ఎన్నికల సందడి

ABN , First Publish Date - 2021-04-15T05:20:36+05:30 IST

నేటితో సిద్దిపేట మున్సిపల్‌ పాలకవర్గం గడువు ముగుస్తున్న క్రమంలో ఎన్నికల జోష్‌ మొదలైంది. నేడు సాయంత్రం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. కులగణన కూడా పూర్తి చేసి ఓటర్ల లెక్క తేల్చారు. ఏయే సామాజిక వర్గానికి ఎన్నెన్ని వార్డులు కేటాయించారో ప్రకటించారు. 43 వార్డుల్లో 129 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక మిగిలింది రిజర్వేషన్లను ప్రకటించి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయడమే తరువాయిగా తెలుస్తున్నది.

ఎన్నికల సందడి
సిద్దిపేట పట్టణంలోని 14వ వార్డులో నిర్వహిస్తున్న ప్రచారం

సిద్దిపేట మున్సిపాలిటీలో ఎలక్షన్‌ జోష్‌

నోటిఫికేషన్‌ విడుదలకు సర్వం సిద్ధం

పూర్తయిన కుల గణన.. నేడు రిజర్వేషన్లు

ప్రచారం మొదలుపెట్టిన ఆశావహులు

నేటితో ముగుస్తున్న పాలకవర్గం గడువు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, ఏప్రిల్‌ 14 : నేటితో సిద్దిపేట మున్సిపల్‌ పాలకవర్గం గడువు ముగుస్తున్న క్రమంలో ఎన్నికల జోష్‌ మొదలైంది. నేడు సాయంత్రం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. కులగణన కూడా పూర్తి చేసి ఓటర్ల లెక్క తేల్చారు. ఏయే సామాజిక వర్గానికి ఎన్నెన్ని వార్డులు కేటాయించారో ప్రకటించారు. 43 వార్డుల్లో 129 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక మిగిలింది రిజర్వేషన్లను ప్రకటించి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయడమే తరువాయిగా తెలుస్తున్నది. 

2016 ఏప్రిల్‌ నెలలో సిద్దిపేట మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. నాడు 34 వార్డులకు ఎన్నికలు జరుగగా.. ప్రస్తుతం పట్టణ జనాభా పెరగడంతో వార్డుల సంఖ్యను పెంచారు. అంతేగాకుండా లింగారెడ్డిపల్లి గ్రామాన్ని విలీనం చేయడంతో మొత్తంగా మరో 9 వార్డులు పెరిగి 43కు చేరాయి. 


నేడు రిజర్వేషన్లు.. నోటిఫికేషన్‌

సిద్దిపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానాన్ని జనరల్‌ మహిళ రిజర్వేషన్‌కు కేటాయించారు. అయితే 43 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రకటించలేదు. కులగణన పూర్తి కావడంతో నేడు ప్రకటించనున్నారు. ఆ తర్వాత నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటివరకైతే ఎస్టీ సామాజికవర్గానికి 1, ఎస్సీ జనరల్‌-2, ఎస్సీ మహిళ-1, బీసీ జనరల్‌-9, బీసీ మహిళ-8, జనరల్‌-10, జనరల్‌ మహిళ-12 వార్డులను కేటాయించారు. ఇందులో 21 మంది మహిళలకు అవకాశం దక్కనున్నది. 


మొదలైన ప్రచారం

ఇంకా నోటిఫికేషన్‌ రాకముందే ఆశావహులు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. తమ వార్డుల్లో ఇంటింటా విస్త్రృతంగా పర్యటిస్తూ ఓటర్ల ఆశీస్సులు కోరుతున్నారు. కరోనా కాలంలో చేసిన సేవలు, కష్టసుఖాల్లో తోడుగా ఉన్న జ్ఞాపకాలను నెమరువేస్తున్నారు. దాదాపు  అన్ని వార్డుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ఇదిలా ఉంటే రిజర్వేషన్లపై పూర్తి స్పష్టత రాకముందే ప్రచారం నిర్వహించడం గమనార్హం. ఒకవేళ రిజర్వేషన్లు అటుఇటుగా వస్తే ఆశావహులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 


నేటితో ముగుస్తున్న గడువు

ఐదేళ్ల పాటు కొనసాగిన సిద్దిపేట మున్సిపల్‌ పాలకవర్గం గడువు ఎల్లుండితో ముగుస్తున్నది. ఇటీవలే ఆఖరి బడ్జెట్‌ సమావేశం కూడా జరిగింది. గడువు ముగియగానే మున్సిపాలిటీ ప్రత్యేకాధికారిగా జిల్లా కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారు. ఈమేరకు గతంలోనే ఉత్తర్వులు జారీ అయ్యాయి. మళ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే నూతన పాలకవర్గం కొలువు దీరుతుంది. అప్పటిదాకా కలెక్టరే స్పెషలాఫీసర్‌గా ఉంటారు. 


ఓటరు తుదిజాబితా సిద్ధం

సిద్దిపేట సిటీ, ఏప్రిల్‌ 14: సిద్దిపేట మున్సిపల్‌ ఓటరు తుదిజాబితాను బుధవారం విడుదల చేశారు. ఈ నెల 6 నుంచి ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు పట్టణంలో కులగణన మొదలుపెట్టింది. 13 వరకు పూర్తిస్థాయిలో సర్వే చేపట్టి వార్డుల వారీగా కుల గణన నిర్వహించి తుదిజాబితా ఎలక్షన్‌ కమీషన్‌ అందించారు. పట్టణంలో మొత్తం 1,00,653 మంది ఉన్నట్లు అధికారులు తేల్చారు. మహిళా ఓటర్లు 50,767 మంది, పురుషులు 49,875 మంది ఉన్నారు. బీసీ ఓటర్లు 66,926 మంది ఉన్నారు. ఎస్టీ ఓటర్లు 927 మంది, ఎస్సీ ఓటర్లు 7,589 మంది, ఇతర కులాల వారు 25,211 ఉన్నారు. 

సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు 129 పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. కరోనా నేపథ్యంలో వార్డులోని ప్రజలు ఇబ్బంది పడకుండ ఒక్కో వార్డులో మూడు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో వార్డులో దాదాపు 2 వేల పైచిలుకు ఓటర్లు ఉండగా వారందరికీ వీలుగా ఉండేందుకు వారి దగ్గరి ప్రాంతాలనే ఎంపిక చేసి పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించారు. నేడు వార్డులవారీగా రిజర్వేషన్లు ప్రకటించనున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో 50 శాతం మహిళలకు సీట్లు కేటాయించడంతో కలెక్టరేట్‌ కార్యాలయంలో డ్రా పద్దతిలో సీట్లు ప్రకటించనున్నారు. మిగతా వార్డులకు కూడా ఇలానే  నిర్ధారించనున్నారు.

Updated Date - 2021-04-15T05:20:36+05:30 IST