ఈకేవైసీ లేకుంటే అన్నీ కట్‌..!

ABN , First Publish Date - 2021-08-18T06:40:21+05:30 IST

నాలుగేళ్ల కిందట ప్రజాసాధికార సర్వే చేపట్టిన రాష్ట్రప్రభుత్వం ఈకేవైసీ వివరాలను నమోదు చేసింది.

ఈకేవైసీ లేకుంటే అన్నీ కట్‌..!
కందుకూరు ఆంధ్రాబ్యాంకులోని ఆధార్‌ కేంద్రం వద్ద బారులుదీరిన జనం (ఇన్‌సెట్‌లో) ఒంగోలు సంతపేటలోని ఆధార్‌ కేంద్రంలో సిగ్నల్‌ రాకపోవటంతో ప్రహరీగోడపై ల్యాప్‌టాప్‌తో ప్రయత్నిస్తున్న సిబ్బంది

పథకాల్లో కోతకు చర్యలు 

రేషన్‌ కోటా రద్దు

అనుసంధానం కోసం పిల్లలు, పెద్దల అవస్థలు 

పేరుకే ప్రజల ముంగిటికి సేవలు 

అయినా వీధుల్లో తప్పని బారులు 

ఆధార్‌ అప్‌డేషన్‌ కోసం పట్టణాలకు పరుగులు 

అక్కరకు రాని సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ 

 గ్రామగ్రామానా సచివాలయాలు, ప్రజలకు సత్వర సేవలు, ఇంటి వద్దకే పథకాలు అని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా ఆచరణలో ప్రజల పాట్లు వర్ణనాతీతమయ్యాయి. నెలకొక కొత్త నిబంధన అమలు చేస్తూ ఆధార్‌తో అనుసంధానం అంటుండటంతో అనేక అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు ఈకేవైసీ పేరుతో పథకాల్లో కోతకు ప్రభుత్వం సిద్ధమైంది. నిర్ణీత గడువు లోపు ఈకేవైసీ చేయించుకోకుంటే రేషన్‌  కోటా కట్‌ చేయడంతోపాటు, పథకాలను కూడా నిలిపివేయాలని నిర్ణయించింది. దీంతో కరోనా విపత్తు సమయంలో  ప్రజలు గుంపులుగుంపులుగా ఆధార్‌ కార్డులు పట్టుకుని పట్టణాలకు పరుగులు తీస్తున్నారు. మీసేవ, ఆధార్‌ అప్‌డేషన్‌ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అత్యాధునిక పరిజ్ఞానం తో ప్రతి సచివాలయం ఒక మీసేవా కేంద్రంగా భాసిల్లుతుందని, గ్రామంలో ప్రజలకు ఏ అవసరం వచ్చినా బయటకు వెళ్లాల్సిన పని లేకుండా అక్కడి సిబ్బంది ఉచిత సేవలందిస్తారని సీఎం ఆర్భాటంగా ప్రకటించారు. అయితే సచివాలయ వ్యవస్థ ఏర్పడి రెండేళ్లు పూర్తి కావస్తున్నా హడావుడి తప్ప ప్రజలకు ఏ పనీ చేయలేని నిస్సహాయ స్థితి నెలకొంది. ప్రస్తుతం లక్షలాది మందికి ఈకేవైసీ చేయించాల్సి ఉంది. ఒక్కో కేంద్రంలో రోజుకి అరవై మంది అంటే నాలుగైదు నెలలపాటు ప్రజలకు ఈ తిప్పలు తప్పని దుస్థితి కనిపిస్తోంది.

కందుకూరు/ఒంగోలు (కార్పొరేషన్‌), ఆగస్టు 17 : నాలుగేళ్ల కిందట ప్రజాసాధికార సర్వే చేపట్టిన రాష్ట్రప్రభుత్వం ఈకేవైసీ వివరాలను నమోదు చేసింది. అయితే అప్పట్లో వివరాలు నమోదు కాని వారికి తాజాగా మరో అవకాశం కల్పించింది. రేషన్‌ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరు ఈకేవైసీ వివరాలు నమోదు చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ ప్రకటించడంతోపోస్టాఫీసులు, బ్యాంకుల్లోని ఆధార్‌ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. గత రెండురోజులుగా ఎక్కడచూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పిల్లలను తీసుకుని వచ్చి పెద్దలు ఆయా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.నమోదుకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో, ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సర్వర్‌ మొరాయిస్తుండటం వారిని మరింత కలవరపెడుతోంది. 


కార్డుదారుల పరుగులు

రేషన్‌కార్డులోని సభ్యులందరూ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని కార్డుదారులంతా అవస్థలు పడుతున్నారు. వేకువజాము నుంచే పోస్టాఫీసులు, బ్యాంకుల్లోని ఆధార్‌కేంద్రాల వద్ద కుటుంబసభ్యులతో సహా బారులు తీరుతున్నారు. రోజూ వందల సంఖ్యలో కార్డుదారులు రావడంతో ఆధార్‌ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం కొవిడ్‌ బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది. అయితే ఈకేవైసీ నమోదు కేంద్రాల వద్ద ఎలాంటి భౌతికదూరం లేకపోవడం గమనార్హం. నవీకరణ కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది కూడా ఈనెల 25లోపు ఈకేవైసీ చేయించుకోవాలన్న నిబంధన ఉండటంతో అందరూ పరుగులు తీస్తున్నారు. కార్డులోని సభ్యులు ఈకేవైసీ చేయించుకోని పక్షంలో వచ్చే నెల నుంచి రేషన్‌ రాదని, అలాగే ప్రభుత్వం విద్యార్థులకు అందించే వివిధ పథకాలకు అనర్హులుగా గుర్తిస్తారని తెలియజేస్తుండడంతో వందలాది మంది రేషన్‌ కార్డుదారులు అవస్థలు పడుతున్నారు. 


మొక్కుబడిగా సచివాలయ కేంద్రాలు

ప్రస్తుతం రేషన్‌ కార్డుల ఈకేవైసీ కార్యక్రమాన్ని ప్రకటించటమే గాక తక్షణం  చేయించుకోని వారికి వచ్చేనెల నుంచి రేషన్‌ నిలిచిపోతుందని హెచ్చరించారు. కార్డులో ఉన్న ప్రతి సభ్యుడు వ్యక్తిగతంగా ఈకేవైసీ చేయించుకోవాల్సిందేనని అధికారులు ప్రకటించటం జిల్లాలో ఈకేవైసీ చేయించుకోని వారు లక్షల్లో ఉండటంతో కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. గ్రామ సచివాలయ సిబ్బంది కానీ, వార్డు వలంటీర్లు కానీ వీరికి ఏమాత్రం సేవలు అందించలేకపోతుండటంతో ఆధార్‌ అప్‌డేషన్‌ కోసం వ్యయప్రయాసల కోర్చి మీసేవా కేంద్రాల  వద్ద బారులు తీరుతున్నారు. కందుకూరులో మంగళవారం ఉదయం 6గంటలకే వేలాదిమంది ప్రజలు ఆధార్‌ అప్‌డేషన్‌ కోసం మీసేవల వద్ద, ఆధార్‌ కేంద్రాల వద్ద నిలబడటంతో ఏ వీధిలో చూసినా క్యూలైన్లు కొండవీటి చాంతాడుని తలపించాయి. ఒక్కో కేంద్రంలో గరిష్ఠంగా రోజుకి 60మందికి మించి ఆధార్‌ అప్‌డేట్‌ చేసే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. అయితే పని పోగొట్టుకుని వచ్చాం, మళ్లీ రేపు ఎక్కడ వస్తామని వందలాదిమంది సాయంత్రం వరకు క్యూలైన్లలో నిరీక్షించి చీకటిపడ్డాక ఉసూరుమంటూ వెనక్కి వెళ్లిన దుస్థితి. ఈ దశలో అనేకచోట్ల తోపులాటలు కూడా జరగటంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు రంగప్రవేశం చేయక తప్పలేదు. ఈ స్థితిలో సచివాలయాల్లో ఆధార్‌ అప్‌డేట్‌ చేసేలా చర్యలు తీసుకోవటంతో పాటు వలంటీర్లు క్రమపద్ధతిలో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేసేలా పర్యవేక్షించటం ద్వారా ప్రజలకు తిప్పలు తప్పించాలని కోరుకుంటున్నారు. 


Updated Date - 2021-08-18T06:40:21+05:30 IST