజిటివ్‌ వచ్చిన ఇద్దరు వ్యక్తుల ప్రైమరీ కాంటాక్ట్స్‌ కింద ఆరుగురిని క్వారంటైన్‌కు తరలించారు. అటు గొల్లలమామిడాడలో మృతుడి కాంటాక్ట్స్‌, ఆయన బంధువుల కాంటాక్ట్స్‌ కింద 30 మందిని గుర్తించి కాకినాడ జేఎన్‌టీయూ ప్రభుత్వ క్వారంటైన్‌లో చేర్చారు. మరో 200 మందికి గ్రామంలోనే శుక్రవారం కొవిడ్‌ పరీక్షలు చేశారు. ఫలితాలు శనివారం వెల్లడికానున్నాయి. మామిడాడ గ్రామంలో కొవిడ్‌ అనుమానితులు ఉండే ప్రాంతం కిక్కిరిసి ఉండడంతోపాటు ఇళ్లు దగ్గరదగ్గరగా ఉండడం, జనసాంద్రత అధికంగా ఉన్న నేపథ్యంలో అధికారుల సూచన మేరకు మరో 200 మందికి శనివారం శ్వాబ్‌ టెస్ట్‌లు చేయాలని నిర్ణయించారు. గ్రామం లో ప్రత్యేక పారిశుధ్య పనులు వెంటనే చేపట్టారు.


బొమ్మూరులో మరో ముగ్గురికి...

బొమ్మురు క్వారంటైన్‌లో ఉంటున్న ముగ్గురికి శుక్రవారం పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరు ముగ్గురు 30ఏళ్లలోపు యువకులే. ఇందులో ఇద్దరు మూడు రోజుల కిందట విదేశాల నుంచి విశాఖ విమానాశ్రయంలో దిగి బొమ్మూరు క్వారంటైన్‌కు వచ్చారు. వీరికి పాజిటివ్‌గా తేలింది. అటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి వచ్చిన మరో 25 ఏళ్ల యువకుడికి కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాజ మహేంద్రవరం నగరంలోని సీతంపేట ప్రాంతానికి చెందిన యువకుడిగా ఇతడిని గుర్తించారు. మరోపక్క గురువారం కొవిడ్‌తో మృతిచెందిన వ్యక్తికి వైద్యసేవలందించిన 14 మంది వైద్యులను కాకినాడలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో వేర్వేరు గదులు బుక్‌చేసి అందులో ఉంచారు. వీరికి ఈనెల 25న శ్వాబ్‌ టెస్ట్‌లు చేయనున్నారు. కాగా జిల్లాలో 11 కేసులు ఒకేరోజు నమోదవడం ఇదే తొలిసారి. గతనెల 18న జిల్లాలో ఒకేరోజు ఆరు కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అంతకుమించిన సంఖ్యలో శుక్రవారం కేసులు పెరిగాయి. 


మామిడాడలో  ‘రెడ్‌’ అలర్ట్‌!

జీ మామిడాడకు చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందడంతో స్థానిక మండలంలోని పలు గ్రామాల్లో కలకలం రేగింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జీ మామిడాడ, పరిసర గ్రామాల్లో పరిస్థితి ఆరా తీయడానికి శుక్రవారం కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి వచ్చారు. సాధారణ పరిస్థితికి వచ్చేవరకు జి మామిడాడను ఆయన రెడ్‌జోన్‌గా ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి, కాకినాడ ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ, కాకినాడ రూరల్‌ సీఐ ఆకుల మురళీకృష్ణతో కలిసి చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న వైద్యులకు పలు సూచనలు చేశారు. అనంతరం స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో స్థానికులకు చేస్తున్న శ్వాబ్‌ పరీక్షల తీరు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో, సమీప ప్రాంతాల్లో ఎవరికి ఎటువంటి జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఉన్నా స్వచ ్ఛందంగా పరీక్షలు చేయించుకుంటే మంచిదన్నారు. అనుమానిత లక్షణాలున్న వారు ఆత్మన్యూనత భావంతో వెనకంజ వేస్తే తర్వాత ఇబ్బంది పడతారన్నారు. ప్రజలంతా సహకరించా లని, అందరికీ శ్వాబ్‌ పరీక్షలు పూర్తి చేస్తామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే కొందరిని కాకినాడ క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించామని, వైద్యుల పర్యవేక్షణలో వారందరికీ వైద్య పరీక్షలు చేయిస్తామ న్నారు. అనంతరం ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి మాట్లా డుతూ కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలకు స్వగ్రామంలో దహన సంస్కారాలు చేయడాన్ని అడ్డుకుం టున్నారని, ఇది పొరపాటన్నారు. ఇందుకు భిన్నంగా మామిడాడ ప్రజలు అభ్యంతరం చెప్పకుండా సహకరిం చడాన్ని అభినందించారు. మృతి చెందిన వ్యక్తితో సన్నిహి తంగా మెలిగిన వ్యక్తులకు పరీక్షలు చేయగా ఆరు పాజి టివ్‌ కేసులు వెలుగు చూశాయి. వీరిని వైద్యుల పర్యవేక్ష ణలో క్వారరటైన్‌కు తరలించామని ఆర్డీవో తెలిపారు. స్థానిక పరిస్థితులను మండల తహశీల్దార్‌ రాజ్యలక్ష్మి, ఎంపీడీవో విజయభాస్కర్‌, ఎస్‌ఐ లక్ష్మి పర్యవేక్షిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement