Abn logo
Sep 26 2021 @ 23:22PM

ఇక దండనే!

చిల్లకూరు మండలం తమ్మినపట్నంలోని కృష్ణపట్నం పోర్టు భూములు ఇవే!

భూ రికార్డుల తారుమారుపై ఉన్నతాధికారుల కన్నెర్ర

ప్రభుత్వ భూముల ట్యాంపరింగ్‌పై చర్యలకు సిద్ధం

చిల్లకూరులో 13 మందిపై క్రిమినల్‌ కేసులు

మిగిలిన మండలాల అధికారులపైనా ప్రభుత్వానికి సిఫారసు

పొదలకూరులో మరిన్ని రికార్డుల తారుమారు!

రాజకీయ ఒత్తిళ్లకూ ససేమిరా!


జిల్లాలో భూ రికార్డుల తారుమారుపై ఉన్నతాధికారులు కన్నెర్రజేస్తున్నారు. సాక్షాత్తు రెవెన్యూ అధికారులే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతుండటంతో కఠిన చర్యలు ఉపక్రమిస్తున్నారు. ప్రభుత్వ భూముల రికార్డులు ట్యాంపరింగ్‌ చేసిన వారిపై క్రిమినల్‌ చర్యలకు సిఫారసు చేస్తున్నారు. ఇటు రికార్డులు మార్పు చేసిన వారు, అటు చేయించుకున్న వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తున్నారు. చిల్లకూరు మండలం తమ్మినపట్నంలోని సుమారు 210 ఎకరాల కృష్ణపట్నం పోర్టు భూములను ఇతరుల పేర్లపైకి మార్చిన ఘటనలో ఇప్పటికే తహసీల్దారు, ఆర్‌ఐ, కంప్యూటర్‌ ఆపరేటర్లను సస్పెండ్‌ చేశారు. ఇప్పుడు తహసీల్దారు, ఆర్‌ఐతోపాటు భూములు మార్పు చేసిన 11 మందిపై గూడూరు ఆర్డీవో మురళీకృష్ణ క్రిమినల్‌ కేసు పెట్టారు. ఇది రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపుతోంది. మిగిలిన మండలాల్లో జరిగిన భూ కుంభకోణాల్లోని బాధ్యులపై క్రిమినల్‌ చర్యలకు ఉన్నతాధికారులు ఆదేశించారు. 

- నెల్లూరు (ఆంధ్రజ్యోతి)


పొదలకూరు మండలంలో రికార్డులను ఇష్టానుసారంగా మార్చేసినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. గత తహసీల్దారు ఇక్కడ నుంచి బదిలీ అయ్యి వెళ్లిపోయిన తర్వాత తనకు తెలియకుండా రికార్డులు మార్పు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్యూటర్‌ ఆపరేటర్లు రికార్డులు మార్చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్షాలు కూడా ఆందోళన చేయడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఫిర్యాదులో తహసీల్దార్‌ పేర్కొన్న సర్వే నెంబర్లే కాకుండా గడిచిన రెండేళ్లుగా పొదలకూరు మండలంలో జరిగిన మ్యుటేషన్లను ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ క్రమంలో అనేక అక్రమాలు వెలుగుచూసినట్లు తెలిసింది. ఈ అక్రమాలపై ఇప్పటికే రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక రిపోర్డును ఇప్పటికే సమర్పించగా త్వరలోనే పూర్తిస్థాయి నివేదికను అందించనున్నారు. కాగా వెంకటాచలం మండలంలో జరిగిన భూ కుంభకోణంపై కూడా ఉన్నతాధికారులు విచారణ జరిపారు. అక్కడి తహసీల్దార్‌ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను సైదాపురంలో ఓ కంప్యూటర్‌ ఆపరేటర్‌ ప్రకాశం జిల్లా గుడ్లూరు తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి అందజేసినట్లు పోలీసు విచారణలో తేల్చారు. ఈ క్రమంలో అసలు వెంకటాచలం తహసీల్దార్‌ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ బయట వ్యక్తులకు ఎలా చేరాయన్న దానిపై కూడా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. గుడ్లూరు డిప్యూటీ తహసీల్దార్‌ సెలవులో ఉన్నప్పటికీ అతని డిజిటల్‌ కీ నుంచి రికార్డులు మార్పు చేయడంతో అతడినే బాధ్యుడిని చేస్తూ అక్కడి కలెక్టర్‌ సస్పెండ్‌ చేయడం గమనార్హం. కలువాయి మండలంలోనూ ప్రభుత్వ భూములను ఇతరులకు ధారాదత్తం చేసిన తహసీల్దార్‌ను సస్పెండ్‌ చేశారు. మరి తదుపరి ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది చూడాలి. 


ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు


ప్రభుత్వ భూముల రికార్డుల తారుమారును తీవ్రంగా పరిగణిస్తున్న ఉన్నతాధికారులు సంబంధిత అక్రమార్కులపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఈ తరుణంలో వారిపై తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నట్లు రెవెన్యూ వర్గాల ద్వారా తెలుస్తోంది. సంబంధిత మండలాధికారులతోపాటు భూములు మార్పు చేయించుకున్న వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా రాజకీయంగా అడ్డుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఉన్నతాధికారులు మాత్రం భూముల వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు కలెక్టర్‌ను కలిశారు. రికార్డులను తారుమారు చేసిన అధికారులు, ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్‌ కేసులు మాత్రం పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. వీరిపై కలెక్టర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవద్దని చెబుతున్నారా!? అంటూ ఆగ్రహించారు. ఇటువంటి విజ్ఞాపనలతో అయితే తనను కలవవద్దని ఆయన హితవు పలికారు. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చేది రికార్డులు మార్చేసి వెళ్లడానికా అంటూ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులను కలెక్టర్‌ ప్రశ్నించడం గమనార్హం. ఈ నేపథ్యంలో భూ అక్రమార్కులపై ఎప్పుడు, ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 


సీసీఎల్‌ఏ చర్యలు తీసుకోవాల్సి ఉంది 


పొదలకూరు మండలంలో జరిగిన భూ రికార్డుల ట్యాంపరింగ్‌పై ఆధారాలతో సహా సీసీఎల్‌ఏ ఉన్నతాధికారులకు నివేదిక పంపాం. వారు బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ రికార్డుల మార్పునకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికను మూడు, నాలుగు రోజుల్లో పంపుతాం. గడిచిన రెండేళ్ల కాలంలో జరిగిన మ్యుటేషన్లపై విచారణ జరిపాం. తహసీల్దార్‌ ఫిర్యాదు చేసినవే కాకుండా మరికొన్ని రికార్డులు కూడా మారినట్లు గుర్తించాం. మారిన రికార్డులన్నింటినీ రివర్స్‌ చేయిస్తాం. 

- ఎంఎన్‌ హరేందిరప్రసాద్‌, జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ)